2.6 C
New York
Thursday, November 30, 2023

Buy now

HomeTrending Newsబెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ ప్రారంభం

బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ ప్రారంభం

No politics: రాష్ట్రానికి సంబంధించి కేంద్రం చేసే మంచి పనులన్నిటికీ… ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా, ఎలాంటి సంకోచం లేకుండా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నామని, రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రకటించారు.  రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి, నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చొరవ చూపిస్తూ పనిచేస్తోందన్నారు. భూసేకరణ తో పాటు ఎలాంటి సమస్యలూ రాకుండా రహదారుల నిర్మాణం వేగంగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  రాష్ట్రంలోని ఇతర రహదారుల నిర్మాణం కోసం రూ. 10,600 కోట్లు కేటాయించామని,   ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రెండు వరసల రహదార్ల కోసం 6,400 కోట్లు, రోడ్ల మరమ్మతుల కోసం 2,300 కోట్లు, పెండింగ్ లో ఉన్న రోడ్లు పూర్తి చేసేందుకు మరో 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వివరించారు. వీటిలో కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు.

రాష్ట్రంలో 21,559 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతోన్న 51 రహదారి ప్రాజెక్టుల ప్రారంభం, భూమిపూజ కార్యక్రమాల్లో కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి లతో కలిసి  వైఎస్ జగన్  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జరిగిన సభలో సిఎం మాట్లాడుతూ  నేడు మొత్తం 51 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని వీటిలో 10,400 కోట్ల రూపాయల వ్యయంతో  741 కిలోమీటర్ల  పాటు 30 రహదారి ప్రాజెక్టులకు కొత్తగా భూమి పూజ;  11, 157 కోట్ల రూపాయలతో చేపట్టిన  21 ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేసుకున్నామని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అయన నాయకత్వంలో కేంద్రంలో రవాణా శాఖా మంత్రిగా పనిచేస్తున్న నితిన్ గడ్కరీ లకు ధన్యవాదాలు తెలిపారు.  2019లో తాను చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి బెంజ్ సర్కిల్ పశ్చిమ ఫ్లై ఓవర్ కూడా మంజూరు చేశారని, దాన్ని నేడు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.  బెంజ్ సర్కిల్ తూర్పు ఫ్లై ఓవర్, కనక దుర్గమ్మ ఫ్లై ఓవర్లను గడ్కరీ సహకారంతో వాయువేగంతో పనిచేసి పూర్తిచేశామన్నారు.

కొత్తగా…

  • విశాఖ పట్నం పోర్టు నుంచి భీమిలి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయి పోర్ట్ వరకు జాతీయ రహదారి 16ను కలుపుతూ ఆరు లేన్ల రహదారి
  • విజయవాడ లో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని తూర్పున కృష్ణా నదిపై 40 కిలోమీటర్ల బైపాస్ నిర్మాణం
  • కడప జిల్లా బాక్రా పేట నుంచి బద్వేల్, పోరుమామిళ్ల మీదుగా ప్రకాశం జిల్లా బెస్తవారిపాలెం రహదారి
  • పుంగనూరు నుంచి పులిచెర్ల మీదుగా చిన్న గొట్టికల్లు రహదారి
  • సబ్బవరం నుంచి చోడవరం, నర్సీపట్నం మీదుగా తుని
  • విశాఖపట్నం నుంచి నర్సీపట్నం, చింతపల్లి, చింతూరు మీదుగా భద్రాచలం వరకు
  • ప్రస్తుతం ఉన్న రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి అభివృద్ధి చేయాలని సిఎం జగన్ విజ్ఞప్తి చేశారు.

తెలుగువారైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిలో ఎప్పుడూ చొరవ చూపిస్తూ  అడుగులు ముందుకేస్తున్నారని, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో మున్ముందు మరింత చొరవ చూపాలని జగన్ కోరారు.

అనంతరం బెంజ్ సర్కిల్ పశ్చిమ ఫ్లై ఓవర్ ను సిఎం, కేంద్ర మంత్రులు ప్రారంభించారు.

Also Read : అభివృద్ధి పథంలో ఏపీ: నితిన్ గడ్కరీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్