Vidya Kanuka: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించారు. విద్యా సంవత్సరానికి గాను ‘జగనన్న విద్యా కానుక’ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కిట్స్ పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో నేటి నుంచే పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి, తొలిరోజే విద్యాకానుక కిట్లను వరుసగా మూడో ఏడాది అందించడం విశేషం.
జగనన్న విద్యాకానుక క్రింద ప్రతి విద్యార్ధికి ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్ కుట్టుకూలితో సహా, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, బై లింగువల్ టెక్ట్స్ బుక్స్, నోట్‌బుక్స్, వర్క్ బుక్స్ పంపిణీ చేశారు, దీనితో పాటు ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీషు – తెలుగు డిక్షనరీని కూడా అందించారు. నేడు ప్రారంభమైన ఈ పంపిణీ నెలాఖరు వరకూ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదో తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్ధినీ, విద్యార్ధులకు అందించనున్న ఈ కిట్ల కోసం 931.02 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ప్రతీ విద్యార్ధికీ దాదాపు రూ. 2,000 ప్రభుత్వం వెచ్చిస్తోంది.