ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల ఎంపికపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోందని డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఎంపికలో పారదర్శకత తో పాటు అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పించామని చెప్పారు.
ధర్మాన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు, ఆయన మాట్లాడిన ముఖ్యాంశాలు:
- పార్టీ కోసం ఎవరెవరు కష్టపడతారో వారికి ఫలితం ఉంటుందనడానికి ఈ ఎంపిక లే నిదర్శనం
- గత పాలనకు, ఇప్పటి పాలనకు చాలా తేడా ఉంది
- జాతీయ సర్వేలో సమర్ధులైన సిఎంల జాబితాలో జగన్ మూడో స్థానంలో ఉండడం గర్వకారణం
- గతంలో ఎప్పుడూ చూడని, ఎన్నడూ వినని విధంగా పదవులు ఇచ్చారు.
- వైసీపీలో నాయకుడు ఒక్కడే జగన్. ఇక్కడ వీధికొక నాయకుడు ఉండడు. వర్గాలు, గ్రూపులు అనే మాట వినిపించదు.
- 2019 ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు దాదాపు 60 శాతానికిపైగా సీట్లు కేటాయించి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు జగన్.
- తొలిసారిగా బీసీలకు అనేక అగ్రవర్ణ కులాలకు చెందిన సీట్లను కేటాయించడం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.
- ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఏర్పాటు చేసిన మంత్రివర్గంలోనూ ఏకంగా 56 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించడం ద్వారా జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు.
- నాతో సహా ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే కేటాయించారు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్ పదవినీ బీసీ వర్గాలకు ఇచ్చారు.
- ఇప్పుడు నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కనీసం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని శాసనసభలో బిల్లు ఆమోదించారు.
- ఆ ప్రకారమే దేవాలయాలు, మార్కెట్ కమిటీలు, ఇతర పాలక మండళ్లలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు అత్యధికంగా పదవులు ఇచ్చారు.
- రాష్ట్రంలో తొలి సారిగా బీసీ వర్గాల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, చైర్పర్సన్ పదవులను కేటాయించారు.
- మాల, మాదిగ, రెల్లి కులాలకు వేర్వేరు కార్పొరేషన్ల ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేశారు.