పేదలకు తాము చేస్తున్న మంచిని జీర్ణించుకోలేక విపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు పెన్షన్లపై అభాండాలు వేస్తూ.. కట్టు కథలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించేందుకు మానవతా దృక్పథంతో, పారదర్శకంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి పేదవాడికీ మంచి జరగాలన్న లక్ష్యంతోనే తాము పని చేస్తున్నామని, అర్హత ఉన్న ఏ ఒక్కరూ మిగిలి పోకూదదన్న ఉద్దేశంతోనే వారికి కూడా పథకాలు అందిస్తున్నామని వెల్లడించారు. వివిధ పథకాలకు అర్హత ఉండి గతంలో ఆ పథకం పొందలేని 2,79,065 మంది లబ్ధిదారులకు రూ. 590.91 కోట్లను నేడు సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో సిఎం జగన్ జమ చేశారు.
ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ అర్హత ఉన్న ఏ ఒక్కరికీ మిస్ కాకూడదని, అలాగే అనర్హులు ఏ ఒక్కరికీ అందకూడదన్నదే తమ ఉద్దేశమని…. అందుకే ప్రతి ఆరు నెలలకోసారి పథకాలకు సంబంధించి ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే పెన్షన్లపై కూడా ఆడిట్, రీ సర్వే చేస్తున్నామని దీనిలో తప్పేముందని ప్రశ్నించారు. వచ్చే నెల నుంచి పెంచిన పెన్షన్ 2750 రూపాయలను అందిస్తున్నామని అన్నారు. అనుమానం వస్తే నోటీసులు ఇచ్చి సంబంధిత లబ్ధిదారుల నుంచి వివరణ తీసుకుంటారని, దీనిపై రీ వెరిఫై చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని, ఏకపక్షంగా పెన్షన్లు తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కానీ పెన్షన్లు తీసేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. గతంలో 39 లక్షల మందికి ఇస్తే, ఇప్పుడు తమ ప్రభుత్వం 62.70 లక్షల మందికి ఇస్తున్నామని వివరించారు.
తమది మానవత్వం ఉన్న ప్రభుత్వమని, పేదవాడికి దగ్గరగా ఉండే మనసులని, అర్హత ఉండి ఏ ఒక్కరికీ పథకం అందలేదనే మాట రాకూడదని, ఏదైనా అనుమానం వచ్చినా బెనిఫిట్ ఆఫ్ డౌట్ లబ్ధిదారుడికే ఇవ్వాలని సిఎం జగన్ కలెక్టర్లకు సూచించారు. మంచి చేసే వారికి ఎప్పటికీ దేవుడి ఆశీస్సులు ఉంటాయని, విషపు రాతలు, చేష్టలు, వక్రీకరణలు చేసే వారికి దేవుడే మొట్టి కాయలు వేస్తారని అన్నారు. విపక్షాలు, మీడియా రాతల్లో నిజం ఉంటే సరిదిద్దుకుందామని, లేకపోతే దీటుగా బదులివ్వాలని ఆదేశించారు. మనం ప్రజా పాలకులమని, మన అర్ధంలో పాలన అంటే సేవ అనేది ప్రతి కలెక్టర్ దృష్టిలో పెట్టుకోవాలని నిర్దేశించారు.