Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంస్మార్ట్ ఫోనులో మీ మాటలు వినే బూచాళ్లున్నారు జాగ్రత్త!

స్మార్ట్ ఫోనులో మీ మాటలు వినే బూచాళ్లున్నారు జాగ్రత్త!

చేతి గడియారం, క్యాలిక్యులేటర్, స్టిల్ కెమెరా, వీడియో కెమెరా, డెస్క్ టాప్, టార్చ్ లైట్…ఇలా అనేక వస్తువులను స్మార్ట్ ఫోన్ మింగేసింది. ఇప్పుడు సెల్ ఫోనే బ్యాంక్, సెల్ ఫోనే పర్స్. సెల్ ఫోనే రేడియో. సెల్ ఫోనే టీ వి. సెల్ ఫోనే మీటింగ్ వారధి. సెల్ ఫోనే మనిషిని నడిపే సారథి.

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివారికి తాము డిజిటల్ మీడియాలో ఏదో ఒకటి చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. తమ మొహం అందంగా ఉండడం వల్ల లోకానికి చూపించాలని అనిపిస్తూ ఉంటుంది. లోపలనుండి తన్నుకొచ్చే జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టా, వాట్సాప్, యూ ట్యూబుల్లో పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. వాటికి జనం పెట్టే కామెంట్లను పదే పదే చదవాలనిపిస్తూ ఉంటుంది. క్షణక్షణానికి అందగించే తమ ముఖారవిందాలను వెను వెంటనే డి పి లుగా పెట్టుకుని లోకాన్ని అనుగ్రహించాలనిపిస్తూ ఉంటుంది. లక్షల వ్యూస్, లైకులు, షేర్లు రావాలనిపిస్తూ ఉంటుంది.

వ్యక్తిగతం, దాపరికం ఏమీ లేదు. డిజిటల్లో అంతా ఓపెన్.
“ఇప్పుడే నిద్ర లేచి బాత్ రూమ్ వెళుతున్నా”
– ఒక అప్ డేట్.

“హ్యాపీ నేచర్ కాల్”
-దానికి రిప్లై.

పెళ్లి, శోభనం, చావు, ఇంటా బయటా ఏదయినా లోకానికి చెప్పాలి. ఒకరిని చూసి ఒకరు…నువ్ తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటా అన్నట్లు డిజిటల్ కంటెంట్ లో పోటీలు పడుతున్నారు.

వ్యూస్ బాగా వస్తే ఆనందం; ఉత్సాహం; ఉక్కిరిబిక్కిరి.
రాకపోతే వైరాగ్యం; నిరుత్సాహం; నైరాశ్యం; అంతులేని ఆవేదన.

మనం డిజిటల్ మీడియాలో తరచుగా ఏమి సెర్చ్ చేస్తున్నామో, ఏవి వింటున్నామో, ఏవి చూస్తున్నామో పసిగట్టి వాటినే మన కళ్ల ముందుకు తోసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- కృత్రిమ మేధ వ్యవహారాలు తెలుసుకుంటే…వడ్లగింజలో దాగిన డిజిటల్ బియ్యపు గింజల వర్చువల్ నగ్న సత్యాలు బయటపడతాయి.

మన సెర్చ్ వ్యవహారాలను పసిగట్టడం పాతకథ. ఫోన్లలో మనమాటలను విని మన ముందుకు ఆ ప్రకటనలనే తోసే “యాక్టివ్ లిజనింగ్” డిజటల్ నిఘా చెవులు కొత్తకథ. అమెరికాలో కాక్స్ మీడియా గ్రూప్-సి.ఎం.జి. స్మార్ట్ ఫోన్లలో మనం మాట్లాడుకునే మాటలను మన అనుమతి లేకుండా విని…రికార్డ్ చేసే సాంకేతిక విధానాన్ని ఏనాడో కనుక్కుని…అనేక మార్కెటింగ్ కంపెనీలకు తన “గుట్టు చప్పుడు కాకుండా ఎదుటివారి మాటలను వినే సేవలను” గుట్టుచప్పుడు కాకుండా అందిస్తోంది. ఏటా వందల కోట్ల లాభాలు గడిస్తోంది.

ఇంటర్నెట్ తో అనుసంధానమైన స్మార్ట్ ఫోన్ అయితే చాలు. అందులో మైక్రో ఫోన్ ను ఈ నిఘా చెవులు వినగలుగుతాయి. ఏ యాప్ కయినా స్మార్ట్ ఫోన్లో మైక్రో ఫోన్ యాక్సెస్ ను నిరోధిస్తే అంటే మైక్రో ఫోన్ ను ఆపితే కొంతవరకు ఈ నిఘా చెవులనుండి తప్పించుకోవచ్చు అని అంటున్నారు కానీ…అది కేవలం మన భ్రమ అని ఈ రంగంలో నిపుణులు సాంకేతిక ఆధారాలతో చెబుతున్నారు.

స్మార్ట్ ఫోనే మనది.
ఆడేది…ఆడించేది…
పాడేది…పాడించేది…
చూసేది…చూపించేది…
వినేది…వినిపించేది…
నొక్కేది…నొక్కించేది…
అంతా ఇతరులది. అది కాక్స్ మీడియా గ్రూప్ కావచ్చు. గూగుల్ కావచ్చు. యూట్యూబ్ కావచ్చు. ఫేస్ బుక్ కావచ్చు. ఇన్స్టా కావచ్చు.

గోడలకే కాదు… స్మార్ట్ ఫోన్లకూ వినే దొంగ చెవులున్నాయి.

యద్భావం తద్భవతి!
ఏది మాట్లాడితే అదే వస్తుంది!
యదాలోచనం తద్ ప్రత్యక్షం!
జీవితం సర్వం అంతర్జాల అనుసంధానిత చరవాణి శ్రవణారవిందార్పణమస్తు! అస్తు!!
శుభంబశుభం!!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్