ముందస్తు ప్రణాళిక ప్రకారమే తమపై దాడి జరిగిందని బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ఆరోపించారు. దాడి జరుగుతుంటే పోలీసులు వారిని ఆపాల్సింది పోయి తమను వెళ్ళిపొమ్మని ఎలా చెబుతారంటూ ప్రశ్నించారు. అమరావతి ఉద్యమానికి సంఘీభావం తెలియజేసే హక్కు బిజెపికి లేదా అంటూ నిలదీశారు. అమరావతి ఉద్యమానికి నేటితో 1200 రోజులు పూర్తయిన సందర్భంగా మందడం దీక్షా శిబిరంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పలు పార్టీల నేతలతో పాటు బిజెపి నేతలు కూడా పాల్గొన్నారు. సత్య కుమార్ దీక్షలో ప్రసంగించిన అనంతరం తుళ్ళూరులో తమ పార్టీ నేతను  పరామర్శించి తిరిగి వస్తుండగా మందడం వద్ద  మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటు చేసిన శిబిరం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

దాడిపై విచారణ జరిపించాలని, ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్న పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సత్య కుమార్ హెచ్చరించారు. ఇది యాదృచ్చికంగా జరిగిన ఘటన కాదని, తనతో పాటు ఆదినారాయణ రెడ్డిలను హతమార్చేందుకే వైసీపీ నేతలు ఈ దాడి చేశారని, తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే ఇది జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.  తమపై దాడి జరుగుతుంటే చోద్యం చూడడం సరికాదని పోలీసులకు సూచించారు. ఒకవేళ ఇలాగే దాడులకు దిగుదామంటే తాముకూడా సిద్ధమని  సత్య కుమార్ సవాల్ చేశారు.  ఈ సంఘటన వెనుక ఎంపి నందిగం సురేష్ ఉన్నారని ఆరోపించారు.

ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర పార్టీ దృష్టికి తీసుకు వెళ్లామని, పలుపార్టీల నేతలు కూడా ఫోన్ చేసి పరామర్శించారని, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చిత్తూరు పర్యటనలో ఉన్నారని, వారు వచ్చిన తరువాత ఈ ఘటనపై ఉద్యమ కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. అమరావతి దీక్షా శిబిరం వద్ద కనీసం 20 మంది పోలీసులు కూడా లేరని, కానీ మూడు రాజధానుల శిబిరం వద్ద మాత్రం 70 మంది దాకా పోలీసులను ఎందుకు ఉంచారో చెప్పాలని సత్య డిమాండ్ చేశారు.

వివేకా హత్య కేసు సమయం నుంచి తనపై కక్ష కట్టారని, తనను అంతమొందించాలని ప్రయత్నిస్తున్నారని బిజెపి నేత ఆదినారాయణ రెడ్డి ఆరోపణ చేశారు. నిజంగా తనను చంపాలనుకుంటే ఒంటరిగా వస్తానని చాలెంజ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *