Monday, July 1, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇచ్చట తోలు ఒలుచబడును!

ఇచ్చట తోలు ఒలుచబడును!

హిందూ సనాతన ధర్మం మూల స్తంభం- పునర్జన్మ. ఆ స్తంభంలో సిమెంటు, ఇనుము, ఇసుక, ఇటుక, కంకరలు- పాప పుణ్యాలు. పొరపాటున ఇది ఆధ్యాత్మిక- వేదాంత ప్రస్తావన అనుకుని చదవడం ఆపకండి. ఇది టోల్ గేట్లలో మన తోలు వలిచే ఫాస్ట్ ట్యాగ్ గురించి. వేదంలో నిజానికి ఎంత వెతికినా ఫాస్ట్ ట్యాగ్ కనిపించదు. వేదంలో అన్నీ ఉన్నాయిష…అని ఎగతాళి చేసినా- నిజానికి వేదంలో ఉన్నవే బయట ప్రపంచంలో ఉంటాయి. బయట ప్రపంచానికి వేదం బౌద్ధిక, తాత్విక, మార్మిక ప్రతిరూపం. వేదాల చివర ఉన్నవి వేదాంతాలు. అవి చెట్ల కొమ్మల చివర పండే ఫలాల్లా మనం ఉపయోగించుకోగల, తిని జీర్ణం చేసుకోగల ఉపనిషత్తులు.

ఫాస్ట్ ట్యాగ్ లో వేదం- వేదాంతం ఎలా దాగి ఉందో తెలుసుకోవడమే జిజ్ఞాసువులు చేయాల్సిన పని.

జీవితం ఒక గమ్యంలేని పయనం. అంతం లేని ఈ భూమి అంతా ఒక పురాతన రహదారి. ఆ రహదారికి పొద్దున-సాయంత్రం రెండే రెండు ద్వారాలు. ఒక ద్వారం గుండా రావాలి. మరో ద్వారం ద్వారా వెళ్ళిపోవాలి. దారి మధ్యలో ఉండాలన్నా జీవితం ఉండనివ్వదు. ఉండిపోవాలనుకోవడం సృష్టి ధర్మానికి వ్యతిరేకం.

ఆ పురాతన రహదారే ఆధునిక యుగంలో జాతీయ రహదారి అయ్యింది. ఈ ఆధునిక రహదారిలో ప్రతి అరవై కిలోమీటర్లకు మన పాపపుణ్యాలను మనకు శాస్త్రీయంగా గుర్తు చేసేవే టోల్ గేట్లు. అందులో మన సంచిత పాప ఫలానికి అంటే అక్యుములేటెడ్ పాపానికి ప్రతిరూపంగా రూపొందినదే ఫాస్ట్ ట్యాగ్.

చిన్నయసూరి రాసిన వ్యాకరణానికి బాల వ్యాకరణం అని పేరు పెట్టాడు. నిజానికి ఇప్పుడది వృద్ధులకు కూడా జీర్ణం కాని మహా ప్రౌఢ వ్యాకరణం. అందులో సమాస పరిచ్ఛేదం ఒక భాగం. రెండు పదాలు ఒకటిగా ఏర్పడ్డం సమాసం. ఫాస్ట్ ట్యాగ్ రెండూ ఇంగ్లీషు పదాలే అయినా అందులో సమాసం లేకుండా పోదు.
ఫాస్ట్ గా వెళ్ళడానికి ట్యాగ్;
ఫాస్ట్ గా పంపే ట్యాగ్;
ఫాస్ట్ గా వెళ్లే ట్యాగ్;
ఫాస్ట్ గా వెళ్లడానికి అనువయిన ట్యాగ్;
ఫాస్ట్ గా వెళ్లడానికి అనుమతించే ట్యాగ్;
ఫాస్ట్ గా వెళ్లే వాహనానికి ట్యాగ్…ఇలా ఏ సమాసం కిందికి వస్తుందో వ్యాకరణవేత్తలు నిగ్గు తేల్చుకోలేకపోతున్నారు.

