Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమనిషి పుండు ఫార్మాకు ముద్దు

మనిషి పుండు ఫార్మాకు ముద్దు

ఇది కరోనా వ్యాక్సిన్ పనితీరు మీద చర్చ కాదు. వ్యాక్సిన్ పేటెంట్ హక్కు, కేంద్ర ప్రభుత్వ నిస్సహాయత, ఫార్మా కంపెనీల నిర్నిరోధమయిన ఆధిపత్య ధోరణి, ఆపత్కాలంలో వ్యాపారమే పరమావధి అయిన పెద్దలు ఆదర్శాల క్రస్ట్ గేట్లు ఎత్తి జనానికి నీతిపారుదల చేస్తున్న దైన్యం మీద చర్చ.

మరీ లోతుగా వెళ్లక్కర్లేదు. ఆంధ్ర జ్యోతిలో పక్కపక్కనే మూడు వార్తలు వచ్చాయి.

  1. ఫార్ములా మా సొంతం
    కోవాక్సీన్ ఫార్ములా అక్షరాలా మా సొంతం. ఎవరో సహాయంచేస్తే తయారయినది కాదు. ఎవరితో పంచుకోము- అని భారత్ బయో టెక్ అధినేత్రి బల్ల గుద్ది చెప్పిన వార్త.
  2. వ్యాక్సిన్ తయారీలో ఐ సి ఎం ఆర్ భాగస్వామి
    భారత కేంద్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు సహాయం చేసింది. భారత వైద్య పరిశోధన మండలి- ఐ సి ఎం ఆర్ తో కలిసి కోవ్యాక్సిన్ ను తయారు చేశామని ఆ కంపెనీ అధినేత్రి గారాల కుమారుడు చెప్పిన వార్త.
    |
  3. కోవ్యాక్సిన్ కు వీసా ఇబ్బందులు
    ప్రపంచ ఆరోగ్య సంస్థ- డబుల్యు హెచ్ ఓ ఆమోదించిన వ్యాక్సిన్లలో భారత్ బయో టెక్ కోవ్యాక్సిన్ లేకపోవడంతో అంతర్జాతీయ ప్రయాణికులకు వీసా దొరకక ఇబ్బంది పడుతున్నారన్న వార్త.

నిజానికి ఈ వార్తలు విడి విడిగా చదివి వదిలేయాల్సినవి కావు. కలుపుకుని చదివి ఆనందించాల్సినవి కూడా కాదు. బాధ పడాల్సినవి. భయపడాల్సినవి. గుండెలు బాదుకోవాల్సినవి. కరోనా వైరస్- వ్యాక్సిన్ పరిధి దాటి ఆలోచించాల్సినవి. చాలా లోతుగా చర్చించాల్సినవి. సర్వతంత్ర, స్వతంత్ర, సర్వ సత్తాక, గణతంత్ర ప్రజాస్వామిక దేశం సార్వభౌమత్వానికి సంబంధించినవి.

ఈ మూడు వార్తల్లో సాధారణ అంశాలేమిటో- పరస్పర వైరుధ్యాలేమిటో అక్షరాలు కలిపి చదువుకునే అమాయకులకు కూడా అర్థమవుతాయి. 135 కోట్ల జనాభాతో మనది సువిశాల దేశం. ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం. ఎవరు ఎవరికి అధిపతులో? ఎవరు ఎవరిని ఆడిస్తున్నారో? ఇది- వల్లకాట్లో శవాల మీద పేలాలకు విలువ కట్టి పేటెంట్ల భస్మ సింహాసనాల మీద మరణ దూత తీక్షణమౌ  దృష్టులొలయ అవని పాలించు వ్యాపారంబు. ఇది- కరుణ లేని కరోనా గజ్జె కదిలించి ఆడే చావు పాటల్లో ప్రపంచ ఫార్మా పేటెంట్ల వేలం పాటలతో లెక్కపెట్టలేనన్ని సున్నాల సంపదను పోగేసుకుంటున్న అపరిమిత వ్యాపారంబు.

ఎద్దు పుండు కాకికి ముద్దు…… మనిషి పుండు ఫార్మాకు ముద్దు.

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్