Saturday, April 20, 2024
HomeTrending Newsసేవకుడిగా మాత్రమే పనిచేస్తున్నా : సిఎం జగన్

సేవకుడిగా మాత్రమే పనిచేస్తున్నా : సిఎం జగన్

ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గం, ప్రతి ప్రాంతం నిన్నటికంటే నేడు… నేటి కంటే రేపు… బాగుండేలా తమ ప్రభుత్వం ప్రతి రూపాయినీ జాగ్రత్తగా, బాధ్యతగా ఆలోచించి ఖర్చు చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి విషయంలో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు గురించి అలోచించి నిర్ణయాలు తీసుకుంటోందని వెల్లడించారు. ప్రజలిచ్చిన అధికారం ద్వారా తాను ఓ సేవకుడిగా మాత్రమే పనిచేస్తున్నానని చెప్పారు. 74 సంవత్సరాల స్వతంత్రం తరువాత కూడా సమాజంలో ఉన్న వ్యవస్థాగత లోపాలను సరిదిద్దేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వివరించారు.

స్వతంత్రానికి, ప్రజాస్వామ్యానికీ, రాజ్యాంగానికి, సమానత్వానికీ ఆచరణలో అద్దంపడుతూ రాష్ట్రం ముందడుగు వేస్తోందని సగర్వంగా చెప్పగలుగుతానని సిఎం జగన్ ఉద్వేగంగా వెల్లడించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో సిఎం పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఓపెన్ టాప్ జీబులో పరేడ్ లో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు స్వతంత్ర దినోత్సవ సందేశం ఇచ్చారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక న్యాయాన్ని చిత్తశుద్దిగా అమలు చేస్తోన్న ప్రభుతం తమదేనని సిఎం జగన్ స్పష్టం చేశారు. మంత్రివర్గంలో 60 శాతం బిసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించామని, ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నాలుగు వెనుకబడిన వారికే ఇచ్చామని చెప్పారు. గత 26  నెలలుగా రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యుల ఎంపిక, మున్సిపాలిటీల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు; కార్పోరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎంపికలోనూ సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశామని గుర్తు చేశారు. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు యాభై శాతానికి పైబడి ఇచ్చామన్నారు. ఇటీవల భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల్లో కూడా సామాజిక న్యాయాన్ని పాటించామన్నారు.

తమది రైతు పక్షపాత ప్రభుత్వమని సిఎం జగన్ పునరుద్ఘాటించారు. వైఎస్సార్ రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ జల కళ, వైఎస్సార్ రైతు బీమా లాంటి కార్యక్రమాలతో రైతులకు వెన్నుదన్నుగా ఉంటున్నామని చెప్పారు. ప్రభుత్వ  పాతశాలల్లో, ఆస్పత్రుల్లో నాడు-నేడు ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నామని,  31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని, వీటిలో మొదటి దశ ఇళ్ళ నిర్మాణం ఇప్పటికే ప్రారంభ మయ్యిందని వెల్లడించారు. వైఎస్సార్ నేతన్న నేతన్న నేస్తం, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ వాహన మిత్ర, జగన్న చేదోడు, జగనన్న తోడు కార్యక్రమాలతో నిరుపేదలకు అండగా నిలుస్తున్నామన్నారు. సర్వీసులో అత్యుత్తమ సేవలందించిన పోలీసులు, ఉద్యోగులు, శాఖలకు సిఎం బహుమతులు అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్