Sunday, November 3, 2024
HomeTrending Newsముదురుతున్న నీట్ వివాదం

ముదురుతున్న నీట్ వివాదం

నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజ్‌ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీరు బాధ్యతారహితంగా ఉందని కాంగ్రెస్‌ విమర్శించింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని ఎంపీ గౌరవ్‌ గగోయ్‌ డిమాండ్‌ చేశారు. నీట్‌ ప్రశ్నాపత్నం లీకేజ్‌తో దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్ధులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.

శిక్షణ నిమిత్తం కోచింగ్‌ సెంటర్లలో సాధారణ కుటుంబాలు సైతం లక్షలు వెచ్చించాయని…  ప్రభుత్వ నిర్వాకంతో దిక్కుతోచని స్ధితిలో పడిపోయారన్నారు. నీట్‌ స్కామ్‌పై దృష్టిసారించాల్సిన ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార వేడుకలకు, విదేశాలకు వెళుతూ బిజీగా గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే జూన్‌ 4నే నీట్‌ ఫలితాలను ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని, వీటి ఫలితాలపై ఎవరూ చర్చించే అవకాశం లేకుండా ఉంటుందనే ప్రభుత్వం జూన్‌ 4న నీట్ రిజల్ట్స్‌ను ప్రకటించిందని దుయ్యబట్టారు.

మరోవైపు నీట్‌ యూజీ 2024 పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌ ఫలితాల్లో 1,563 మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్‌ మార్కులను తొలగిస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వారికి మళ్లీ పరీక్ష రాసే అవకావం కల్పిస్తామని తెలిపింది.

ఈ ఏడాది నీట్‌ పరీక్షలో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్‌ మార్కులు రాగా విద్యార్థి సంఘాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాయి. హర్యానాలోని ఒక పరీక్ష కేంద్రంలో 67 మంది విద్యార్థులు 1వ ర్యాంకు సాధించారని, ఇది అవకతవకలు జరిగిందనడానికి నిదర్శనమని పేర్కొన్నాయి. అవకతవకల ఆరోపణలపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ గతవారం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది. ఈ కమిటి గ్రేస్‌ మార్కులు పొందిన విద్యార్థులపై విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఈ కమిటీ నిర్ణయాలను కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.

‘పరీక్ష సమయంలో కోల్పోయిన సమయం వల్ల గ్రేస్‌ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల స్కోర్‌ కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించింది. వారికి రీ-టెస్ట్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తాం. జూన్‌ 23న పరీక్ష నిర్వహించి ఈ నెల 30వ తేదీలోగా వారి ఫలితాలను ప్రకటిస్తాం. ఆ తర్వాతే కౌన్సెలింగ్‌ ఉంటుంది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయకూడదని అనుకునే వారు.. గ్రేస్‌ మార్కులు లేకుండా ఒరిజినల్‌ మార్కులతో జులై 6 నుంచి ప్రారంభమయ్యే కౌన్సెలింగ్‌కు వెళ్లొచ్చు’ అని సుప్రీం కోర్టుకు కేంద్రం వెల్లడించింది.

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. వెబ్‌ కౌన్సెలింగ్‌పై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కౌన్సెలింగ్‌ యథావిథిగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ పిటిషన్లపై రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)కి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.

కేంద్రం నీట్ పరీక్ష వ్యవహారాన్ని తేలిక చేసే ప్రయత్నం చేస్తుండగా… విపక్ష పార్టీలు ఆందోళనలు ఉదృతం చేసే దిశగా సాగుతున్నాయి. లోక్ సభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్దం అవుతున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్