Friday, November 22, 2024
HomeTrending Newsకాంగ్రెస్ ఎంపి టికెట్ల వెనుక మతలబు

కాంగ్రెస్ ఎంపి టికెట్ల వెనుక మతలబు

కాంగ్రెస్ రెండో జాబితాలో 56 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా అందులో అరుణాచల్ ప్రదేశ్ -2, గుజరాత్-11, మహారాష్ట్ర-7, కర్ణాటక-17, రాజస్థాన్-5, తెలంగాణ-5, పశ్చిమ బెంగాల్ -8, పుదుచ్చేరి-1 స్థానాలు ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రకటించిన 8 సీట్లలో అయిదు ముస్లీం వర్గానికే కేటాయించారు. మిగతా మూడింటిలో బెర్హంపుర స్థానం నుంచి పార్టీ అగ్రనేత అధీర్ రంజన్ చౌదరి పోటీ చేస్తున్నారు. మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ వేసిన ఎత్తుగడ ఎంతవరకు ఫలితాలు ఇస్తుందో చూడాలి. పోటీలో ఉన్నవారిలో అధికశాతం ఆర్థికంగా స్థితిమంతులే కావటం గమనార్హం.

మహారాష్ట్రలో 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కొల్హాపూర్ నుంచి చత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు షాహు షాహాజి చత్రపతికి టికెట్ ఇచ్చారు. ఎంపి టికెట్ దక్కినవారిలో ఇద్దరు పార్టీ నేతల వారసులు కాగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కొత్తవారికి అవకాశం ఇవ్వకుండా పార్టీ ఎమ్మెల్యేలనే బరిలోకి దించారు.

కర్ణాటకలో వారసులకు, నేతల బంధువులకు పెద్దపీట వేశారు. ఐదుగురు మంత్రుల వారసులతో పాటు మొత్తం తొమ్మిది మంది అగ్రనేతల బంధుగణానికి టికెట్లు ఇచ్చారు. అందులో AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ కలబురిగి నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఖర్గే కుమారుడు ప్రియంక్ ఖర్గే మంత్రిగా ఉన్నారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా ఈ తరహాలోనే అభ్యర్థుల ఎంపిక జరగిందని సమాచారం.

కాంగ్రెస్ రెండో జాబితా విడుదలపై కొత్త ఉహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రకటించిన ఐదుగురు అభ్యర్థులు అర్థబలంలో ఒకరిని మించి ఒకరని చెప్పుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవటంలో ఎవరికీ వారే సిద్దహస్తులని అంటున్నారు. కాంగ్రెస్ కు అంతో ఇంతో పట్టు ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అర్థబలం ఉన్నవారికి టికెట్లు ఇవ్వటం వెనుక మతలబు ఉంది అంటున్నారు.

నాగర్ కర్నూల్ సంపత్ కుమార్ కు ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గుచూపినా ఆర్థికంగా ప్రత్యర్థులను ఎదుర్కోలేరనే అర్థబలం, పార్టీలో సీనియర్ అయిన మల్లు రవికి ఇచ్చారని గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీని ప్రభావం మిగతా స్థానాలపై కూడా ఉంటుందని ఏఐసిసి వర్గాలు చెపుతున్నాయి.

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను శాఖ సీజ్ చేయటం, బ్యాంకు ఖాతాల స్థంభనతో పార్టీలో గందరగోళం నెలకొంది. అభ్యర్థులకు ప్రచార సామాగ్రి కూడా పార్టీ తరపున అందచేయలేని స్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అర్థబలం ఉన్నవారికి టికెట్లు ఇచ్చారని అంటున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారికి టికెట్లు ఇస్తే స్థానికంగా వారే చూసుకుంటారని…పార్టీ అశక్తతను సీనియర్ నేతలకు వివరించారని విశ్వసనీయ సమాచారం.

ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి, ప్రజల్లో బలం లేని, స్థానికంగా పట్టు లేని నేతలకు కొన్ని చోట్ల టికెట్లు దక్కాయి. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కొత్త ప్రయోగంతో ఎంతవరకు సవలీకృతం అవుతుందో చెప్పలేని రాజకీయ వాతావరణం నెలకొనిఉంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్