జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్ వద్ద గల కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ లో భారీ ప్రమాదం సంభవించింది. కేటిపిఎస్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని ఒకటో యూనిట్ లోని బొగ్గు మిల్లర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన కార్మికులు సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకారు. దీంతో ఏడుగురు కార్మికుల కాళ్ళు, వెన్నముకలు విరిగిపోయాయి.
దుర్ఘటనపై జెన్కో యాజమాన్యం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన చోటుచేసుకుందని… విధుల్లో ఉన్న జెన్కో సీఈ సిద్దయ్యను ప్రాథమికంగా బాధ్యున్ని చేసింది. ప్రమాదానికి కారణాలపై సమగ్ర దర్యాప్తుకు జెన్కో ఆదేశించగా… గాయపడిన కార్మికులను మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎం జి ఎం ఆస్పత్రికి పంపారు.