Sunday, January 26, 2025

మన భాష- 15

ఇంగ్లీషు నుండీ, ఇంగ్లీషు ద్వారా వచ్చిన మాటల్లో అనేక రకాలున్నాయి. అచ్చుతో అంతమయ్యే మాటలను చాలావరకు దీర్ఘాంతాలుగానే వాడుతున్నాం. థీరీ, స్టూడియో, అంబ్రెల్లా, మాస్టరీ, ఆరోమా, పనోరమా, ఫార్మసీ, మినిస్ట్రీ, ట్రీటీ, ట్రాఫీ, గ్లోరీ, విక్టరీ, మాండేటరీ, కేఫ్టీరియా, ఫోబియా, ఫార్ములా, అలెర్జీ, అటాప్సీ, ఇండస్ట్రీ, మార్చురీ, ఆర్టిలరీ, ఇమేజరీ, బాటరీ, సర్జరీ, రెవిన్యూ, లిబర్టీ, ఏరియా, యూరియా వంటి మాటల్లో కొన్నింటిని కొంతమంది హ్రస్వాంతాలుగా రాస్తున్నారు. థీరీని థియరి అనీ, థియరీ అని కూడా రాస్తున్నారు. స్టూడియొ, ట్రాఫి, ఆర్టిలరి అని రాసే వాళ్ళూ ఉన్నారు. ప్రస్తుతం వీటిని దీర్ఘాంతాలుగా రాయడమే ఎక్కువ ప్రచా రంలో ఉంది.

అల్ట్రా, యాంటీ, మానెటరీ, శానిటరీ వంటి మాటలను విశేషణాలుగా ఉపయోగిస్తున్నాం. వీటిని కూడా దీర్ఘాంతాలుగానే వాడుతున్నాం.

ముఖ్యంగా వివిధ శాస్త్రాల పేర్లకు సంబంధించిన మాటలెన్నో తెలుగులో వాడుకలోకి వచ్చాయి. హిస్టరీ, జాగ్రఫీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, పథాలజీ, అస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, జియాలజీ, సైటాలజీ, డెంటిస్ట్రీ, ఫార్మకాలజీ, డెర్మటాలజీ, కార్డియాలజీ, ఆఫ్తల్మాలజీ, సైకియాట్రీ, జ్యామెట్రీ, ట్రిగనామెట్రీ, ఆల్ జీబ్రాల వంటివి కూడా దీర్ఘాంతాలుగానే వాడుకలో ఉన్నాయి.

అనేక ఆధునిక శాస్త్రాలకు సంబంధించిన పరిభాష ముఖ్యంగా గ్రీకు, లాటిన్ భాషల నుండి ఇంగ్లీషు భాషలోకి వచ్చింది. ఇంగ్లీషు నుండి తెలుగులోకి కూడా వచ్చింది. ప్లాజ్మా, ఫిస్టులా, కార్నియా, హెర్నియా, కిడ్నీ, ఆల్గే, వెర్టెబ్రా, వీనకావా, స్పాచ్యులా, రెటీనా, ప్లాటినా, కరోనా వంటి మాటలెన్నో ఆవిధంగా వచ్చినవే. వీటన్నిటినీ దీర్ఘాంతాలుగానే వాడుతున్నాం.

డెమోక్రసీ, మాబోక్రసీ వంటి మాటల్నీ దీర్ఘాంతాలుగానే రాస్తున్నాం.

ఇంగ్లీషు పరిపాలన వల్లనైతేనేం, ఆంగ్లసాహిత్యం ద్వారానైతేనేం, నేటి అంతర్జాతీయత వల్లనైతేనేం ఎన్నో ఇంగ్లీషు పేర్లు మనవాడుకలోకి వచ్చాయి. క్రైస్తవమతం స్వీకరించిన తెలుగు వారిలో కొందరు ఇంగ్లీషు పేర్లు పెట్టుకుంటున్నారు. ఈ పేర్లలో కొన్ని ఇంగ్లీషు అయితే మరికొన్ని హీబ్రూ, లాటిన్ ఇతర యూరోపియన్ భాషలకు చెందినవి. వీటిలో కొన్ని అచ్చుతో అంత మయ్యేవి.

ఆల్టో అనేది జర్మానిక్ పదం. ఆల్టో అంటే ధనిక+వృద్ధ, అలోన్జో, ఆల్ఫాన్జో రూపాంతరాలు. కులీన+సన్నద్ధం అని అర్థం. ఆంద్రే, ఆండ్రూ రూపాంతరాలు, ఆండీ వీటికి సంక్షిప్తరూపం. పురుషత్వం గల అని అర్థం. ఆంటోనీ, ఆంథోనీ రూపాంతరాలు. ఇది రోమన్ కుటుంబనామం. ఆర్చీ అన్నది ఆర్చిబాల్డ్ కు సంక్షిప్తరూపం. ఆర్చిబాల్డు అంటే పేరుగల+ధైర్యం అని అర్థం.

ఆబ్రే అన్నపేరు జర్మానిక్, ఒక విధమైన మంత్రశక్తి గల దివ్యవ్యక్తి+రాజు అని అర్థం. బారీ అన్నది ఐరిష్ పదం. ఈటె అని అర్థం. బర్ తలోమియో హీబ్రూ పేరు. బీవర్లీ అంటే బీవర్ బీళ్ళలో ఉండేవాడు. బిల్లీ అనేది విలియంకు సంక్షిప్తరూపం. బాబీ అన్నది రాబర్ట్ కు సంక్షిప్తరూపం. బ్రూనో అంటే గోధుమరంగు.

