ఉత్తర భారత దేశంలో శీతలగాలుల ధాటికి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్ముకాశ్మీర్ రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. శీతల వాతావరణం నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రెడ్, ఆరెంజ్ అలెర్ట్‌లు జారీ చేశారు.
ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోయాయి. హిమాచల్ లోని ధర్మశాల, ఉత్తరఖండ్ రాజధాని డెహ్రాడున్, నైనిటాల్ కన్నా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఢిల్లీలో నమోదవుతున్నాయి. బుధవారం 4.4డిగ్రీల సెల్సియస్‌గా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు .. గురువారం ఉదయం 3 డిగ్రీలకు పడిపోయాయి. లోధి రోడ్, అయానగర్ తదితర ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు రిడ్జ్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సీజన్‌లో ఇదే అత్యల్పం కావడం గమనార్హం.
దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం 5:30 గంటల సమయంలో 50 మీటర్ల కన్నా దూరంలోని వాహనాలు కనిపించడం లేదు. దీనివల్ల రోడ్డు, రైలు, విమాన మార్గాల్లోని రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఢిల్లీకి వెళ్లే సుమారు 21 రైళ్లు గంటన్నర నుంచి నాలుగున్నర గంటల మేర ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరో 24 గంటల వరకు ఇలాంటి పరిస్థితులే ఉండొచ్చని ఐఎండీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ సహా ఉత్తర భారతంలో శీతల వాతావరణం అధికంగా ఉండబోతోందని తెలిపారు.