Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆశ కొద్దీ కోచింగ్

ఆశ కొద్దీ కోచింగ్

To make both ends meet: రకరకాల పోటీ పరీక్షలకు నగరాల్లో లెక్కలేనన్ని కోచింగ్ సెంటర్లు. ఈ మధ్య ఆన్ లైన్ వర్చువల్ కోచింగ్ సెంటర్లు కూడా తోడయ్యాయి. కరోనా తరువాత వీటన్నిట్లో ఒక్కసారిగా ఫీజులు రెండింతలు, మూడింతలు అయ్యాయి.

ఒకసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ 1200 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే దాదాపు ఇరవై లక్షల మంది అప్లై చేశారు. యు పి ఎస్ సి లా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు ఒక క్యాలెండర్ ప్రకారం ఏటేటా జరగవు. దాంతో నాలుగయిదేళ్లకొకసారి వచ్చే ప్రకటనలకు నాలుగయిదేళ్ళుగా పోగయ్యే నిరుద్యోగులందరూ కోటి ఆశలతో ప్రిపేర్ అవుతుంటారు.

కోచింగ్ పరిశ్రమ
ఎప్పుడొస్తుందో తెలియని నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండడానికి కొందరు నిత్యం కోచింగు తీసుకుంటూ ఉంటారు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కోచింగ్ తీసుకునేవారు కొందరు. డిగ్రీ తరువాత రాసే పోటీ పరీక్షకు ఎల్ కే జి నుండే కోచింగ్ తీసుకునేవారు కొందరు. ఇలా కోచింగ్ ఎంత పెద్ద పరిశ్రమో తనకే తెలియనంతగా ఎదిగిపోయింది.

రెండు పడవల మీద ప్రయాణం
రాసి రాసి అలసిపోయే అభ్యర్థులు మొదటి సంవత్సరం కాగానే రెండో సంవత్సరం చిన్నా చితకా ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ అవుతారు. చాలా మందికి ఆ ఉద్యోగాలే శాశ్వతం అవుతూ ఉంటాయి. రెండు పడవల ప్రయాణం పనికిరాదని తెలిసి…ఒక పడవ మీదే రెండు కాళ్లు పెట్టాల్సిన తప్పనిసరి పరిస్థితి దానికదిగా వస్తుంది.

ఆన్ లైన్ దోపిడి
ఈ రోజుల్లో ఒక వైపు ఆగ్రాలో యమున ఒడ్డున తాజ్ మహల్ ను షాజహాన్ కట్టించెను అని గురువు చెబుతుంటే మరోవైపు అభ్యర్థులు గురువు చెప్పింది నిజమో కాదోనని గూగుల్లో చెక్ చేస్తూ ఉంటారు.
కోచింగ్ లో కూడా ఆన్ లైన్ దోపిడీ ప్రవేశించింది. లెక్కలేనన్ని యాప్ లు. వీడియో పాఠాలు. వర్చువల్ క్లాసులు.

ప్రభుత్వ కోచింగ్
వెనుకబడిన తరగతులు, ఎస్ సి, ఎస్ టి అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వడానికి ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లను ప్రారంభించింది. నోటిఫికేషన్లు పలుచబడ్డాక వీటి ప్రభ కూడా తగ్గిపోయింది.

కలవారు విదేశాల్లో- లేనివారు స్వదేశంలో
ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవారు డిగ్రీ పూర్తి చేసిన వెంటనే పి జి కి విదేశాలకు వెళ్లి, ఆపై ఉద్యోగం తెచ్చుకుని అక్కడే స్థిరపడిపోతున్నారు. ఎక్కువ శాతం దిగువ మధ్యతరగతి, పేదవారు మాత్రమే కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు.

సగటున గ్రూప్ వన్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి సంవత్సరానికి కోచింగ్ సెంటర్ ఫీజు అరవై వేల నుండి లక్ష. వసతి, భోజనం, పుస్తకాలు ఇతర ఖర్చులు హీనపక్షం నెలకు పదివేలు. అంటే ఒక ఏడాది ప్రిపరేషన్ కు తక్కువలో తక్కువ రెండు లక్షల ఖర్చు. వెయ్యి ఉద్యోగాలకు పది లక్షల మంది ప్రిపేర్ అవుతుంటే ఈ ఖర్చు పది లక్షలు ఇంటూ రెండు లక్షలు ఈజ్ ఈక్వల్ టు వేల వేల కోట్ల సున్నాలే సున్నాలు.

యు పి పి ఎస్ సి కి ఏటా సెలెక్ట్ అయ్యే అభ్యర్థుల గణాంకాలను పరిశీలిస్తే బీహార్, ఉత్తరాఖండ్, ఒరిస్సా రాష్ట్రాలవారు ఎక్కువగా ఉంటారు. వెనుకబడ్డప్రాంతాల నుండి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎక్కువగా ఎంపిక అవుతున్నారు.

అలాగే గ్రూప్స్ లో కూడా వెనుకబడ్డ జిల్లాలవారే ఎక్కువగా ఎంపిక అవుతున్నారు. సాధించి తీరాలన్న కసి, తదేక దీక్ష ఇందుకు కారణం.

ఆర్థికంగా ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలవైపు చూడడం తగ్గిపోయింది. 1990 ఆర్థిక సరళీకరణల తరువాత ప్రయివేటు ఉద్యోగాలు పెరిగి, ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుతున్నాయి. దాంతో ఒక్కో పోస్టుకు వేలు, లక్షల్లో పోటీ పడుతున్నారు.

ఒకపక్క బి ఎస్ ఎన్ ఎల్, భారతీయ రైల్వే, ఎల్ ఐ సి లాంటి హిమాలయమంత ఎత్తు ఎదిగిన ప్రభుత్వ రంగ సంస్థలే ఇప్పుడు నెమ్మదిగా తలదించుకుని ఒదిగి ప్రయివేటు చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఇలాంటివేళ ఒక్క గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తే ఒక్క తెలుగు రాష్ట్రంలో ఒక్క ఏడాది వేల కోట్లు ఖర్చు కావడం తల్లిదండ్రులకు, అభ్యర్థులకు, మొత్తంగా సమాజానికి మంచిది కాదు. రకరకాల ప్రయివేటు ఉద్యోగాలకు తగినట్లు తయారై వేగంగా స్థిరపడకపోతే…దాహం తీర్చుకోవడానికి ఎండమావుల వెంట తిరిగినట్లే ఉంటుంది.

జన్మకో శివరాత్రిలా ఎప్పుడో పడే నోటిఫికేషన్ కే ఇన్ని వేల కోట్లు వ్యయమయితే ఏటేటా ఒకటి ఒకటి ఒకటి అని ఒకటే రొదపెట్టే ఐ ఐ టీ, నీట్ కోచింగులకు ఇంకా ఎన్నెన్నో పోటీ పరీక్షలకు కలిపి ఏటా ఎన్ని కోట్లకోట్లు ఖర్చవుతుందో సున్నాలు లెక్కపెట్టాలంటే…దానికంటే ఆకాశంలో నక్షత్రాలను లెక్కపెట్టడమే చాలా తేలిక అనిపిస్తుంది.

(పాత కథనం. క్యాలెండరు మారినా నిరుద్యోగుల దీనగాథలు మారవు. మళ్లీ అవే నోటిఫికేషన్లు. అవే కోచింగ్ సెంటర్లు. అదే దోపిడీ. అదే వ్యథ)

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్