జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం అత్యంత ప్రాధాన్యతాంశమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతపెద్ద స్థాయిలో సర్వే చేపట్టడంలేదని,  ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమమని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర్ చేయలేని విధంగా పత్రాలు అందిస్తున్నామని, ఇది ఇప్పటివారికే కాకుండా భవిష్యత్తు తరాలవారికీ కూడా చాలా ఉపయోగమని సిఎం చెప్పారు.  సిఎం క్యాంపు కార్యాలయంలో వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష పథకంపై  రెవిన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, గనులశాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియను పూర్తిచేసేదిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని, జాప్యానికి తావులేకుండా కావాల్సిన సాంకేతిక పరికరాలను తెప్పించుకోవాలని సిఎం ఆదేశించారు. రెవిన్యూశాఖ పరిధిలో  తొలి దశలో చేపట్టిన 2వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియపై వివరాలు అడిగి తెలసుకున్నారు. ఇప్పటికే చాలావరకు పత్రాల పంపిణీ జరుగుతోందని,  మే 20 నాటికి సర్వే రాళ్లు వేసే పనితోపాటు అన్ని రకాలుగా సర్వే ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు.

 అలాగే ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేకోసం పరికరాలు ఉండాలని,  రోవర్ తరహా… పరికరాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలని నిర్దేశించారు. దీనివల్ల సర్వేయర్ పూర్తిస్ధాయిలో తన పనిని పూర్తిచేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలపై ఆలోచనలు చేయాలని కోరారు. డిసెంబరులోగా మొత్తం అన్ని గ్రామాల్లో ఈ సర్వే పూర్తిచేసేదిశగా లక్ష్యాలను పెట్టుకున్నామని పంచాయతీ రాజ్ శాఖా అధికారులు సిఎంకు వివరణ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *