Tuesday, January 28, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంహాస్య విషాదం - విషాద హాస్యం

హాస్య విషాదం – విషాద హాస్యం

హైదరాబాద్ లో ఒక వ్యాపారవేత్త. అభిరుచికొద్దీ స్టాండప్ కమెడియన్ కూడా అయ్యాడు. బాగా పేరు తెచ్చుకున్నాడు. లెక్కలేనంత సంపద ఉంది. భార్యతో గొడవపడి…ఆ కోపంతో రాత్రంతా అత్యంత ఖరీదైన పోర్షే కారులో ఒంటరిగా అత్యంత వేగంగా నడుపుతూ…ఇక తిరగలేక పొద్దు పొడిచే వేళ ఒక చెట్టును బలంగా గుద్ది ఆగాడు. కార్లో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కలవారి కార్లకు ఏమైనా ఇన్సూరెన్స్ వెంటనే అవసరానికి మించి వస్తుంది కాబట్టి కారు పచ్చడి కావడం మీద మనం పెద్దగా బాధపడాల్సిన పనిలేదు. తెల్లవారుజామున క్యాన్సర్ ఆసుపత్రి చుట్టూ రోడ్డుమీద పడుకున్న నిర్భాగ్యులమీదికి భార్యతో గొడవపడ్డ ఈ పోర్షే కారు చక్రాలు వెళ్ళనందుకు నిజంగా సంతోషించాలి. ఇంత వింత ప్రవర్తనకు కారణం మద్యం, డ్రగ్స్ ఏమన్నా తీసుకున్నాడా అన్నది పరీక్షల ఫలితాలు వచ్చాక తెలుస్తుంది. అనేక సెక్షన్ల కింద పోలీసులు అతడిపై కేసులు పెట్టారు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేశారు.

సామాజిక మాధ్యమాల్లో ఈ సంఘటనమీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అందులో కొన్ని పాయింట్లు ఇవి:-

  • అందరినీ నవ్వించేవాడి జీవితం ఇలా ఏడ్చింది.
  • కావాల్సినంత డబ్బుంది. పొట్టనిండా పొట్టచెక్కలయ్యే నవ్వులున్నాయి. కానీ లేనిది ఏమిటి?
  • నగరంలో రాత్రంతా ఒంటరిగా హై స్పీడ్ లో విలాసవంతమైన కార్లు నడిపేవారిమీద ఒక సమగ్రమైన అధ్యయనం జరగాలి.

  • సమాజంలో జరిగే అనేక సీరియస్ విషయాలకు హాస్యం పూత పూసే కమెడియన్ ఇంత సీరియస్ గా ప్రమాదం చేయడం ద్వారా భార్యకు ఏ సందేశం ఇవ్వాలనుకున్నాడు? సభ్యసమాజనికి ఏమి చెప్పదలుచుకున్నాడు?
  • కలవారి ఇళ్ళళ్ళో భార్యలు రాత్రిళ్ళు భర్తలతో గొడవపడకుండా సంయమనం పాటించకపోతే పోర్షేలన్నీ రెండొందల కిలోమీటర్లు దాటిన వేగంతో రోడ్లమీద తిరిగితే ఒక్కో రాత్రికి నగరంలో ఎన్ని శవాల గుట్టలు పోగవుతాయి?
  • ఈరోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని విలాసవంతమైన అత్యాధునిక కార్లలో లెక్కలేనన్ని చిత్ర విచిత్రమైన ఫీచర్లు ఉంటున్నాయి. భార్యతో గొడవపడ్డ భర్త వైస్ వర్సా భర్తతో గొడవపడ్డ భార్య ఒంటరిగా ఊరంతా వేగంగా నడుపుతూ చివర యాక్సిడెంట్ చేయాలనుకుని పోర్షేలు, బెంట్లీలు, రోల్స్ రాయిస్ లు, బుగాటి వేరన్లు తీయగానే పసిగట్టి…ముందుకు కదలకుండా ఆపేసే ఫీచర్ ను ప్రవేశపెట్టాలి. మహా అయితే వారింటి గోడకే గట్టిగా గుద్దుకునే సాంకేతిక వెసులుబాటు కలిగించాలి.

  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం స్వయంగా రచించి, నటించి, దర్శకత్వం వహించిన దూరదర్శన్ హాస్య కదంబ కార్యక్రమం “ఆనందో బ్రహ్మ”లో పరస్పరం గొడవపడే నవదంపతులు కౌన్సిలింగ్ కోసం సైకాలజిస్ట్ దగ్గరికి పరుగెత్తుకువెళితే…సరిగ్గా అదే సమయానికి ఆ సైకాలజిస్ట్ దంపతులు అట్లకాడ – దుడ్డుకర్రతో పరస్పరం కొట్టుకుంటూ ఉంటారు. సీత కష్టాలు సీతవి- పీత కష్టాలు పీతవి. ప్రతి సన్నివేశాన్ని లైట్ తీసుకోమని నవ్వుతూ చెప్పే కమెడియన్ కు లైట్ తీసుకోవడానికి వీల్లేనంత కష్టం ఏమొచ్చిందో మనకేమి తెలుసు?

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్