విద్యుత్ సౌధ ముట్టడించిన కాంగ్రెస్

తెలంగాణలో పెరిగిన కరెంట్ చార్జీలను తగ్గించాలంటూ విద్యుత్ సౌధ ముట్ట‌డికి కాంగ్రెస్ పిలుపునకు పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద మొత్తంలో కదిలారు. విద్యుత్ చార్జీలతో పాటు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపై కూడా నిరసన తెలియజేయడానికి కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాయి. కేంద్రం పెంచుతూ పోతున్న ధరలకు నిరసనగా సివిల్ సప్లై కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించింది. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుండి ర్యాలీ చేపట్టి, విద్యుత్ సౌధ ముట్టడించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పార్టీ నాయకులంతా ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని అక్కడి నుండి విద్యుత్ సౌధ ముట్టడికి వెళ్ళవలసి ఉంది. అయితే ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు నిర్వహించారు. అయినప్పటికీ నేతలు పోలీసులనిర్భంధాన్ని తప్పించుకొని ఆందోళనలో పాల్గొన్నారు.

విద్యుత్ సౌధ,సివిల్ సప్లై ఆఫీసుల ముట్టడికి బయలుదేరిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంథని ఎమ్మేల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితర రాష్ట్ర ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతులు పండించిన యాసంగి ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి అని విద్యుత్ సౌదా, సివిల్ సప్లై అఫిస్ ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఐ మ్యాక్స్ సర్కిల్ దగ్గర ఇందిరమ్మ విగ్రహం నుండి బయల్దేరిన నేతలను అడ్డుకోవటంతో పోలీసులతో వాగ్వాదం జరిగింది.

మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యుత్ సౌద ముట్టడికి యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, మహిళ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఎంతచెప్పినా వెనక్కి తగ్గకపోవడంతో ఇరువురి మధ్యఘర్షణ జరిగింది. తోపులాటలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు విద్యారెడ్డి కిందపడటంతో స్పృహతప్పి పడిపోయారు.ఆమెకు శ్వాస సమస్యలు ఉండటంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది.వెంటనే ఆమెను హుటాహుటిన నిమ్స్ కు తరలించారు.

Also Read : తెలంగాణలో విద్యుత్ ఛార్జీల మోత 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *