విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ద్వారా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెలన్నీ ఫిబ్రవరి 2024 నాటికి పనులు ప్రారంభించేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విశాఖ సమ్మిట్ ద్వారా 387 ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇందులో పరిశ్రమలు, వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు కుదిరాయని, ఇందులో 13 ఇప్పటికే వాస్తవరూపం దాల్చాయని, రూ.2,739 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 6,858 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు వివరించారు. జనవరి 2024లోపు 38, మార్చి 2024 లోపు మరో 30 కంపెనీలు పనులు పూర్తిచేసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తాయని తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో చేసుకున్న ఒప్పందాలు అమలుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రస్తుతం వాటి పరిస్థితులపై ఆరా తీశారు.
ఐటీ, ఐటీ ఆధారిత సేవలు రంగాలకు విశాఖ హబ్ కావాలని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సిఎం స్పష్టం చేశారు. దీనివల్ల విశాఖనగరం ఖ్యాతి పెరుగుతుందన్నారు. ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు నిరంతరం కొనసాగించాలని సూచించారు. పారిశ్రామిక రంగ ప్రగతిలో MSMEలది కీలక పాత్ర అని, ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కూడా ఈ రంగంలోనే ఉన్నాయని సిఎం అభిప్రాయపడ్డారు. పరిశ్రమల శాఖలో MSMEలకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, ఒక కార్యదర్శిని కూడా నియమించాలని ఆదేశించారు.
నాలుగేళ్ళుగా 10 సార్లు ఎస్‌ఐపీబీ సమావేశాలు నిర్వహించి… 59 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని, వీటిద్వారా రూ. 3,39,959 కోట్ల పెట్టుబడులు, 2,34,378 మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయనిఅధికారులు వెల్లడించారు. 2016 నుంచి 2018 వరకూ గత ప్రభుత్వం భాగస్వామ్య సదస్సుల ద్వారా 1,739 ఎంఓయూలను కుదుర్చుకుంటే రూ. 18,87,058 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పినా వీటిలో 10 శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదని సమావేశంలో వివరణ ఇచ్చారు.
విశాఖ సదస్సు ద్వారా 25 విద్యుత్ ప్రాజెక్టులకోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటిలో 8 ప్రాజెక్టులు ఎస్‌ఐపీబీ ఆమోదం పంపించామని, మరో 4 ప్రాజెక్టుల్లో పనులు ప్రారంభం కానున్నాయని, మరో 8 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయని అధికారులు తెలిపారు. దీనికి మునుపే రాష్ట్ర ప్రభుత్వంతో 20 విద్యుత్ ప్రాజెక్టులకోసం ఒప్పందాలు కుదుర్చుకోగా అందులో 6 ప్రాజెక్టుల్లో పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని, 11 డీపీఆర్ పూర్తిచేసుకున్నాయని పేర్కొన్నారు. వీటిద్వారా మొత్తం 8.85లక్షల కోట్లు పెట్టుబడులు వస్తుండగా, 1,29,650 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇవికాక ఐటీ, ఫుడ్ ప్రాససింగ్, పశుసంవర్థక శాఖ, టూరిజం రంగాల్లో ఒప్పందాలపైనా సీఎం సమీక్ష చేశారు.