Welfare Schemes: గతంలో సంక్షేమపథకాల కోసం ప్రజలు ఎదురు చూసే పరిస్థితి ఉండేదని, కానీ నేడు పేదలను వెదుక్కుంటూ వారి ఇంటి దగ్గరకి వచ్చి తలుపు తట్టి మరీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు, ఇది ఒక గొప్ప మార్పుకి శ్రీకారమని అభివర్ణించారు. అర్హత ఉండి వివిధ కారణాలతో పథకాలు పొందలేని లబ్ధిదారులను గుర్తించి వారికి నగదు బదిలీ అందించే కార్యక్రమానికి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి సిఎం జగన్ శ్రీకారం చుట్టారు. 9,30,809 మందికి రూ.703 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేశారు.
కులం, మతం, ప్రాంతం చూడకుండా, చివరకు రాజకీయాలు, పార్టీలు కూడా పట్టించుకోకుండా అర్హత ఉంటే చాలు, పథకాలు దక్కుతాయనే సంకేతాలు ఇచ్చేలా ప్రతి అడుగూ వేశామని సిఎం జగన్ వెల్లడించారు. ‘అర్హులై ఉండి కూడా దరఖాస్తు చేసుకోకపోవడమో, అర్హత నిర్ధారణలో జరిగిన పొరపాట్లు వలనో, నిర్ణీత గడువు లోగా దరఖాస్తు చేసుకోకపోవడం వల్లో, బ్యాంకు అకౌంట్లు సరిగా లేకపోవడమో… ఇలా కారణాలేవైనా కూడా… అర్హులందరికీ సంక్షేమపథకాలు అందకపోతే అటువంటి వారు ఎవరైనా కూడా మిస్ కాకూడదని.. వారికి కూడా న్యాయం చేసేందుకు ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇదొక గొప్ప విప్లవాత్మక మార్పు’ అని సిఎం జగన్ వివరించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత పారదర్శకంగా సోషల్ ఆడిట్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏకంగా జాబితా ప్రదర్శించి అర్హులైన ప్రతి ఒక్కరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందించే కార్యక్రమం గొప్పగా జరుగుతోందని జగన్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి(రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ జి అనంతరాము, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె సునీత, గ్రామ, వార్డు సచివాలయాల కమిషనర్ షన్ మోహన్, మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు, మెప్మా ఎండీ విజయలక్ష్మి, స్త్రీనిధి ఎండీ నాంచారయ్య ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read : బాబు కనుసన్నల్లో బిజెపి సభ : పేర్ని