Saturday, January 18, 2025
HomeTrending Newsనేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వస్వామి ఆలయం పునః ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం యాదాద్రికి వెళ్లనున్నారు. ఉదయం 10:25 గంటలకు తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతిస్వామి చేతులమీదుగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 12:30కు మహాపూర్ణాహుతి, అవబృధం, మహాకుంభాభిషేకం చేపడతారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వస్వామి ఆలయం పునః ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రామలింగేశ్వర స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా సోమవారం జరిగే ప్రధానాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దంపతులు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి హోదాలో 20వసారి యాదాద్రికి వస్తున్న కేసీఆర్‌.. రోడ్డుమార్గంలో ఆలయానికి చేరుకొంటారు. ముందుగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకుంటారు. అనంతరం రామలింగేశ్వరస్వామివారి సన్నిధిలో జరిగే మహాకుంభాబిషేక మహోత్సవంలో పాల్గొని నూతనాలయాన్ని పునఃప్రారంభిస్తారు.

ఉదయం 10:25 గంటలను ధనిష్ఠానక్షత్ర సుముహూర్తాన తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి చేతుల మీదుగా సపరివార రామలింగేశ్వర స్పటికలింగ ప్రతిష్ఠ, అష్టబంధం, ప్రాణప్రతిష్ఠ, ప్రతిష్ఠాంగహోమం, అఘోర మంత్రహోమం, దీగ్దేవతాక్షేత్రపాల బలిహరణం, శోభాయాత్ర, కలశప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శివాలయం ప్రధానాలయంతోపాటు ఉపాలయాలపై కలశ స్థాపన పనులు పూర్తయ్యాయి. ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగులు స్తపతులు పూర్తి చేశారు. శివాలయ మహాకుంభాభిషేకంలో భాగంగా మధ్యాహ్నం 12:30 గంటలకు మహాపూర్ణాహుతి, అవబృధం, మహాకుంభాభిషేకం నిర్వహించి స్వామివారి అనుగ్రహ భాషణం చేపట్టనున్నారు. అనంతరం మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ, ప్రతిష్ఠాయాగ పరిసమాప్తి పలుకనున్నారు.

ఘనంగా శతరుద్రాభిషేకం
పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయ మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం బాల శివాలయంలో శివుడికి నిత్యారాధనల అనంతరం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు యాగశాల ద్వార తోరణపూజ శతరుద్రాభిషేకం, మహారుద్రపుశ్చరణ, మూలమంత్రానుష్ఠాన వేదహవనాలు నిర్వహించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8:30 గంటల వరకు రుద్రహవనం, ప్రాసాదస్నపనం, కూర్మశిలా, బ్రహ్మశిలా, పిండికాస్థాపనలు, శయ్యాధివాసం, పుష్పాధివాసం, ప్రాసాదాధివాస వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో గీత, యజ్ఞబ్రహ్మ బండారు శేషగిరిశర్మ, ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు, శివాలయ ప్రధానార్చకుడు నరసింహరాములుశర్మ, ప్రధాన పురోహితుడు గౌరిభట్ల సత్యనారాయణశర్మ తదితరులు పాల్గొన్నారు.

Also Read : వేదాద్రి యాదాద్రి

RELATED ARTICLES

Most Popular

న్యూస్