Saturday, September 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఏది తిట్టు? ఏది కాదు?

ఏది తిట్టు? ఏది కాదు?

Un-Parliamentary: ఒక దేశం సంక్షోభంతో అల్లకల్లోలమవుతోంది. తినడానికి తిండి లేదు. ఉండడానికి ఇల్లు లేదు. కరువు కాటకాలు. దుర్భిక్షం. తాగడానికి నీళ్లు కూడా లేవు. రోగాలు, రొప్పులు, నొప్పులు. అయినా ఆ రాజు పన్నుల వసూలు ఆపడు. ఆదర్శాల ఉపన్యాసాలు ఆపడు. సంక్షోభాన్ని సామంత రాజ్యాలు మోసి- సంతోషాన్ని తన రాజ్యానికి ఇవ్వాలని ఆయన అనుకుంటాడు. ఆయనకు ఒక బలహీనత ఉంది. అన్నీ తానే చేసినట్లు, అందరికీ అన్నీ తానే ఇచ్చినట్లు సాయంత్రమయ్యే సరికి కొలువులో కవులు పొగుడుతూ భజనపాటలు పాడాలి. ఏమీ ఇవ్వకున్నా ఎన్నో ఇచ్చినట్లు రాజును పొగుడుతూ పాడలేక పాడలేక చివరికి ఒక కవికి ఒళ్లు మండి ఇలా పాడాడు.

“ఇచ్చె ఇచ్చె రాజు ఏమిచ్చినాఁడన ఇంటిలోపల నుండ నిచ్చినాఁడు పొరుగూళ్ల వెంబడి పోయి ముష్టెత్తుక యింటికి మళ్లి రానిచ్చినాఁడు చలివణంకుకు ప్రక్క శయనంబు లేకుంటె చేతులు ముడుచుకో నిచ్చినాఁడు గాసాని కొకవేళ కలిగి యుండకపోతె నింటింట పస్తుండ నిచ్చినాఁడు. వీధులందున తిరుగబోనిచ్చినాఁడు భిక్షుకుండని బ్రతుక పోనిచ్చినాఁడు చేసికున్నంత భోంచేయ నిచ్చినాఁడు- ఇట్టి పనులెల్ల రక్షించు నీశ్వరుండు”

Unparliamentary Words

పద్యం అర్థం:-రాజు అదిచ్చాడు, ఇదిచ్చాడు, ఎన్నెన్నో ఇచ్చాడు. మన ఇంట్లో మనల్ను ఉండనిచ్చాడు. పక్క ఊళ్లకు వెళ్లి, అడుక్కుతిని, మళ్లీ మన ఊళ్లోకి రానిచ్చాడు. ఎముకలు కొరికే చలిలో పడుకోవడానికి పరుపు, కప్పుకోవడానికి దుప్పటి లేకపోతే- మన చేతులు దిండుగా పెట్టుకుని పడుకోనిచ్చాడు. తినడానికి ఏమీ లేకపోతే ప్రతి ఇంట్లో పస్తులుండనిచ్చాడు. వీధుల్లో బలాదూర్ గా తిరగనిచ్చాడు. రాజ్యంలో అందరూ భిక్షగాళ్లయి చిప్ప పట్టుకోనిచ్చాడు. ఎవరి శక్తికి తగినట్లు, వారింట్లో వారే భోంచేసుకోనిచ్చాడు. ఇన్నిరకాల లోకోపకార పనులతో మమ్ము సదా రక్షించే మా రాజు సాక్షాత్తు ఈశ్వరుడే!

ఈ పాట పాడగనే రాజు మురిసిపోయి…శెభాష్…శెభాష్…అని కవిని వేనోళ్ల ప్రశంసించాడని వేరుగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఒక్క అన్ పార్లమెంటరీ పదం లేదు. కానీ నిండు పేరోలగంలోనే, సర్వ ప్రతినిధుల సమక్షంలోనే, సకల భాషల పండితుల ఎదురుగానే రాజు నగ్న స్వరూపాన్ని కవి బయటపెట్టాడు. రాజుకు తప్ప రాజ్యంలో నిరక్షర కుక్షికి కూడా రాజు ఎంత లోభి అన్నది ఈ పొగడ్త వల్ల బాగా తెలిసి…ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ విషయానికి ప్రచారం కలుగుతూనే ఉంది.

