Tuesday, February 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపెట్రోల్ సెంచరీ కొట్టింది

పెట్రోల్ సెంచరీ కొట్టింది

Why Petrol Prices Increasing in India : 

మనం సరిగ్గా పట్టించుకోము కానీ – ఇంధనం అన్న మాటలో ధనమే ముఖ్యమయినది. తెలుగులో చివర ఉన్న మాటే ప్రధానం. ముందున్న భాగం ఉపసర్గో, విశేషణమో, క్రియా విశేషణమో అయి ఉంటుంది.

అయినా పెట్రోల్, డీజిల్ ధరల మంటల గురించి మాట్లాడేప్పుడు ఉపనరకం, విషాదం, నిష్క్రియాపరత్వాలు ఉంటాయి కానీ-భాషా వ్యాకరణాలు ఉండవు.

హైదరాబాద్ లో పెట్రోల్ సెంచరీ కొట్టిందని మొదటి పేజీల్లో వార్తలొచ్చాయి. ఇక డబుల్ సెంచరీకి భయం భయంగా ఎదురు చూడడం తప్ప మనం చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. డీజిల్ కూడా త్వరగా శతకం కొట్టేస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఇదివరకు సంవత్సరానికి ఒకసారో, రెండు సార్లో పెరిగేవి. ఇప్పుడు అచ్చే దినాలు కాబట్టి రోజూ పెరుగుతుంటాయి.

Why Petrol Prices Increasing in Indiaప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎంత? మన దేశంలో ఎంత? అందులో కేంద్రం, రాష్ట్రం సుంకాలు ఎంత? అసలు ధర ఎంత? అన్నవి తెలియకుంటేనే నయం. తెలిస్తే గుండెలు బాదుకోవాల్సి వస్తుంది. కీలెరిగి వాత పెట్టాలి. లోకం కరోనా కీడుతో విలవిలలాడుతోంది. ఇలాంటి వేళ కీడెరెగి పెట్రో వాతలు పెడితే కరోనా ఏడుపులో పెట్రో ఏడుపు అసలు వినిపించదు.

సంస్కృతంలో శతం, సహస్రం అంటే వంద, వెయ్యి అని సంఖ్యాపరమయిన అర్థం ఉన్నా- ఎక్కువ, అంతులేని, లెక్కపెట్టలేని అన్న అర్థమే ప్రధానంగా తీసుకోవాలి. ఆ కోణంలో చూసినప్పుడు పెట్రోల్, డీజిల్ లీటర్ రేట్లు శతం సహస్రమయినా, శత సహస్రమయినా వచ్చినవి అచ్చంగా అచ్చే దిన్ అనే అనుకోవాలి. వచ్చేది కూడా ఇలాంటి అచ్చే దినాలనే అనుకోవాలి.

Why Petrol Prices Increasing in India :

ఎంత ధనానికి అంత ఇంధనం – అన్నది సమకాలీన ఆదర్శం. పేద, మధ్య తరగతి జనం ఇంధన ధన బంధనాల్లో నుండి శాశ్వతంగా విముక్తులు కావాలన్నది అచ్చే దిన్ లో ఒక సంకల్పం.

వంద, రెండు వందలు ఇలా పెంచుకుంటూ పొతే జనం పెట్రోల్, డీజిల్ అసలు పోయించుకోరు. దాంతో వారికి ఎంతో ఆదా. అంతులేని ఆరోగ్యం. ఇదంతా నిగూఢ ఇంధన వ్యూహం. మన రోగానికి డాక్టర్ చేదు మందు ఇచ్చినా తాగాల్సిందే. మనబాగుకు ప్రభుత్వాలు పెట్రో ధరల విష కషాయాన్ని ఇస్తే స్వీకరించాల్సిందే.

పెట్రోల్, డీజిల్ మూత తీసి ఉంచితే ఆవిరయి, అనంతవాయువుల్లో కలిసిపోతుంది. వాహనాల ట్యాంకుల్లో పోస్తే ఇంజిన్ను కదిలిస్తుంది. అయితే ఈ ఇంధనాలు కంటికి కనపడకుండా కోట్ల టన్నుల విష తుల్యమయిన కర్బన పదార్థాలను విడుదల చేస్తాయి. మన ఊపిరితిత్తులు పాడవుతాయి.

Why Petrol Prices Increasing in India

కేవలం మన ఊపిరితిత్తులను కాపాడడాలన్న మహదాశయంలో భాగంగానే పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడానికి- ఇంకేమీ చేయలేక పూటకోసారి రేట్లను పెంచుతున్నారు అనుకుంటే – ఊపిరితిత్తులు ఎలాగూ పాడయ్యాయి కాబట్టి- మిగిలి ఉన్న గుండె అయినా కొట్టుకుంటూ ఉంటుంది.

పెట్రో రేట్ల గురించి ఎక్కువ ఆలోచిస్తే మొదట గుండె లయ త ప్పుతుంది. అప్పటికీ ఆలోచనలు ఎవరికి వారు నియంత్రించుకోకపోతే మెదడు కొయ్యబారుతుంది. అయినా విడిచిపెట్టకుండా ఆలోచిస్తూనే ఉంటే- మెడుల్లా అబ్లాంగేటాలో పెట్రో క్రూడ్ డీజీ లిక్విఫైడ్ బారెల్ బుడిపెలు ఏర్పడి మెదడులో రక్త ప్రసారం ఆగిపోతుంది. ఆపై లోలోపల పెట్రోల్ ఆవిర్లుగా మండి మెదడు నరాల్లో ప్రాణవాయువు స్తంభించి పోతుంది.

అతిగా భయపెడతారు కానీ- ఇవన్నీ ఎందరికో జరిగినా ఎవరూ పోలేదు. పోయినవారెవరూ ఈ జబ్బులతోనే పోయినట్లు రుజువు కాలేదు.

ఇదిగో బాబూ!

ఈ వంద నోటు తీసుకుని ఒక చెంచా పెట్రోల్ నా బండి నోట్లో పొయ్యి!
నా గ్రహచారం బాగుంటే కదులుతుంది.
నీ గ్రహచారం బాగుంటే ఇక్కడే ఉంటుంది!

-పమిడికాల్వ మధుసూదన్

Must Read : పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన

RELATED ARTICLES

Most Popular

న్యూస్