Ask them: రాష్ట్రంలో ప్రజలకు మంచి చేస్తుంటే, అక్క చెల్లెమ్మల ప్రగతికి బాటలు వేస్తుంటే దుష్టచతుష్టయం జీర్ణించుకోలేకపోతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, కొన్ని మీడియా సంస్థలది ఒకే బాట, ఒకే మాట అని…..వీరికి తోడు దత్త పుత్రుడుకూడా తోడయ్యారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంగా టిడిపి ఏమి ఆరోపణలు చేస్తుందో వాటినే తమకు అనుకూలంగా ఉండే పత్రికలో రాయిస్తారంటూ సిఎం వ్యాఖ్యానించారు. డబ్బులు పంచే పథకాలు అపాలంటూ, రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందంటూ కథనాలు ప్రచురిస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సంఘాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాల పథకం కింద మూడో విడత నిధులను ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో సిఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలపై విమర్శలు గుప్పించారు.
‘ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందట…. బాబుగారి లాగా హామీలు అమలు చేయకుండా మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేస్తే మాత్రం రాష్ట్రం అమెరికా అవుతుందట’ అని విమర్శించారు. రాక్షసులతో, దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నామని… సంక్షేమ పథకాల అమలుతో నాయకుల బదులు ప్రజలు బాగుపడితే శ్రీలంక ఎలా అవుతుందని సిఎం నిలదీశారు. తాము చేస్తున్న మంచిని ప్రతి ఒక్కరూ గుండెపై చేయి వేసుకొని ఆలోచించుకోవాలని, సంక్షేమాన్ని అడ్డుకుంటున్న వారిని నిలదీయాలని ప్రజలకు సిఎం పిలుపు ఇచ్చారు. ఇలాంటి వారు నిజంగా మనుషులేనా? రాజకీయ పార్టీలు నడపడానికి వీరు అర్హులేనా? ఇలాంటి వారు ప్రజా జీవితంలో ఉండడానికి అర్హులేనా అని ప్రజలు కూడా గట్టిగా ప్రశించాలని విజ్ఞప్తి చేశారు.
నవరత్నాలతో పాటు తాము అమలు చేస్తున్న పథకాలు పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా, లంచాలు, వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సక్రమంగా అందుతున్నాయని చెప్పారు. బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళుతున్నాయని, ఇప్పటివరకూ 1,36,694 కోట్ల రూపాయలు ప్రజల చేతుల్లో పెట్టామని, వీటిలో 94,318 కోట్ల రూపాయలు నేరుగా అక్కచెల్లెమ్మలకే చేరాయని వివరించారు. కరోనాతో ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులున్నా, సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టలేదని, అన్నీ సక్రమంగా అందించామని వివరించారు. ‘ మా ఇబ్బందుల కన్నా మీ ఇబ్బందులు ఇంకా ఎక్కువని… మీ ఇబ్బందులు మా ఇబ్బండులుగా భావించి.. మీ అన్నగా, మీ తమ్ముడిగా మీ అందరికీ కూడా తోడుగా ఉన్నాను’ అని సిఎం అన్నారు. ఇలాంటి మనసున్న పాలనను గతంలో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు.
Also Read : ప్రజల అండ ఉన్నంతవరకూ ఏమీ చేయలేరు