మొన్న ఒకరోజు సాయంత్రం సోమశిల నుండి కొల్లాపూర్ కు వెళుతుండగా సూర్యుడు పడమటి కొండల్లో దిగబోతూ సంజ కెంజాయరంగులు చల్లుతున్నాడు. పక్షులు గూళ్లకు చేరుతున్నాయి. దారంతా మునగతోటలు. తోటల్లో కూలీలు ములక్కాడలు కోసి కట్టలు కడుతున్నారు. హైదరాబాద్ మార్కెట్లకు పంపడానికి ట్రాలీ జీపుల్లోకి ఎక్కిస్తున్నారు. ఆ దృశ్యంలో ఏదో సౌందర్యం కనిపించి కారు ఆపి…మునగ తోటలోకి వెళ్ళాము. ములక్కాడలు అమ్ముతారా అని అడిగాం. ఒక కాడ అయిదు రూపాయలన్నారు. హైదరాబాద్ లో ఒక కాడ ముప్పయ్ నుండి యాభై రూపాయాలక్కూడా కొన్నరోజులు గుర్తొచ్చి…మా ఆవిడ ఆనందనర్తనం చేసింది. తోటంతా కొనేంత దూకుడులో ఉంది. కారులో వెనుక ఎన్ని పడతాయో అన్ని కాడలు కొన్నాం. మునగాకు ఆరోగ్యానికి మంచిది…అమ్ముతారా? అంటే పూత ఉన్న రెమ్మలను వదిలేసి…ఎంత కావాలంటే అంత కోసుకోండి… అని తోట యజమాని ఉదారంగా ఉచితంగానే అనుమతించాడు. నేను, మా అబ్బాయి, మా డ్రయివరు ఓపిక ఉన్నంత వరకు మునగాకు కోసుకున్నాం.
ఇక అక్కడినుండి అంతా మునగపురాణమే. మునగ స్మృతులే. సోమశిలలో రాత్రి గడిచింది. పొద్దున్నే టిఫిన్ చేసి హైదరాబాద్ బయలుదేరాము. మధ్యాహ్నం ఒంటి గంట వేళ శంషాబాద్ నోవాటెల్ హోటల్లో భోజనానికి ఆగుదామనుకున్నాం. ఇంత మంచి ములక్కాడలు మనదగ్గర ఉంటే…మధ్యలో ముష్టి అధ్వాన్నం తినడం ఎందుకు? అన్న మా ఆవిడ ప్రశ్నలో ఔచిత్యం ఉంది కాబట్టి…నేరుగా ఇంటికొచ్చాము. తాజాగా, చిలకపచ్చ రంగులో, ఆరోగ్యంగా ఉన్న ములక్కాడ, టమోటాతో కూర చేసింది మా ఆవిడ. అంతకు ముందు ఎప్పుడూ ములక్కాడల కూరలో లేని రుచి ఏదో నాలుకకు తగిలింది.
మరుసటిరోజు కూడా ములక్కాడ కూరే. చారులోకి ఎలాగూ ములక్కాడలు తప్పవు. ములక్కాడల ఆవకాయ కూడా తగు పరిమాణంలో పెట్టక తప్పలేదు. మునగాకు ప్రస్తుతం ఆరుతోంది. అది ఆరితే అన్ని కూరలమీద చల్లడానికి ఎన్నెన్నో పాకశాస్త్ర ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.
ములగ కాఫీ, టీ, పాయసానికి గల సాధ్యాసాధ్యాలగురించి కూడా మా అవిడ కొంత ఆలోచన చేస్తున్నట్లు నా అనుమానం.
దసరా రోజుల్లో శాకంబరిగా అమ్మవారికి ప్రత్యేక అలంకారం ఉంటుంది. ప్రస్తుతం మా వంటింట్లో శాకంబరీ దేవి ములక్కాడల, మునగాకు అలంకారంతో శోభిస్తోంది.
మా ఆవిడది విజయవాడ. మా కృష్ణా నీటిలో పండిన కూరలే కూరలు- ఆ రుచే రుచి- అని కొల్లాపూర్ ములక్కాడల్లో కృష్ణ నీటి ప్రాశస్త్యాన్ని, మాధుర్యాన్ని శాస్త్రీయంగా, భౌగోళికంగా ఆవిష్కరించింది. దారిమధ్యలో, ప్రత్యేకించి తినేప్పుడు భార్య చెప్పిందే కరెక్టు కావాలి అన్నది లోకానుభవ సూత్రం. కాబట్టి మా పెన్న పక్కన హిందూపురం ములక్కాడలు కూడా బాగానే ఉంటాయి అన్నది ఇక్కడ అసందర్భమవుతుంది. సోమశిల ట్రిప్పుకు పన్నెండువేలు అయితే అయ్యింది కానీ…మేలిమి ములక్కాడల రుచి తెలిసింది.
పాపం ఎండలో, వానలో, కొండా కోనల్లో ఇంత కష్టపడి పండిస్తే…వీళ్ళకేమో అయిదు రూపాయలు…సూపర్ బజార్లో అమ్మేవాడికేమో యాభై రూపాయలా? కనీసం వీళ్లకు ఆ అమ్మే ధరలో సగమైనా రావాలి కదా? అని ములక్కాడలను చూస్తున్న ప్రతిసారీ మా ఆవిడ నైతికంగా బాధపడుతోంది. వాటి నాణ్యతను వర్ణిస్తూ ఇంటికొచ్చినవారికి తలా రెండు ములక్కాడలు చేతిలో పెట్టి…పండగ చేసుకోండని పిలుపునిస్తోంది.
తినగ తినగ వేము తియ్యగనుండు- అని తింటూ తింటూ ఉంటే చేదు వేపే తియ్యగా అయ్యేప్పుడు… తినగా తినగా మునగ ఇంకెంత తియ్యగా ఉంటుందో అన్న సామెతను కూడా పుట్టించాల్సిన అవసరముంది.
ఇదొక మాటల్లో చెప్పలేని “మునగానాం…తేలానాం” అనుభూతి! చూడబోతే వచ్చే “విశ్వావసు” వత్సరం మా ఇంట “మునగావసు”గా పేరు మార్చుకునేలా ఉంది! మాకు ముందుంది మునగ పండగ!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు