దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం, ధరల మంటపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు దిగుతోంది. ఢిల్లీ పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు హస్తం నేతలు ర్యాలీ చేపట్టగా పోలీసులు భగ్నం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో రాహుల్ గాంధీ సహా పార్టీ సీనియర్ నేతలు పాల్గొనగా…రాహుల్ గాంధీ, శశి థరూర్ సహా పలువురిని అరెస్టు చేశారు. కాంగ్రెస్ నేతల అరెస్టుపై రాహుల్ గాంధి మండిపడ్డారు.
ప్రజా సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయటం ప్రజాస్వామ్య విరుద్దమని రాహుల్ గాంధీ విమర్శించారు. ఎనిమిదేళ్ళలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బిజెపి నేతలపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా విచారణ సంస్థలను వాడుతున్న కేంద్ర ప్రభుత్వ పాలన నియంతృత్వాన్ని ప్రతిపలిస్తోందని ఆరోపించారు.
అటు పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి నేతృత్వంలో ఎంపిలు నిరసన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం సమీపంలో పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జంతర్ మంతర్ మినహా ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు.
Also Read : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: రాహూల్