Ambulances for Animals: గుమ్మం వద్దనే పశు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అంబులెన్సులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం సమీపంలో జరిగిన కార్యక్రమంలో జెండా ఊపి ప్రారంభించారు. డా. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ. 278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో రూ. 143 కోట్ల వ్యయంతో 175 పశువుల అంబులెన్స్ సేవలు నేటినుంచి అందుబాటులోకి వచ్చాయి. రెండో దశలో రూ. 135 కోట్ల వ్యయంతో త్వరలో మిగిలిన 165 అంబులెన్స్‌లు కొనుగోలు చేయనుంది.
ప్రతి అంబులెన్సులో ఒక పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్ అందుబాటులో ఉంటారు. 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్‌తో కూడిన చిన్న ప్రయోగశాల, అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులతో పాటు పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్ సౌకర్యం ఉండేలా ఏర్పాటు చేశారు. ప్రాధమిక వైద్య సేవలతో పాటు సన్న జీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు వీలుగా వాహనాల రూపకల్పన జరిగింది.
అవసరమైన పరిస్ధితులలో దగ్గరలోని ఏరియా పశువైద్యశాలకు లేదా వెటర్నరీ పాలిక్లీనిక్‌లకు తరలించి పశువుకు సరైన వైద్యం అందించి ప్రాణాపాయం నుండి రక్షించడం జరుగుతుందని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలియజేశారు. వైద్యం అందించిన తరువాత మళ్ళీ ఆ పశువును రైతు ఇంటికి ఉచితంగా తీసుకువస్తారు.
మూగజీవాలు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ 1962 కు ఫోన్ చేసి రైతు పేరు, గ్రామం, మండలం, పశువు అనారోగ్య సమస్య వివరించిన వెంటనే సంబంధిత రైతు భరోసా కేంద్రానికి సమాచారం చేరుతుంది. ఆ వెంటనే పశు వైద్య సహాయకులు పశువు ఉన్న ప్రాంతానికి వెళ్ళి వైద్యసేవలు అందిస్తారు.
ఈ అంబులెన్స్ ల మెయిన్‌టెనెన్స్ ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తూ నెలకు ఒక వాహన నిర్వహణకు రూ. 1.90 లక్షల చొప్పున రెండేళ్ళకు మొత్తం రూ. 155 కోట్ల నిధులను కూడా కేటాయించింది.
నేటి ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాద రావు, డా. సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.