ఇంట్లో మీ నాన్న ఉన్నారా?
ఇంట్లో మీ అమ్మ మొగుడు ఉన్నాడా?
రెండు ప్రశ్నల్లో నాన్న, అమ్మ మొగుడు సంబంధ వాచకం సాంకేతికంగా ఒకటే. కానీ నాన్న గౌరవం. అమ్మ మొగుడు అగౌరవం. మళ్లీ…విడి విడిగా అమ్మ, మొగుడు గొప్ప మాటలు.

మాటల కలయిక, వాడుతున్న సందర్భం, ధ్వనిని బట్టి భావార్థాలు మారిపోతుంటాయి.

“పొగడరా నీ తల్లి భూమి భారతిని…” అన్న రాయప్రోలు గేయకవితా పంక్తిని సరిగ్గా చదవకపోయినా, పాడకపోయినా…నీతల్లి…అని తిట్టులా ధ్వనించే ప్రమాదం ఉందని ప్రఖ్యాత భాషాశాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణ హెచ్చరించేవారు.

“కుంజర యూధంబు దోమకుత్తుకజొచ్చెన్!” అని ద్వారపాలకుడు సమస్య ఇస్తే తెనాలి రామలింగడు వాడికి అర్థమయ్యే వాడి భాషలోనే…

గంజాయి త్రాగి తురకల
సంజాతుల గూడి కల్లు చవి గొన్నావా
?………….ఎక్కడ
కుంజర యూధంబు దోమకుత్తుక జొచ్చెన్?”

అని మొహం పగిలేలా పూరించాడు.

అదే సమస్యను కృష్ణదేవరాయలు పూరించమని అడిగితే… “రంజన చెడి పాండవులరి భంజనులై విరటు గొల్వ పాల్పడి రకటా సంజయా! యేమని చెప్పుదు ? కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్”

అదే విజయనగర పార్లమెంటు. అదే రామలింగడు. అడిగినవాడిని బట్టి పార్లమెంటరీ, అన్ పార్లమెంటరీ భాషను ఎంచుకున్నాడు రామలింగడు.

ఇప్పుడు పార్లమెంటులో రామలింగడు ఉండి ఉంటే నోరు కట్టేసుకుని కూర్చోవాల్సి వచ్చేది. పార్లమెంటు సమావేశాల్లో ఫలానా ఫలానా పదాలు అన్ పార్లమెంటరీ…అంటే వాడకూడనివి అని అధికారికంగా పార్లమెంటు ఒక పద్దును పుస్తకంగా ప్రచురించింది. సభ్యులందరూ ముందు వాటిని బై హార్ట్ చేయడానికి వీలుగా పంపిణీ కూడా చేస్తారేమో!

నియంత
మోసం
అవినీతి
డ్రామా
కపటం
అసమర్థుడు
బాల బుద్ధి
జుమ్లా జీవి (తప్పుడు హామీలిచ్చేవాడు)
మొసలి కన్నీరు
అబద్దం
నౌటంకి…తదితర పదాలను అన్ పార్లమెంటరిగా పార్లమెంటు భావించి నిషేధించింది.

భారతదేశంలో భాషాశాస్త్రవేత్తలకు, భాషోత్పత్తి శాస్త్రవేత్తలకు కొదవ లేదు. ఎన్నెన్నో విషయాలకు పార్లమెంటరీ కమిటీలు, జాయింట్ పార్లమెంటరీ కమిటీలను వేస్తుంటారు. అలాగే ఈ పదాలను అన్ పార్లమెంటరిగా నిషేధించడానికి ముందు భాషా శాస్త్రవేత్తలతో పార్లమెంటు ఒక కమిటీని నియమించి, వారి అభిప్రాయం తీసుకుని ఉంటే పార్లమెంటరీ స్ఫూర్తి ప్రతిబింబించేది.

అయినా…మనలో మన మాట.
అవినీతి, మోసం, అబద్దం, అసమర్థ లాంటి మాటలు లేకుండా పార్లమెంటులు ఇతర చట్ట సభలు ఒక్క క్షణమయినా సమావేశాలు జరుపుకోగలవా? జరుపుకుంటే వాటిని చట్టసభలుగా మనం గుర్తిస్తామా?

మొసలికి కన్నీళ్లు ఉండవా?
మొసలి కన్నీళ్లనే నిషేధిస్తారా?
ఇది-
జీవశాస్త్ర సమస్యా?
భాషా భావార్థాల దురన్వయ సమస్యా?
పార్లమెంటు చర్చా సమస్యా?

హతవిధీ!
ఇది-
ఇన్ ఫ్రంట్ అన్ పార్లమెంటరీ క్రోకడైల్ ఫెస్టివల్!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

నాలుగు సింహాలాట

RELATED ARTICLES

Most Popular

న్యూస్