కారీ ఒక కుటుంబనామం. కాసీ అంటే ధైర్యవంతుడు. కాస్మో గ్రీకుపదం, నగ అని అర్థం. డేనీ డేనియల్ కు సంక్షిప్తరూపం. డేనియల్ హీబ్రూ పదం. డేవీ డేవిడ్ కు సంక్షిప్త రూపం. డానీ డోనాల్డుకు సంక్షిప్త రూపం, ప్రపంచం + శక్తి అని అర్థం. డ్రూ జర్మానిక్ పదం, నమ్మకస్తుడు అని అర్థం. డడ్లీ అంటే మెట్ట పొలం. ఎలిహూ, ఎలిజా పర్యాయపదాలు, హీబ్రూ మాటలు. ఎలిషా కూడా హీబ్రూయే. ఎమరీ జర్మానిక్ పదం, శ్రమించే పాలకుడు అని అర్థం. ఎన్రికో హెన్రీకి రూపాంతరం. హెన్రీ జర్మానిక్ పదం. దీనికి ఇల్లు+రాజ్యం అని అర్థం. గారీ అంటే శూలధారి అని అర్థం.

జెఫ్రీ అంటే దివ్యశాంతి. జెరీ జెరాల్డ్ కు సంక్షిప్తరూపం. గాడ్ ఫ్రే అంటే దేవుడు+శాంతి. గ్రెగరీ గ్రీకుమాట. జాగరూకత అని అర్థం. గే అంటే అడవి.

హారీ హెన్రీ, హెరాల్డులకు సంక్షిప్తరూపం. హార్వే అంటే సైన్యం+యుద్ధం. హిలరీ అంటే ఆనందంగా ఉండడం. లాటిన్ నుండి వచ్చింది హొరేషియో. హౌరేస్ కు పర్యాయరూపం. రోమన్ కుటుంబ నామం. హ్యూగో హ్యూగ్ కి పర్యాయరూపం. హంఫ్రీ జర్మానిక్ పదం, ఉన్నతం+శాంతి అని అర్థం. ఇరా, ఈసయ్యా హీబ్రూ పదాలు. జెడదియ్యా హీబ్రూ పదం. జెరమయ్యా కూడా అంతే. దీని రూపాంతరమే జెరమీ. జోనా, జెహూ, జెస్సే, జోషువా, జోజయ్యా, జూడా హీబ్రూ మాటలు. జో జోసెఫ్ కు సంక్షిప్తరూపం. జిమ్మీ జేమ్స్ కు సంక్షిప్తరూపం. లారీ లారెన్సుకు సంక్షిప్త రూపం.

లియో గ్రీకు నుండి వచ్చింది. సింహం అని అర్థం. లేవీ హీబ్రూ పదం. లూ లూయిస్ కి సంక్షిప్త రూపం. మాత్యూ హీబ్రూ మాట. మీకా మైకేల్ కు సంక్షిప్తరూపం. మికే కూడా అంతే. మన్రో కుటుంబనామం. మాంట్ గోమరీ కూడా అంతే. ముర్రే కూడా కుటుంబ నామమే. నీరో రోమన్ కుటుంబ నామం. నోవా హీబ్రూ.

ఒబాదియా హీబ్రూ పదం. ఒర్లాండో రోలాండ్ కు పర్యాయరూపం. ఓటో జర్మానిక్ పదం, ధనికుడని అర్థం. పెర్సీ, ఫెరీ కుటుంబనామాలు. క్విన్సీ లాటిన్ పదం. ఐదవ అని అర్థం. రామ్సే స్కాండినేవియన్ పదం. అటవీ ద్వీపం అని అర్థం. రాండీ రాండోల్ఫ్ కు సంక్షిప్తరూపం. రే రేమాండ్ కు సంక్షిప్తం. రాడ్నీ కుటుంబనామం. శాండీ అలెగ్జాండర్ నుండి వచ్చింది. సిడ్నీ కుటుంబనామం. స్టాన్లీ కూడా అంతే. టెరీ టెరెన్స్ కు సంక్షిప్తరూపం. టిమోతీ గ్రీకు పదం, సమ్మానం+ దేవుడు అని అర్థం. యూరయా హీబ్రూ పదం. వాల్డో జర్మానిక్ పదం. వెస్లీ కుటుంబ నామం.

హీబ్రూ మాటలన్నీ దాదాపుగా దైవసంబంధమైనవి. కుటుంబ నామాలు చాలావరకు స్థలనామాలు.

ఇటీవలి కాలంలో భారతీయుల పేర్లలో కూడా ఇంగ్లీషు పేర్ల సంక్షిప్తనామాల వంటివి చేరుతున్నాయి. సునీల్ గవాస్కర్, సన్నీగవాస్కర్ అయ్యాడు. మొహిందర్ అమర్నాధ్ జిమ్మీ అమర్ నాధ్ అయ్యాడు. అట్లాగే కృష్ణ, క్రిస్టొఫర్ రెండూ కిట్టూ అయ్యాయి.

(ఇందులో వాడిన ఫోటోలు “laxman telugu tutorial” యూట్యూబ్ వి. వారికి కృతఙ్ఞతలు)

-డి. చంద్రశేఖర రెడ్డి
98661 95673

రేపు:-
మన భాష-16
“పరభాషలపై మోజు మాతృభాషకు చేటు”

RELATED ARTICLES

Most Popular

న్యూస్