Friday, March 29, 2024
HomeTrending Newsమహిళల భద్రతకు విప్లవాత్మక చర్యలు: సిఎం

మహిళల భద్రతకు విప్లవాత్మక చర్యలు: సిఎం

Disha Vehicles:  రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. మహిళలకు ఏ చిన్న అన్యాయం జరిగినా ప్రభుత్వం  ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదనే స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చామన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో అంటే దాదాపు ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్‌ కూడా పనిచేస్తోందని చెప్పారు.  సచివాలయం ప్రధాన గేటు వద్ద 163 దిశ పెట్రోలింగ్‌ వాహనాలను, 18 కార్‌ వాన్స్‌ను  జెండా ఊపి సిఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు.

“బందోబస్తుకు వెళ్లినప్పుడు కూడా అక్కచెల్లెమ్మలకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతో ఈ రోజు ప్రత్యేకంగా వాష్‌రూమ్స్, డ్రెస్సింగ్‌ రూములు ఉండే విధంగా… 18 కార్‌ వాన్స్‌ను  కూడా ప్రారంభిస్తున్నాం. మొత్తం 30 కార్‌వాన్స్‌ ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ఇవాళ 18 వచ్చాయి, వాటిని ప్రారంభిస్తున్నాం. మరో 12 రాబోయే రోజుల్లో వస్తాయి. ఈ రోజు కార్‌వాన్స్‌తో పాటు 163 దిశ పోలీస్‌ ఫోర్‌వీల్‌ వాహనాలను కూడా ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే 900 దిశ ద్విచక్రవాహనాలు వివిధ పోలీస్‌ స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి. వాటికి అదనంగా 163 పోర్‌వీలర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నాం” అని జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

దిశ యాప్‌ కోసం, పనితీరును మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తరపునుంచి ఎటువంటి సహకారం కావాలన్నా కూడా అన్నిరకాలుగా ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నామని సిఎం జగన్ పోలీసు ఉన్నతాధికారులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్‌ కె మోషేన్‌ రాజు, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీఐజీ పాలరాజు, దిశ స్పెషల్‌ ఆఫీసర్‌ కృతికా శుక్లా, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : మహిళా సాధికారతలో మనమే మేటి: జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్