కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధరి సస్పెన్షన్‌పై పార్లమెంట్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధీర్ సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ.. ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. లోక్ సభ ప్రారంభం కాగానే అధీర్ రంజన్ పై వేటును ఎత్తివేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే.. అధీర్ రంజన్ చౌధరి సస్పెన్షన్‌ను ప్రస్తావించారు. అధీర్‌ను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. ‘అధీర్ సభలో ‘నీరవ్ మోదీ’ అని మాత్రమే అన్నారు. ‘నీరవ్’ అంటే శాంతి (హిందీలో నిశ్శబ్దం) అని అర్థం. అంతమాత్రానికే సస్సెండ్ చేస్తారా..? అతన్ని సస్పెండ్ చేయడం మంచిది కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మిమ్మల్ని (రాజ్యసభ చైర్మన్) కోరుతున్నాను’ అని ఖర్గే అన్నారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో గురువారం కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధరి ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బ్యాంకులకు వేల కోట్లు లూటీ చేసి పారిపోయిన నీరవ్ మోదీ గురించి అధీర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. వ్యాపారవేత్త నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోలేదని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ రూపంలో మౌనంగా ఉన్నట్లు అధీర్ ఆరోపించారు. దీంతో సభ నుంచి అధీర్‌ను సస్పెండ్ చేశారు.