Bumper Offer: “విత్తొకటి పెడితే… చెట్టు మరేదో మొలుస్తుందా?” అని అన్నమయ్య పాపం అమాయకంగా వేంకటేశ్వరస్వామిని అడిగాడు. ఇప్పుడు విత్తు పెట్టకుండానే చెట్టు పుట్టించే రోజులను చూస్తే…అన్నమయ్య ఏమని ఉండేవాడో!
గిచ్చి…ఓదార్చినట్లు కార్పొరేట్ కంపెనీల లీలలు భలే విచిత్రంగా ఉంటాయి. రోజుకు మూడు షిఫ్టుల్లో నయా వెట్టి చాకిరికి తలుపులు బార్లా తెరిచిందీ వారే. రాత్రి డ్యూటీలతో వైట్ కాలర్ ఉద్యోగులకు రాత్రి నిద్రను దూరం చేసిందీ వారే. భార్య భర్తతో; భర్త భార్యతో రాత్రి కలవకుండా చేసిందీ వారే. కలిసినా…ఒకరి ఒడిలో ఒకరు శృంగార రస భావాలతో తేలిపోకుండా…ఎవరి ఒడిలో వారికి విడిగా ల్యాప్ టాప్ ను ఇచ్చిందీ వారే. ప్రకృతి సహజంగా ప్రసాదించిన సంతానోత్పత్తి ప్రక్రియకు అడ్డు గోడలు కట్టిందీ వారే.
చేసిందంతా చేసి…ఇప్పుడు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు పిల్లలు ఎందుకు పుట్టడం లేదని…బుర్ర గోక్కుంటున్నాయి. భారతదేశంలో ఏటా దాదాపు రెండు కోట్ల మందికి సంతాన సమస్యలుంటే…అందులో ఎక్కువ భాగం సాఫ్ట్ వేర్ లాంటి వైట్ కాలర్ ఉద్యోగుల శాతమే ఎక్కువగా ఉందట.
ఎందుకిలా తమ ఉద్యోగుల కడుపు కాయడం లేదు? లేదా ఉద్యోగి భార్య కడుపు పండడం లేదు? అన్ని పెద్ద కార్పొరేట్ కంపెనీలన్నీ ఒక బోర్డు మీటింగులో కడుపు చించుకుంటే…అసలు విషయం కాళ్ల మీద పడింది. అదేదో సినిమాలో హీరోయిన్ ఏ ప్రమాదాన్నయినా డబ్బు పడేసి హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. అలా కార్పొరేట్ కంపెనీలు కూడా తమ ఉద్యోగుల సంతాన స్వప్నాలను నిజం చేసుకోవడానికి ఉదారంగా డబ్బు, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఇవ్వడం మొదలు పెట్టాయి.
1. ఎవరయినా ఉద్యోగి సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లి కృత్రిమ గర్భధారణ పద్ధతులకు ఖర్చు పెడితే…ఆ ఖర్చును భరించడానికి వీలుగా కంపెనీ కొన్ని ఆరోగ్య పాలసీలను కడుతుంది.
2. అంటే ఆరోగ్య బీమా లాంటిదేదో కృత్రిమ గర్భ ధారణక్కూడా ఒక పాలసీ వచ్చిందన్నమాట!
3. ఆ పాలసీ ప్రీమియం మొత్తాన్ని కంపెనీ కడుతుంది.
4. గుడ్డిలో మెల్లలా…పండని కడుపును తడుముకుంటూ ఉద్యోగులు ఈ కృత్రిమ గర్భధారణ ఖర్చును భరించే పాలసీ ప్రతిని ఒళ్లో పెట్టుకుని తృప్తి పడవచ్చు.
5. తమ ఉద్యోగుల సంతాన స్వప్నాలను కూడా తాము పట్టించుకున్నట్లు ఈ కంపెనీలు గొప్పగా చెప్పుకుంటున్నాయి.
6. ఈ కొత్త పాలసీతో టాలెంట్ ఉన్న ఉద్యోగులను మరింతగా వలలో వేసుకోవచ్చట.
“రోగం ఒకటయితే మందు మరొకదానికి వేయడం” అని తెలుగులో ఒక సామెత. సింపుల్ గా కొత్తగా పెళ్లయిన భార్యా భర్తలను కలుపుతూ పని వేళలను మారిస్తే అయిపోయే దానికి…సరిగ్గా పిల్లలు పుట్టే వయసులో ముద్దు ముచ్చట, అచ్చిక బుచ్చికాల వేళ వారిని వేరు చేసి…జుట్టు నెరిసి…పళ్లు కదిలి, కళ్లకు అద్దాలు వచ్చి…మనుమళ్లతో ఆడుకుంటూ…కృష్ణా రామా అనుకోవాల్సిన వయసులో-
“పిల్లలను కనడమేనా మీ చింత?
అయితే మా పాలసీ ఉందిగా మీ చెంత!”
అని సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిప్పుతున్నారు.
అంటే అన్నారంటారు కానీ…
స్థిరపడేవరకు పెళ్లి చేసుకోకూడదు; ఇల్లు కోనేవరకు పిల్లలను కనకూడదు; ప్రమోషన్ వచ్చేవరకు పిల్లా లేదు…పీచూ లేదు…లాంటి ఆదర్శాలతో పుట్టాల్సిన వయసులో పిల్లలు పుట్టకుండా ఉన్నారు. అన్నీ సమకూరి పిల్లలు కావాలనుకున్నప్పుడు…వయసు ముదిరి పిల్లలు పుట్టకుండా ఉన్నారు. అందుకే అన్నారు-
ఏ వయసుకా ముచ్చట అని.
రేప్పొద్దున కార్పొరేట్ కంపెనీలు ఇలా ప్రకటించుకోవచ్చు.
1. మా ఆఫీసులో క్యాంటిన్ తో పాటు సంతాన సాఫల్య కేంద్రం కూడా ఉండును.
2. మీ కడుపు పండకపోతే…దిగులు పడకండి. మేము కట్టే ప్రీమియంతో పాలసీ ద్వారా కృత్రిమ గర్భ ధారణకు ఎంతయినా ఖర్చు పెట్టుకోవచ్చును.
ప్రకృతికి మించిన పాఠం లేదు. ప్రకృతికి ఉన్నంత ఓపిక కూడా ఇక దీనికీ లేదు. మనం ప్రకృతి మాట వినం. మాట వినని ప్రతిసారీ ఓపిక నశించిన ప్రకృతి మనకు తగిన గుణపాఠం చెబుతూనే ఉంటుంది. మనం ఆఫ్టర్ ఆల్ ప్రకృతి కన్న పిల్లలం అన్న విషయం మరచి…వికృతి ఒడిలో పుట్టి…పెరిగే పిల్లలం అని అనుకుంటున్నాం. చివరకు వికృతి సాఫల్యమే దిక్కనుకుంటున్నాం.
కార్పొరేట్ ప్రపంచంలో బీమా పాలసీలకు ప్రీమియంగా, ప్రియంగా పిల్లలు పుట్టే రోజులొచ్చాయి.
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]