7.8 C
New York
Saturday, December 2, 2023

Buy now

HomeTrending NewsWorld Heritage Day: చారిత్రక వైభవం తెలంగాణ సొంతం - సిఎం కెసిఆర్

World Heritage Day: చారిత్రక వైభవం తెలంగాణ సొంతం – సిఎం కెసిఆర్

నాటి ఆదిమానవుని కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు, ప్రతీ చారిత్రక దశకు సంబంధించిన మహోజ్వల చారిత్రక వారసత్వ సంపద తెలంగాణ నేలకు స్వంతమని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. “ వరల్డ్ హెరిటేజ్ డే” సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికున్న చారిత్రక ప్రాశస్త్యాన్ని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. నాటి ప్రాచీన భారతదేశంలో ఆవిర్భవించిన షోడశ (16) మహాజనపథాల్లో, దక్షిణ భారతదేశంలో విలసిల్లిన ఒకే ఒక జనపథమైన అస్మక మహాజనపథం తెలంగాణ ప్రాంతంలో నేటి బోధన్ (నాటి పౌధన్య పురం) కేంద్రంగా వెలుగొందడం తెలంగాణ గడ్డకున్న ప్రాచీనతను, ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటుతున్నదని సీఎం అన్నారు.
శాతవాహన వంశం నుంచి మొదలు అసఫ్ జాహీల వరకు సాగిన పాలన తెలంగాణను సుసంపన్నం చేశాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇక్కడి వైవిధ్యభరితమైన నిర్మాణ శైలులు, శిల్పకళలు, ఆయుధాలు, ఆభరణాలు, గుహ చిత్రలేఖనాలు, బొమ్మలు, కట్టడాలు, సంస్కృతి సంప్రదాయాలు, ఆచారాలు, భాష, యాసలు, సాహిత్యం, కళలు వారసత్వ సంపదకు ఆలవాలమని సీఎం అన్నారు. 45 వేల ఏండ్లక్రితమే తెలంగాణ నేలమీద మానవ సంచారం సాగిందనడానికి నేటి జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాలోని పాండవుల గుట్టలో లభ్యమైన ప్రాచీన మానవుని పెయింటింగ్స్ నిదర్శనమని సిఎం అన్నారు.

జైన బౌద్ధ ఆరామాలు, రామప్ప దేవాలయం, వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు కోట, భువనగిరి కోట, గోల్కొండ కోట, పాండవుల గుట్ట, పద్మాక్షి గుట్ట, మెదక్ చర్చి, మక్కా మసీదు, చార్మినార్ వంటి ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు, సహజ నిర్మాణాలు తెలంగాణ చారిత్రక, వారసత్వ వైభవాన్ని, వైవిధ్యతను, ప్రత్యేకతను చాటుతున్నాయని సీఎం పేర్కొన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని, ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడం తెలంగాణ ప్రజలకు, దేశానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. దీంతో పాటు దోమకొండ కోటకు యునెస్కో ఆసియా – పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డు, కుతుబ్‌షాహి టుంబ్స్‌ కాంప్లెక్స్‌లోని మెట్లబావికి యునెస్కో అవార్డు., వంటి పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు సాధిస్తూ ఘనమైన తెలంగాణ వారసత్వం, ప్రపంచ వారసత్వం సంపదగా వెలుగులోకి వస్తున్నదని సీఎం అన్నారు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత వారసత్వ సంపదల పరిరక్షణలో భాగంగా ఖిలావరంగల్ కోట ఆధునీకరణ, చార్మినార్, మక్కా మసీదు వంటి గొప్ప గొప్ప ప్రాచీన కట్టడాలకు మరమ్మతులు, మోజంజాహి మార్కెట్, మోండా మార్కెట్ అభివృద్ధి పనులతో పాటు మరెన్నో కట్టడాలు, ప్రాచీన నిర్మాణాలకు ప్రభుత్వం మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపడుతున్నదని సీఎం తెలిపారు. ఇటీవలె 300 ఏళ్ళ ప్రాచీనమైన బన్సీలాల్ పేట మెట్ల బావితో సహా మరో ఆరు మెట్ల బావులను పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వం రానున్న కాలంలో మరిన్ని బావులను గుర్తించి పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్