వేదం అందరూ చదవలేక, చదివినా అర్థం కాక, అర్థమయినా ఆచరించలేక వేదాంతాన్ని ఆశ్రయిస్తారు. “తెలిసేట్టు చెప్పేది సిద్ధాంతం. తెలియకుండా చెప్పేది లేదా తెలియకుండా చేసేది వేదాంతం”. ఇక్కడే ఫాస్ట్ ట్యాగ్ కు- వేదాంతానికి పొత్తు చక్కగా కుదురుతుంది.

టోల్ గేట్లు ఎందుకు? ఎన్ని యుగాలపాటు టోలు గేట్లలో మన తోలు ప్రయివేటువాడు వొలుచుకోవడానికి అధికారముంటుంది? అన్నవి అర్థరహితమయిన ప్రశ్నలు. సనాతన ధర్మంలో ఎన్నో జన్మల పాప పుణ్యాలు క్యారీ అవుతూనే ఉంటాయి. జన్మ రాహిత్యమే మోక్షం. కాబట్టి కొన్ని కోట్ల జన్మల్లో పేరుకుపోయిన మన పాపం పటాపంచలు కావాలంటే టోలు గేట్లగుండా మనం వీలయినంత ఎక్కువ ప్రయాణిస్తూనే ఉండాలి. దాంతో యమ స్పీడ్ గా పాప క్షయం అవుతుంది.

ఇదివరకు టోల్ గేట్లలో మనుషులు కూర్చుని డబ్బు తీసుకుని, ఇనుప రాడ్ పైకెత్తి వాహనాలను పంపే పద్ధతివల్ల పాపక్షయం స్లోగా ఉండేది. దాంతో జాతి విశాల పాపక్షయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఫాస్ట్ ట్యాగ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇది మన పురాకృత జన్మల పుణ్య విశేష ఫలం.

ఫాస్ట్ ట్యాగ్ ముందే కొని మెడలో మంగళసూత్రంలా వాహనం ముందు అద్దానికి అతికించుకోకపోతే- టోల్ గేట్లలో రెండింతల జరిమానాకు దయగల చట్టం అనుమతిస్తుంది.

శంకరాచార్యులు అన్నపూర్ణ స్తోత్రంలో చివర ఫల శ్రుతిలో ఒక మాటన్నాడు.

“జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతీ!”

జ్ఞాన వైరాగ్యాలు భిక్షగా పెట్టు తల్లీ! అని అన్నపూర్ణ కాళ్లా వేళ్లా పడాలట మనం.

“దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ
నోపక కద నన్ను నొడబరచుచు
పైపైన సంసార బంధముల కట్టేవు!
నా పలుకు చెల్లునా? నారాయణా!”
అని అన్నమయ్య కూడా ఇదే భావాన్ని చెప్పాడు. “ఓ స్వామీ! గొప్పగా వెలిగే వైరాగ్య దివ్య సౌఖ్యం నువ్వు ఇవ్వకుండా ఇలా ఏవేవో సంసార బంధాల్లో నన్ను కట్టి పడేస్తే…ఇక నా మాటలకు ఏమి విలువ ఉంటుంది? చెప్పు!” అని వైరాగ్య భిక్ష ప్రసాదించాలని వెంకన్నను అచ్చ తెలుగులో మొహమాటపెట్టాడు.

ఫాస్ట్ ట్యాగ్ ఉద్దేశం అదే. జ్ఞానానికి జ్ఞానం. వైరాగ్యానికి వైరాగ్యం. వేదాంతానికి వేదాంతం. వేగానికి వేగం. ఖర్చుకు ఖర్చు. పాపక్షయానికి పాపక్షయం.

అన్నట్లు-
ఫాస్ట్ ట్యాగ్ ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 2021-22 సంవత్సరంలో వచ్చిన ఆదాయం అక్షరాలా 51 వేల కోట్ల రూపాయలు. అంటే అర లక్ష కోట్లు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు 50 శాతం పెంపు. 2023-24 ఏడాదికి వచ్చిన ఆదాయం 62 వేల కోట్లు. 2024-25 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం ఆశిస్తున్న ఫాస్ట్ ట్యాగ్ ఆదాయం లక్ష కోట్లు. సున్నాలదేముంది? ఒకదశ దాటిన తరువాత ఎన్ని సున్నాలయినా గోడక్కొట్టిన సున్నాలే!

“రోడ్లు అభివృద్ధికి సూచికలు.”
మన రోడ్లు బాగుండాలంటే మన చర్మం మనమే వలిచి, మనమే వాటిని రోడ్లకు ఒక మెత్తటి లేయర్ గా వేసి, సుఖమయిన ప్రయాణానికి మనకు మనమే అర్పణ కావాలి. హారతి కర్పూరం కావాలి. మన కొరకు, మన వలన, మన చేత, మనమే ఎన్నుకున్న మన ప్రభుత్వంలో “మన” మనుగడ ప్రశ్నార్థకం కావాలి.

ఫాస్ట్ ట్యాగ్ స్తోత్ర ఫలశ్రుతి:-
“జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం ఫాస్ట్ ట్యాగ్ భిక్షామ్ దేహీ చ రహదారీ!”

కొసమెరుపు:-
రోడ్లు బాగుచేయకుండా టోల్ వసూలు చేస్తే…ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నాణ్యమైన రోడ్లు లేనిచోట్ల టోల్ గేట్లను ఏర్పాటు చేయకూడదని, చేసిన… రోడ్లు బాగు చేసేవరకూ టోల్ వసూలు చేయకూడదని అధికారులకు, రోడ్లను నిర్మించి… నిర్వహించే ప్రైవేటు ఏజెన్సీలకు ఆయన ఆదేశాలు ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. “రాజు మొదటి భార్య మంచిది అంటే రెండో భార్య…?” సామెత ఉండనే ఉంది. ఆ సామెతలో చెప్పని మాటను ఎలా పిండుకోవాలో లోకానికి తెలుసు. అలా రోడ్లు బాగు చేసి...టోలు మార్గంలో ఎంత తోలు ఒలుచుకున్నా పరవాలేదు అని గడ్కరీ చెప్పని మాట స్పష్టంగా చెప్పినట్లు అని లోకానికి చెప్పాల్సిన పనిలేదు.

దేశానిర్మాణం కోసం జాతిజనుల ఆత్మార్పణలో టోల్ వసూళ్లు సముద్రంలో ఆవగింజంత కూడా కాకపోవచ్చు.
అంతే! అంతే!!

నిష్ఫల శ్రుతి:-
మన కోసం, వలన, యొక్క, కొరకు, పట్టి, కై అని మన తరువాత ఎన్ని విభక్తులు కలుపుకున్నా… మనకోసం మనమే ఎన్నుకున్న ప్రభుత్వాలు మనల్ను గాలికెలా వదిలేస్తాయో తెలిపే ఉదంతమిది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒకానొక రోడ్డు గుంతలు పడి...వానొస్తే నీటి మడుగులు తేలడంతో స్థానికులు(ఎక్కువగా ఐ టీ ఉద్యోగులు) ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఫలితం లేదు. విసిగి వేసారి…తామే సొంతంగా డబ్బులు పోగు చేసి…శ్రమదానం చేసి…రోడ్డు మీద గుంతలు పూడ్చారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో…ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కర్ణాటక డెప్యూటీ సి ఎం డి కె శివకుమార్ అధికారులను ఆదేశించారట. నిజానికి అందరూ ఇలాగే ధన, శ్రమదానం చేసి ఎవరికి వారే రోడ్లు వేసుకుంటే బాగుంటుందని ఆయన మనసులో కచ్చితంగా అనుకుని ఉంటారు!

(పాత కథనానికి కొత్త డేటా మేళవింపు)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్