Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

సాధారణంగా పత్రిక లాభాల్లో నడుస్తోందనడానికి కొండ గుర్తు – వార్తలు తక్కువ, ప్రకటనలు ఎక్కువ ఉండాలి. టీ వీలయినా అంతే. అలా ఒకరోజు ఈనాడు మొదటి పేజీలో అశ్విని హెయిర్ ఆయిల్, కోల్గెట్ టూత్ పేస్ట్ మొదటి పేజీని ఆక్రమించేశాయి.

ఈ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో తప్ప ఈనాడుకు ఈ ప్రకటనలో ఉన్న విషయంతో కానీ, భాషతో కానీ ఏమాత్రం సంబంధం ఉండదు. కాబట్టి ఇది పత్రికకు సంబంధం లేని…ఆ కంపెనీలు లేదా వాటిని తయారు చేసిన యాడ్ ఏజెన్సీలకు సంబంధించిన విషయం.

మధునాశిని టూత్ పేస్ట్
కోల్గెట్ వాడు ప్రతి పదేళ్లకోసారి ప్రపంచాన్ని భయపెడుతూ ఉంటాడు. టూత్ పేస్టులో ఉప్పు వద్దన్నాడు. తరువాత ఉండాలన్నాడు. ఆపై యాలకులు, లవంగాలు, జవ్వాది, పచ్చ కర్పూరంతో మన పళ్లకు పూజ చేశాడు. కొంచెం గ్యాప్ ఇచ్చి వేప మండలు, బొగ్గులతో మన కారు నలుపు పళ్లను…బస్సు తెలుపు చేశాడు. ఇంగువ, అల్లం, వెల్లుల్లి, ఆవాలు, పసుపు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, రాతి పువ్వ, గసగసాలు కలిపిన టూత్ పేస్ట్ బహుశా కోల్గెట్ ఫ్యాక్టరీలో తయారవుతూ ఉండాలి. ఏ క్షణమయినా ఆ కోల్గెట్ ప్రకటన రావచ్చు. ఇదే కనుక టూత్ పేస్ట్ గా వస్తే గొప్ప సౌలభ్యం కూడా ఉంటుంది. ఒకే పేస్ట్ వంటిట్లో మసాలా కోసం వాడుకోవచ్చు. బాత్ రూమ్ లో పళ్లు తోముకోవడానికి కూడా వాడుకోవచ్చు. రెండును రెండు కాదని…ఒకటేనని నిరూపించే కోల్గెట్ అద్వైత దంత వేదాంతమిది.

తాజాగా కోల్గెట్ వాడు టూత్ పేస్టుకు మధుమేహం – షుగర్ వ్యాధికి ముడి పెట్టాడు. వాడి ప్రకటన ప్రకారం:-

“నోటి సంరక్షణ
ఇంకా డయాబెటీజ్?
అవును, వీటికి సంబంధం ఉంది”

తాటికాయంత అక్షరాలతో ఆ యాడ్ హెడ్డింగ్ ఇది. వాడి టూత్ పేస్ట్ లాగే ఈ తెలుగు అనువాదం కూడా విష రసాయనంలా ఉంది. “నోటి సంరక్షణకు- మధుమేహానికి సంబంధం” అని అనువదించబోయి మక్కికి మక్కి అనువాదంలో ఏదో అఘోరించినట్లున్నాడు. షుగర్ వ్యాధి ఉన్నవారి దంతాల చిగుళ్లు బ్యాక్టీరియాను అధికంగా ఆకర్షిస్తాయట. అందువల్ల చిగుళ్ల ఇన్ఫెక్షన్ మూడు రెట్లు పెరుగుతుందట.

కోల్గెట్ డయాబెటిక్స్ పేస్ట్ వాడితే నేరేడు పిక్కల ద్రావకంలో, వేపాకు రసాన్ని కలపడం వల్ల…ఇంకా మధునాశినిని(ఇది కోల్గెట్ వాడి ఆవిష్కరణ అయి ఉండాలి) కలపడం వల్ల మధుమేహం మీ పంటికిందే నలిగి నామరూపాల్లేకుండా పోతుందట. మధునాశిని అనే మాటను ఆయుర్వేదం ఎప్పటినుండో వాడుతోంది. షుగర్ లెవెల్స్ ను తగ్గించే ఆయుర్వేదం మందులకు మధునాశిని అని పేరు. కోల్గెట్ వాడు ఆ అర్థంలో వాడాడో లేక వాడిదగ్గర మధునాశిని ఒక పదార్థమో క్లారిటీ లేదు.

మొత్తమ్మీద షుగర్ ట్యాబ్లెట్లు, ఇన్సులిన్లు చేయలేని పనిని తమ కోల్గెట్ డయాబెటిక్స్ టూత్ పేస్ట్ చేస్తుందని పబ్లిగ్గా ప్రకటనల్లో చెప్పుకుంటున్నాడు. నెత్తిన నిమ్మ రసం పిండుకుని, వేప మండలతో హశ్శరభ! శరభ!! అని నిప్పుల బొగ్గులమీద బూడిద చల్లుకుంటూ మనం ప్రతినిత్యం పళ్లు తోముకోవడం తప్ప చేయగలిగింది లేదు!

అశ్విని వ్రాసుకోండి
ఇప్పుడు అత్యంత విలువయిన వెంట్రుకల యాడ్ చూద్దాం. అశ్విని హోమియో ఆర్నిక హెయిర్ ఆయిల్ గురించి వారు ఎప్పుడూ వ్రాయరట. వారి ప్రాడక్ట్ గొప్పదనం గురించి వినియోగదారులే ఎల్లప్పుడూ వ్రాస్తూ ఉంటారట.నిజమే-
ఆ ప్రకటనలో ఒకమ్మాయి కిటికీలో తన జడను విరబోసుకుంటే ఆ జడ అడుగుజాడ ఆ బిల్డింగ్ పునాదులదాకా వేలాడుతోంది – నల్లగా, దిట్టంగా, నిగనిగలాడుతూ. అశ్విని హెయిర్ ఆయిల్ వాడడం వల్ల ఊడల మర్రికి ప్రతిరూపంగా కేశాల మర్రి ఏర్పడినట్లుంది.

“బొంకరా! బొంకరా!
పోలిగా!
అంటే-
టంగుటూరు మిరియాలు తాటికాయంత”
అన్నది నిన్నటివరకు సామెత .
ఇందులో ఊడల మర్రి చూశాక…ఆ సామెతలో తాటికాయ ప్లేస్ లో గుమ్మడికాయ పెట్టుకోవచ్చు.

అయినా-
ఆ అమ్మాయి; వాళ్ల అమ్మ, వాళ్ల అమ్మమ్మ కూడా అశ్విని హెయిర్ అయిలే వాడారు కాబట్టి వారింటి జుట్టు మూడు మూరలు దాటి…మూడు తరాల్లో మూడు ఫ్లోర్లు దాటి… మూడు వీధుల అవతలకి పాకి ఉంటుంది. పేపర్ ప్రకటనలో మనకు అది కనపడి ఉండదు.
నెత్తికి బాగా వ్రాసుకున్న అశ్విని చరిత్ర ఇది!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

వంటింట్లో ఉప్పు లేదా? టూత్ పేస్ట్ వెయ్యండి!

Also Read:

పాన్ బహార్ ఏమన్నా పోషకాహారమా?

Also Read:

అప్పుడు నోరు విప్పలేదే!

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com