రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ రాత్రికి హస్తిన చేరుకోనున్న జగన్ రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఇప్పటికే ప్రధాని అపాయింట్ మెంట్ ఖరారైందని సమాచారం.
నిన్న టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఎన్డీయేలో తెలుగుదేశం మళ్ళీ చేరబోతోందని, ఈ మేరకు ప్రాథమికంగా చర్చలు పూర్తయ్యాయని వార్తలు వస్తోన్న నేపథ్యంలో సిఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసమే వెళుతున్నారని చెబుతున్నా రాజకీయ అంశాలు కూడా తప్పకుండా చర్చకు రానున్నాయి.
2014 తరహాలోనే వచ్చే ఎన్నికల్లోనూ బిజెపి-టిడిపి-జనసేన కలిసి పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేసి ఎన్డీయే నుంచి వైదొలగిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేస్తేనే అన్ని విధాలుగా ఉపయోగంఉంటుందని బాబు భావిస్తున్నారు. అయితే బిజెపికి దగ్గర కావడం ద్వారా ముస్లిములు, క్రైస్తవుల ఓట్లకు దూరం కావాల్సి వస్తుందనే భయం కూడా ఆయన్ను వెంటాడుతోంది. అందుకే ఎన్నికల తర్వాత… తమకు మెజార్టీ లభిస్తే భేషరతుగా మద్దతిస్తానని.. ఎన్నికల్లో తనకు సహకరించాలని బాబు చేసిన ప్రతిపాదనను బిజెపి నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అందుకే ముందస్తు పొత్తులకు కూడా బాబు అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలు పూర్తి కాగానే బిజెపిలో చేరిన టిడిపి ఎంపిల ఒత్తిడితోనే బాబును అమిత్, నడ్డాలు కలుసుకున్నారని… టిడిపితో పొత్తుకు మోడీ ససేమిరా అంటున్నారనే మరో వాదన కూడా వినిపిస్తోంది.
మరోవైపు గత ఐదేళ్లుగా కేంద్రంతో సఖ్యతగా వ్యవహరించామని, పలు కీలక బిల్లులకు మద్దతిచ్చామని, గత అనుభవాల దృష్ట్యా టిడిపితో పొత్తుకు బిజెపి సానుకూలం కాదనే అభిప్రాయంలో జగన్ ఇప్పటివరకూ ఉన్నారు. నిన్నటి ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో మరోసారి ఈ విషయంలో ఓ స్పష్టత కోసం జగన్ ప్రయత్నించే అవకాశం ఉందని, రేపటి ప్రధానితో సమావేశంలో ఈ అంశాలు కూడా ప్రస్తావించే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం.