Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Common Man Suffering With Daily Hike Of Petrol Rates :

పొట్టివాడుగా వచ్చి బలి మూడడుగుల నేల దానంగా ఇవ్వగానే, తనకు రావలసిన ఆ మూడు అడుగులు కొలుచుకోవడానికి త్రివిక్రముడిగా ఎదిగిపోయిన వామనుడిని వర్ణిస్తూ మహానుభావుడు పోతన ఓ చక్కని పద్యం చెప్పాడు.  ఆ పద్యం చదువుతుంటే క్రమక్రమంగా పెరుగుతున్న వామనుడు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తాడు.

ఆ పద్యం ఇలా సాగుతుంది.

“ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపై
నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై!”

ఇంతైనాడు, అంతైనాడు, ఆకాశానికి అంతైనాడు, మేఘమండలానికి అల్లంతైనాడు, జ్యోతిర్మండలానికి అంతైనాడు, చంద్రుణ్ణి మించి, ధ్రువుడిని దాటి, మహర్లోకం దాటి, సత్యలోకంకన్నా పైకెళ్లి, బ్రహ్మాండమంతా నిండిపోయాడు అంటాడు.  ఇలా బ్రహ్మాండం అంతా నిండిపోయిన వాడు ఓ అడుగుగా భూమిని, ఓ అడుగుగా ఆకాశాన్ని కొలిచేసి, మూడో అడుగు బలి నెత్తిపై పెట్టి పాతాళానికి తోక్కేశాడు.

ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఇలా అన్నీ హద్దులని దాటేసి పైకెళ్లిపోతున్నాయి. వామనుడి త్రివిక్రమ స్వరూపాన్ని కళ్ళకు గట్టినట్లు పద్యంలో బంధించిన పోతన గారు కూడా… అడ్డూ, అదుపూ లేకుండా పెరిగిపోతున్న ఈ పెట్రో ధరల ఆకాశగమనాన్నివర్ణించడానికి తడబడేవాడేమో?

వామనుడు మూడోపాదం బలి చక్రవర్తి నెత్తిన పెట్టి తొక్కేసినట్లు ఈ పెట్రో మంటలు సగటు భారత పౌరుల నెత్తిన కాలు పెట్టి మరీ పాతాళానికి తొక్కేస్తున్నాయి. నీరు, కూడు, గూడు, గుడ్డ లాగా ఇప్పుడు ఈ పెట్రోల్-డీజిల్ కూడా ప్రతి మనిషికి ఒక నిత్యావసరాలై కూర్చున్నాయి.  కూటి కోసం ఏదో ఒక కష్టం పడే ప్రతివాడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ ధరల వల్ల ప్రభావితం అయ్యేవాడే.

ఇక ‘రాచ పీనుగ ఒంటరిగా పోదన్నట్లు’ ఈ పెట్రోల్-డీజిల్ ధరలు కూడా ఒంటరిగా పైకి పోవు, తమతో పాటు పాలు, పెరుగు, కూరగాయలు, పచారి సామాన్లు వంటి ధరలను కూడా పైపైకి తీసుకెళ్తాయి. దీంతో సామాన్యుడి బ్రతుకు దిన దిన గండం నూరేళ్ళ ఆయిష్షు అయ్యింది.

 ఇవన్నీ నిజమే. ధరలు పెరుగుతున్నాయి, పెరుగుతున్నాయి అని యాగీ చేయడం తప్ప, కానీ ఈ పెట్రోల్-డీజిల్ ధరలు ఎందుకు ఇలా పెరుగుతున్నాయి అని ఎవరన్నా మనసు పెద్దది చేసుకొని ఆలోచించారా?

ఇది తెలుసుకొంటే, మన ఆలన పాలన చూసుకోవడానికి మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు మనకోసం పడుతున్న కష్టం అర్ధం అయ్యి గుండె బరువై, కళ్ళు నయాగరా జలపాతాలు అయ్యేవి.

మొన్న అక్టోబర్ లెక్కల ప్రకారం లీటర్ పెట్రోల్ మన కేంద్రం అక్షరాల 44 రూపాయల 40 పైసలకు కొని కేంద్రం– రాష్ట్రం కలిసి దానిపై 60 నుంచి 70 రూపాయల మధ్య పన్నువేసి (కేంద్రం స్టాండర్డ్ గా ఓ 33 రూపాయల పన్ను వేస్తుంటే.. రాష్ట్రాలువేసే పన్నులు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉన్నాయి లెండి) దాదాపు రూ.106-114 మధ్య వివిధ రాష్ట్రాలలో అమ్ముతున్నారు తెలుసా?  డీజిల్ విషయం కూడా కొద్దిగో గొప్పో అటు ఇటూగా అంతే ఉంటుంది లెండి.

మొత్తం మీద పెట్రోల్ ధరలో దాని అసలు ధర 42% దానిమీద పన్ను 58%, అలానే డీజిల్ అసలు ధర 49% దాని మీద పన్నుల భారం 51% గా ఉంది.   

ఇలానే కేంద్రం-రాష్ట్రం ఇంతింత పన్నులు ఎందుకు వసూలు చేస్తున్నారని ఓ అమాయక ఎంపీ పార్లమెంట్ లో సదరు పెట్రోల్ మంత్రి గారి ని అడిగితే ఆయన దిమ్మరిగిగే సమాధానం ఇచ్చారు.

The revenue generated by taxation is used in various developmental schemes of the Government like Pradhan Mantri Gram Sadak Yojana (PMGSY), Pradhan Mantri Ujjawala Yojana (PMUY), Ayushman Bharat, Pradhan Mantri Garib Kalyan Yojana (PMGKY) and also to provide relief to the poor during pandemic by schemes like Pradhan Mantri Garib Kalyan Anna Yojana (PMGKAY) under which free ration was provided to 80 crore beneficiaries during April, 2020 to November 2020 and May- June 2021, free vaccination for COVID – 19 etc. Over the last 7 years, length of National Highways has gone up by 50% from 91,287 km (as of April 2014) to 1,37,625 km (as on 20 March 2021). Highway construction per day in India increased almost 3 times from 12 km/day in 2014-15 to 33.7 km/day in 2020-21. The cess is used for infrastructure development and also generates employment.

ఈ సమాధానం చూస్తే మీకు తత్వం బోధ పడ లేదా?

ఆఫ్టరాల్, నలుగురు సభ్యులున్న మన కుటుంబాన్ని పోషించు కోవడానికే, మనం నానా గడ్డి తింటుంటే కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రాలను, దేశాన్ని పోషించడానికి మన నాయకులు ఎంత కష్టపడుతున్నారో చూడండి.

అందులో నూటికి మూడుంతుల మంది దరిద్ర రేఖ దిగువన పడి, పైకి రాలేక కొట్టుకొంటుంటే ప్రభుత్వం ఏమిచేయాలండి?
ఎన్ని పధకాలు, ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని ప్రణాళికలు.. ఇవన్నీ ఎవరికోసం అండీ ?మనకోసం కావూ?
మరి ఇన్నిన్ని చెయ్యాలంటే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?  పన్నులేసి మన జేబుల్లోంచి గుంజకపోతే.

ఏదో ఆక్సిడెంట్ లో గాయాలు అయ్యి రక్తం పోయిన వాడికి రక్తం కావాలంటే ఏమి చేస్తున్నాం?

ఉన్నవాడి దగ్గర గుంజి అవసరం అయ్యిన వాడికి ఎక్కించడంలా? ఇది అంతే.  కాకపోతే అక్కడ డాక్టర్లు నిజంగా అవసరం అయినవాడికి ఎక్కిస్తున్నారు.  ఇక్కడ మన నాయకులు రేపు మనకు ఎన్నికలలలో అవసరం అవుతారనుకున్న వారికి ఎక్కిస్తున్నారు. అంతే తేడా.. మిగతా అంతా అంటే గుంజుకోవడం, ఎక్కించడం మాత్రం సేమ్ తో సేమ్ కదండీ.

ఈ మాత్రం దానికి పెట్రోల్-డీజిల్ రేట్ లు పెరిగాయి, పెరిగాయి అని ఈ గొడవ దేనికండి!

అయినా పెట్రోల్-డీజిల్  కొనమని మనని ప్రభుత్వం ఏమన్నా బలవంతం చేసిందాండి?

కొనగలితే కొనండి లేక పోతే దేవుడిచ్చిన కాళ్లతో నడిచిపొండి.

ఆమాట కొస్తే పాలు, పెరుగు, కూరలు కొనండి, తినండి అని మాత్రం ప్రభుత్వం ఏమన్నా బలవంతం చేసిందా చెప్పండి.  ఓపికుంటే కొనుక్కోడి, తినండి, లేదంటే పస్తులుండంది.

అంతేగానీ, సంక్షేమానికి, అభివృద్ధికి అడ్డుపడితే ఎలా అండీ?

మన కోసం ప్రభుత్వాలు ఎన్నెన్ని త్యాగాలు చేస్తుంటే మన వంతుగా కొంత అయినా చేయలేమా, ఒక్కసారి ప్రశ్నించుకోండి?

అయినా భూమి మీద మనం శాశ్వతంగా ఉంటామటండీ?

ఎంతకాలం ఉంటామో తెలియదు. ఎప్పుడు పోతామో తెలియదు గదండీ

ఎప్పుడైనా పోయేడానికి, కాస్త ఉపవాసాలు ఉండి నాలుగు రోజులు ముందు పోతే మాత్రం ఏమిటండీ?

జీవచ్ఛవంగా బ్రతకడానికి అవకాశం ఉన్న ఈ కాస్త కాలంలో కొద్దిగా మన ప్రభుత్వాలకు సహకరించి వాళ్లెసిన పన్నులు “అన్నీ మూసుకొని” కట్టేసి బ్రతకలేమటండీ.

“నేను సైతం, నేను సైతం పెట్రో అగ్నికి సమిధను ఒక్కటి ఆహుతిస్తాను” అనుకొంటూ కాలం వెళ్లదీయలేమటండీ?

ఒక్క సారి ఆలోచించండి.

-శ్రీ వెంకట సూర్య ఫణి తేజ

Also Read : పెట్రో రేట్లను మరింత తగ్గించిన తొమ్మిది రాష్ట్రాలు

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com