Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఆదివారం చండూరు లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. సీఎం కేసిఆర్ ముఖ్య అతిథిగా హాజరై చేసిన ప్రసంగం సభికులను ఆలోచింప చేసింది. నిత్యం ప్రజల్లో వుండే అమాయకుడైన రెడ్డి ని వొడించి గొడ్డలి లాంటి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించారని… నవంబరు 3 న జరిగే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సాయంత్రం 4 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్న టీఆర్ఎస్ అధినేత సీఎం కెసీఆర్ నేరుగా అక్కడే ఏర్పాటు చేసిన అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వేదికపై పార్టీ జెండాను సిఎం కేసిఆర్ ఆవిష్కరించారు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లో…

మునుగోడులో అవసరం లేకుండా వచ్చిన ఉపఎన్నిక జరుగుతోంది. ఆ విషయం మీకు తెలుసు. ఉప ఎన్నిక ఎవరు గెలిచేది కూడా మీరు తేల్చేసిండ్రు.. కొత్తగా చేప్పాల్సిన పని లేదు. ఈ సందర్భంగా నాలుగువిషయాలు మీకు చెప్పాలి.. అని మీ మధ్యకు వచ్చాను. గత 20 రోజులుగా ఎన్నో చర్చలు జరిగాయి. న్యాయం ఏందో… ధర్మం ఏంటో మీకు తెలుసు.  ఎన్నిక రాగానే గాయి.. గాయి గత్తర కావద్దు. .లొల్లి.. లొల్లి.. కొందరు గాల్లోనే నడుస్తుంటారు. విచిత్ర వేషధారులు వస్తారు. ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి. ఎవరు చెప్పిన మాటలైనా విని ఇంటికెళ్లి ఆలోచించండి. ఓటు శక్తివంతమయిన ఆయుధం. అలవోకగా, ఒళ్ళు మరిచిపోయి వేస్తే ఇల్లు కాలిపోతది.  ఎవరికి ఓటేస్తే మన బతుకులు బాగుపడతాయి. నల్లగొండ బాగుపడుతుంది… అని ఆలోచించి ఓటు వేయాలి. తమాషాగా ఓటేయవద్దు. మర్యాద చేశారని, బావమరిది చెప్పారని ఓటు వేయవద్దు. కరిచే పాము అని తెలిసి ఓటేస్తామా? గ్రామంలో పెద్దలు ఆలోచించాలి. దోపిడీ దారులు మాయమాటలు చెబుతారు. వారి మాటలు నమ్మవద్దు.

నిన్న మొన్న ఢిల్లీ బ్రోకర్ గాళ్ళు వంద కోట్లు ఇస్తామంటే ఎడమకాలి చెప్పుతో కొట్టారు.. తెలంగాణ బిడ్డలైన ఎమ్మెల్యేలు. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్థన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు… ఇలాంటి వాళ్ళు మనకు కావాలి. 100 కోట్లు ఇస్తామంటే వద్దన్నారు. గడ్డిపోచలా వాటిని పడేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడారు. అక్రమ ధనం తెచ్చి.. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యుల్ని సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారు.. ఢిల్లీ బిజెపి నాయకులు. మోడీకి రెండుసార్లు పీఎం అవకాశం వచ్చింది. అయినా ఎందుకీ అరాచకం.. ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? దుర్మార్గమయిన పనిచేసి ఆర్ఎస్ఎస్ నేతలు చంచల్ గూడ జైలులో వున్నారు. మోదీ అండదండలు లేకుండానే ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్‌కు వచ్చి ఇంత అరాచకానికి తెగబడ్డార.? వాళ్లు ఆఫర్‌ చేసిన వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ జరగాలి. దీని వెనుక ఎవరు ఉన్నరో వారు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హులు కాదు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంత అరాచకం జరుగుతుంటే మనం మౌనంగా ఉందామా? మేధావులు యువత ఆలోచించాలని కోరుతున్నా’

ఓటు అనేది మ‌న త‌ల రాత రాసుకునే గొప్ప ఆయుధం.  క‌రిచే పాము అని చెప్పి మెడ‌లో వేసుకుంటామా? ఆలోచించాలి. దేశంలో చైత‌న్యం రానంత వ‌ర‌కు దుర్మార్గ రాజ‌కీయాలు కొన‌సాగుతాయి. దోపిడీదారులు మాయ‌మాట‌లు చెప్పి మోసం చేస్తారు. మాయలో పడితే మంచి జరగదు. మనం పండ్లు తినాలంటే.. పండ్ల చెట్లు పెట్టాలి. ఓటు వేసేటప్పుడు ఆలోచించాలి. గాడిదలకు గడ్డి వేస్తే.. ఆవుల నుంచి పాలు రావు. దేశంలో ఏ ప్రధాని చేయని దుర్మార్గం.. మోడీ చేస్తున్నాడు. చేనేతలపై భారం వేశారు. ఏ విధంగా బీజేపీకి ఓటువేయాలి. అన్నంలో సగం లాక్కుంటా.. నాకే ఓటు వేయి అంటే ఓటు వేస్తామా? మన వేలితో మన కన్ను పొడుచుకుందామా? జీఎస్టీ వాపసు తీసుకోవాలంటే.. చేనేతలు ఒక్క ఓటు కూడా బీజేపీకి వేయవద్దు. బావుల కాడ మీటర్లు పెట్టి కొంపలు ఆర్పుకుందామా?- దేశంలో పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్రం మోసం చేస్తోంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామంటారు. మీటరు ధర వారే నిర్ణయిస్తారు. మోడీ బయటపెట్టిన సర్క్యులర్ వచ్చింది. మీటర్లు కావాలా? మోసపోతే నష్టపోతాం. ఎన్నికలలో వారిని నమ్మితే మోసాలకు గురి అవుతాం. మీకు దండం పెడుతున్నా. మనం ధర్మం వైపు నిలబడాలి.

ప్రైవేటీకరణకు మొగ్గు చూపితే నష్టం మనకే.  మీ బలం చూసి కొట్లాడుతా. మీరే మా బలం. మీరు సహకరించకపోతే ఏం చేయగలం. మునుగోడులో మీరు వారికి ఓటేస్తే.. నన్ను పక్కకు జరిపేస్తారు. కేసీఆర్ ని పడగొట్టి తెలంగాణను కబ్జా పెడతామని రంగంలోకి వచ్చారు. ఈ దేశంలో కరెంట్ వున్నా ప్రజలకు రాదు. దేశంలో భయంకర కుట్ర జరుగుతోంది. దేశంలో కుట్రను మనం భగ్నం చేయాలి. కీలెరిగి వాత పెట్టాలి. నష్టపోయేది, కష్టపడేది మనమే. మీటర్లు పెట్టకుండా చూడాలి. మునుగోడు నీళ్ళ గోస తీరిందా? ఫ్లోరైడ్ సమస్య తీర్చాలని వాజ్ పేయిని కలిశారు. సమస్య తీర్చలేదు. మునుగోడులో అనేక మండలాలు తిరిగా.  మనలో చైతన్యం కోసం పాట రాశా.. చూడు చూడు నల్లగొండ.. నల్లగొండకు నరకం చూపిన జెండాలు ఎన్నో. అలాంటి జెండాలు గుర్తుపట్టాలి. హంసలా పాలకు పాలు, నీళ్ళకు నీళ్ళు వేరుచేయాలి. ప్రజల్లో అమాయకత్వం వుంటే దుర్మార్గుల ఆటలు సాగుతాయి. ఒళ్ళు మరిచి ఓటు వేసి ఇళ్ళు కాల్చుకోవద్దు. దేశం వంచించబడుతోంది. కేంద్రం విధానం వల్ల నీళ్లు రావు, కరెంట్ రాదు.

చరిత్రలో సువర్ణావకాశం మీదే. బీఆర్ ఎస్ పార్టీకి పునాదిరాయి పెట్టింది మునుగోడు. నాడు సిద్దిపేట నుండి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించా. నేడు మునుగోడు నుండి బిఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ మాదిరి దేశాన్ని బాగు చేద్దాం నేను ఎంత ఎత్తుకు ఎదిగినా మునుగోడు పునాది రాయిని మరువ. దేశం బాగుపడాలంటే మీరు అడుగు ముందుకేయాలి.  మునుగోడును గుండెల్లో పెట్టుకుంటా. దేశంలో జరిగే పోరాటంలో మీరే పునాది రాయి వేయాలి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవాలి. ఎనిమిదేళ్ళయినా మా నీళ్ళు చూపడానికి, మా వాటా ఎప్పుడిస్తారింక కేంద్రం..?
ఇవాళ వామ‌ప‌క్షాలు, టీఆర్ఎస్ క‌లిసి ప్ర‌జాస్వామ్యాన్ని నిల‌బెట్టేందుకు పోరాటం చేస్తున్నాయి. దేశంలో 4 ల‌క్షల మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం ఉంది. కానీ ఈ దేశం 2 ల‌క్ష‌ల మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఉత్ప‌త్తి చేయ‌లేదు. ఏంది ఈ దుర్మార్గం. మన రాష్ట్రంలో త‌ప్పా ఎక్క‌డా కూడా 24 గంట‌ల విద్యుత్ ఇవ్వ‌డం లేదు. కార్పొరేట్ల జేబులు నింపేందుకు బీజేపీ య‌త్నిస్తోంది. ప్ర‌యివేటీక‌ర‌ణ అనే పాల‌సీని బీజేపీ అవలంభిస్తోంది. ఇది ఎంత వ‌ర‌కు క‌రెక్ట్. ? విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల పేరిట విద్యుత్ మీట‌ర్లు పెడుతామ‌ని చెబుతున్నారు. మీట‌ర్ల‌కు ఒప్పుకునే ప్ర‌స‌క్తే లేదు. మీట‌ర్ల‌ను పెట్టుకుని కొంప‌ల‌ను పొగొట్టుకుందామా? ఈ విష‌యంపై ఆలోచించాలి. ఎన్నిక‌ల్లో చేసే దుర్మార్గ‌పు ప్ర‌లోభాల‌కు ఆశ ప‌డితే గోస ప‌డుతం. చేనేతల బడ్జెట్ భారీగా పెంచాం. చేనేత బీమా తెచ్చాం.. రైతు బీమా లేదు. దేశంలో లేనిది మనం తెచ్చుకున్నాం. రైతు బంధు ఇస్తున్నాం. కేసీఆర్ వున్నంతకాలం దానిని ఎవరూ ఆపలేరు.  ఉచితాలు ఆపాలట.. కార్పోరేట్ గద్దలకు 14లక్షల కోట్లు మాఫీ చేశాడు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే లక్ష 40 వేల కోట్లు మాత్రమే అవుతుంది. మోడీగారు మీ సమాధానం ఏంటి?

ఒకడు తడిబట్టలతో ప్రమాణం అంటాడు మరోడు పొడి బట్టలతో ప్రమాణం చేయాలంటాడు కేసు కోర్టులో వుంది. నేను మాట్లాడకూడదు. సూచనప్రాయంగా చెప్పేది ఏందంటే దొరికింది ఇంకా వీళ్ళ కథ కొండంత ఉంది. మంత్రి జగదీశ్వర్ రెడ్డిని నిషేధించారు. ఎవరినైనా కొట్టారా? ఆయన ప్రచారాన్ని ఎందుకు ఆపారు? మూడవ తేదీన మీ సత్తా చాటండి. శాంతియుతంగా, హింసకు పోకుండా వారికి బుద్ధి చెప్పాలి. వడ్లు కొనమంటే నూకలు తినమన్నారు…అలాంటివారి తోకలు కట్ చేయాలి. ఇంటికి తులం బంగారం అంటారు. మూడో తేదీ తర్వాత ఎవరైనా కనబడతారా? గెలిచాక ఎవరూ కనిపించరు. ఎక్కడ దొంగలు అక్కడే గప్ చుప్. గోల్ మాల్ కావద్దు. మనకు చైతన్యం వుంటే వాళ్ల ఆటలు సాగవు. దేశంలో చైత‌న్యం రానంత వ‌ర‌కు దుర్మార్గ రాజ‌కీయాలు కొన‌సాగుతాయి. దోపిడీదారులు మాయ‌మాట‌లు చెప్పి మోసం చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com