ఉత్తరాంధ్రలో పుష్కలంగా నీరు వున్నా వాటిని వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వంశధార నుంచి హీర మండలం ద్వారా నాగావళికి, వంశధార నుంచి వరద కాలువ ద్వారా మహేంద్ర తనయ నుంచి బహుదా వరకూ నీటిని మళ్ళించవచ్చని అన్నారు. జలవనరుల శాఖా మంత్రికి కనీసం అవగాహన లేదని విమర్శించారు. ‘పడకేసిన ప్రాజెక్టులు – ప్రజా ద్రోహి జగన్’ పేరుతో ప్రాంతాల వారీగా సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్న చంద్రబాబు నేడు కోస్తాంధ్ర ప్రాజెక్టులపై మాట్లాడారు. తాను నిన్న ప్రాజెక్టులపై మాట్లాడితే సిఎస్ తో సమీక్ష చేశారని, దానిలో మంత్రి కూడా లేడని, ఏదైనా మాట్లాడితే ఆ మంత్రి ఆంబోతులా అరుస్తారని ఘాటుగా విమర్శించారు.
కోస్తాంధ్ర ప్రాజెక్టులపై తమ ఐదేళ్ళ కాలంలో 21.442 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే….ఈ నాలుగేళ్ళలో 4,375 మాత్రమే ఖర్చు చేశారని వెల్లడించారు. విజయనగరం జిల్లాలో ఓ మంత్రి ఉన్నారని, అందరిపైనా మాట్లాడుతుంటారని, అరుస్తుంటారని… కానీ తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయడంపై కనీసం శ్రద్ధ పెట్టలేదని బొత్స నుద్దేశించి బాబు ఆరోపించారు. గౌతు శివాజీ ఎప్పుడు కలిసినా మహేంద్ర తనయ గురించి అడిగేవారని, అయ్యన్నపాత్రుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేయాలని కోరేవారని, తాము ఆ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చి పనులు మొదలు పెడితే ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు.
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు 1,414 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక టన్నెల్ కూడా పూర్తి చేసి నీళ్ళిచ్చే సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిందని, నాలుగేళ్లయినా ఇంత వరకూ దీన్ని పూర్తి చేయలేకపోయారని, కేంద్ర ప్రభుత్వ గెజిట్ లో ఈ ప్రాజెక్టు చేర్చకపోతే టిడిపి నేతలు పోరాడారని గుర్తు చేశారు. వెలిగొండ టన్నెల్ లో తవ్వే మట్టి శ్రీశైలంలో పడేస్తున్నారని, ఇది చాలా ప్రమాదమని పేర్కొన్నారు. రేపు పోలవరం ప్రాజెక్టుపై సమగ్రంగా ప్రెజెంటేషన్ ఇస్తానని తెలిపారు.
ప్రజలను శాశ్వతంగా పేదవారిగా ఉంచాలనేదే జగన్ ఉద్దేశమని, ఏవో తాయిలాల పేరుతో వారిని తనపై ఆధారపడేలా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ సిఎం చేస్తున్న నష్టాన్ని ప్రజలు గమనిస్తే తిరగబడతారని హెచ్చరించారు. ప్రాజెక్టులపై ఈ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని, శ్వేతపత్రం విడుదల చేయాలని అడగడం అనవసరమని అన్నారు. ఈ ప్రభుత్వంలో నవ్వినా, ఏడ్చినా కేసు పెడతారని ఎద్దేవా చేశారు. బటన్లు నొక్కుతున్నారని కానీ డబ్బులు రావడం లేదన్నారు.