Preference to BCs: నూతన మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉందని, జాబితా రేపు మధ్యాహ్నానికి ఖరారవుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. మంత్రివర్గకూర్పుపై సిఎం జగన్ తో సమావేశం అనంతరం సజ్జల మీడియాకు వివరాలు తెలిపారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతాలు, అనుభవం.. లాంటి అన్ని అంశాలనూ సిఎం జగన్ పరిగణనలోకి తీసుకుంటున్నారని చెప్పారు.
మంత్రివర్గం పాత కొత్తల కలయికగా ఉంటుందని, పలు రకాల కాంబినేషన్స్ ను సిఎం పరిశీలిస్తున్నారని చెప్పారు. సాధారణంగా మంత్రివర్గం అంటే ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని, అందుకే ఈ కసరత్తు రేపు మధ్యాహ్నం వరకూ సాగుతుందని చెప్పారు. ఒకసారి జాబితా ఖరారయ్యాక రాజ్ భవన్ కు పంపుతారని, రేపు మధ్యాహ్నం రెండు గంటల తరువాత మంత్రివర్గంలో చేరనున్న వారికి సమాచారం అందజేస్తారని సజ్జల వివరించారు.
మంత్రుల రాజీనామాలన్నీ ఈరోజు రాజ్ భవన్ కు వెళతాయని, అందరి రాజీనామాలు ఆమోదం పొందుతాయని పేర్కొన్నారు. కొత్త జిల్లాల వారీగా మంత్రివర్గ కూర్పు ఉండకపోవచ్చని, పాత జిల్లాల ప్రాతిపదికగానే ఉండొచ్చని సూత్రప్రాయంగా వెల్లడించారు. ఎమ్మెల్యేలంతా జగన్ మనుషులేనని, ఎవరినీ బుజ్జగించాల్సిన అవసరం లేదని, కొదరు ప్రభుత్వానికి పనిచేస్తే, మరి కొందరు పార్టీకి పనిచేస్తారని వ్యాఖ్యానించారు.
Also Read : జగన్ తో ముఖ్యనేతల భేటి-కేబినెట్ కు తుదిరూపం