Saturday, January 18, 2025
HomeTrending Newsమనుషుల మనుగడకు ముప్పు కోనోకార్పస్

మనుషుల మనుగడకు ముప్పు కోనోకార్పస్

ఆఫ్రికా నుంచి పూర్వం తుమ్మ చెట్టు ఆంగ్లేయుల ద్వారా భారతదేశానికి వచ్చి దేశమంతా వ్యాపించింది. తుమ్మ చెట్టుతో కలప, జిగురు తదితర అవసరాలు తీరుతున్నాయి. అదే రీతిలో విదేశాల నుంచి వచ్చిన కోనోకార్పాస్ మొక్క దేశమంతా విస్తరిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మొక్కలు లేని గ్రామం, పట్టణం లేదు.

పట్టణాల సుందరీకరణ పేరుతో ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లో ఈ మొక్కలను నాటాయి. హరితహారం, నీరు చెట్టు, వనమహోత్సవం తదితర కార్యక్రమాల ద్వారా పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వాలు మొక్కలు నాటే యజ్ఞం చేపట్టాయి. దీన్ని ఆసరాగా తీసుకొని కొందరు గుత్తేదారులు, అటవీ శాఖ సిబ్బంది కుమ్మక్కై మానవాళి మనుగడకే ముప్పుగా పరిణమించే మొక్కను ప్రతి ఊరుకు చేర్చారు. అటువంటి ప్రమాదకరమైన మొక్కల్లో కోనోకార్పస్‌ ఒకటి. మడ (మాంగ్రూవ్‌) అడవుల్లో పెరిగే మొక్కలుగా పిలిచే వీటిని అవగాహన లేక రోడ్ల పక్కన, డివైడర్ల మధ్యలో విరివిగా నాటుతున్నారు.

కువైట్ లో ఎడారి విస్తరణ అడ్డుకునేందుకు కోనోకార్పస్ ను 1988లో విరివిగా వాడారు. అమెరికాలోని ఫ్లోరిడా, ఆఫ్రికా తదితర దేశాల్లో అధికంగా కనిపించే కోనోకార్పాస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ముప్పుగా మారింది.

పచ్చదనం, అందం కోసం పెంచే ఈ మొక్కలతో ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనోకార్పస్‌ వృక్షాల పుప్పడి అత్యంత ప్రమాదకరమైనదని, కరోనా సోకిన వ్యక్తి శ్వాసకోశ సమస్యలతో ఎలా ఇబ్బంది పడతాడో ఈ చెట్ల నుంచి వచ్చే గాలిని పీల్చేవారు కూడా అంతటి ప్రమాదానికి గురయ్యే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఈ మొక్కలు పెరుగుతున్న కొద్ది సమీపంలోని భవనాలు, ఇతర నిర్మాణాలు పగుళ్ళు వచ్చి కూలుతాయి. అన్ని కాలాల్లో పచ్చగా ఉండే ఈ చెట్టు మీద పక్షి వాలదు. పక్షుల ఆవాసాలకు ఉపయోగపడని విషపు మొక్క ఇది. కొనోకార్పాస్ మొక్కలు నాటోద్దని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఆదేశాలు జారీ చేసినా అమలవుతున్న దాఖలాలు లేవు.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ మొక్కలను సమూలంగా నిర్మూలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ చొరవతో కాకినాడలో ఇప్పటికే 5వేల వరకు మొక్కలను తొలగించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా అటవీశాఖ అధికారులపై ఒత్తిడి పెరుగుతున్నది. తెలంగాణలో దాదాపు 10 కోట్లకు పైగా కోనోకార్పస్‌ మొక్కలు ఉన్నట్టు అంచనా. ఏపీలో వాటిని నిర్మూలిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా తొలగించాలని అటవీశాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని అటవీశాఖ అధికారులు చేతులెత్తాశారు. ప్రస్తుతానికి ఆ మొక్కలను కొత్తగా ఎక్కడా నాటడం లేదని చెప్పారు.

మానవ జాతి మనుగడకే ముప్పుగా పరిణమించిన కోనోకార్పాస్ మొక్కలు తెలుగు రాష్ట్రాల్లో వృక్షాలుగా ఎదిగాయి. సిఎం కెసిఆర్, కేటిఆర్, హరీష్ రావు నియోజకవర్గాల్లో మొదట నాటినా ఆ తర్వాత వాటిని కొంత వరకు తొలగించారు. కమీషన్లకు కక్కుర్తి పడి నాటిన కోనోకార్పాస్ విషపు మొక్కలను తొలగించేందుకు ఇప్పుడు టెండర్లు పిలవాల్సిన దుస్థితి ఏర్పడింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్