Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనేరం నాది కాదు!

నేరం నాది కాదు!

Covid-19 Crisis and Humanity :

జీవితమంటేనే ఓ డెస్టినీ. మనమనకుంటాం బానే ఉన్నామని. కానీ రేపటికి రూపులేదని మాత్రం అంతగా నమ్మం. నమ్మాలనిపించదు కూడా. ఇవాళ బానే ఉన్నాం కదా అని… రేపటి గురించి ముందుచూపు అవసరం లేకుండానే.. ఎన్నో మధ్య తరగతి బతుకులు ఈ ప్రపంచంలో ఇంకా అలా అలా బతుకీడుస్తూనే ఉన్నాయి.

కానీ మనం రూపు లేదనుకునే రేపనేది ఓ భయంకరమైన నిరాశ, నిస్పృహగా మారితే…? అదిగో అలాంటి కథలే ఈ కరోనా కాలాన వినాల్సి వస్తుంటే.. అలాంటివారి పట్ల కొందరు అధికారుల ఆలోచనా తీరు వారి సంస్కారాన్ని పట్టిచూపే అంతకు హృద్యమైన కథలూ ఇంకోవైపు తారసపడుతున్నాయి. ఓ హృదయవిదారక కథనానికి స్పందించి ఓ పోలీస్ అధికారి కల్పించిన ఊరటే ఈ మన ముచ్చట.

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ అనుకుంటూ వీధుల్లో తిరుగుతూ సినీపాటలు పాడే యువకుడి ఆకలికేకలు కావవి. ఓ బాధ్యతగల్గిన ఓ మధ్యతరగతి ఉద్యోగి ఇంటిల్లిపాది… కరోనా రక్కసి దెబ్బకు అతలాకుతలమైపోయిన ఆర్తనాదాలు.

ఉద్యోగిని నిరుద్యోగిని చేసి… నిరుద్యోగమనే గత్యంతరంలేని స్థితి ఆత్మాభిమానాన్ని సైతం కాదనుకుని దొంగను చేసి.. ఏకంగా జైలు ఊచలు లెక్కించే ఖైదీని చేసిన.. కోవిడ్ పాశవిక కథ ఇది.

ఇప్పటివరకూ భార్యకు భర్తను, భర్తకు భార్యను, సోదరికి సోదరుణ్ని, అన్నకు తమ్ముణ్ని, తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని, పసివాళ్లకు తల్లిదండ్రుల్ని దూరం చేస్తూ శోకసంద్రంతో ఈ భూభాగాన్ని కకావికలు చేస్తున్న కరోనా కారణంగా ఇప్పుడు చిమ్మచీకట్లు కమ్ముకున్న ఓ మధ్య తరగతి కుటుంబగాధ వెలుగులోకొచ్చింది.

సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ఒడిశా నుంచి ఓ వ్యక్తి తన కుటుంబంతో సహా పొట్టచేతపట్టుకుని మన భాగ్యనగరం బాట పట్టాడు. కరోనా మహమ్మారి సోకేవరకూ… రేపటి గురించి ఆలోచించి రంది పడాల్సినంత అవసరం లేకుండానే ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగంలో చేరి తన కుటుంబాన్ని వచ్చిందాంట్లో పోషించుకున్నాడు.

తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు పిల్లలు.. తనతో కలిసి మొత్తంగా ఏడుగురి కుటుంబం ఉన్నదాంట్లో, సంపాదించుకున్నదాంట్లో పొట్టపోసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ కాలం గడిచింది. అప్పటివరకూ భాగ్యనగరంగానే కనిపించిన ఆ కుటుంబానికి.. నగరంలో అభాగ్యమంటే ఎలా ఉంటుందో మెల్లిమెల్లిగా అర్థమవుతూ వచ్చింది.

కనికరం లేని పాపిష్ఠి కరోనా.. ఉన్నపళంగా ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. సదరు వ్యక్తి ఉద్యోగం ఊడింది. ఇంకెక్కడా ఉద్యోగం దొరకలేదు. మరోవైపు ఫార్మారంగంలో మాత్రమే అనుభవముండటంతో ఇంకే ఉద్యోగమూ చేయలేని నిస్సహాయస్థితి.

అంతో ఇంతో దాచుకున్నదాంతో ఎలాగోలా పొట్టపోసుకుంది కుటుంబం. కానీ కాలం గడుస్తున్నకొద్దీ… పరిస్థితులు మారాయి. చేతుల్లో చిల్లిగవ్వ లేని పరిస్థితి. నగరంలో అప్పు పుట్టలేదు. ఆకలికేకలు మొదలయ్యాయి. మొదట భార్యా, భర్తలిద్దరూ ఒకే పూట తింటూ ఇంకోపూట పస్తులుంటూ ముగ్గురు పిల్లలకు, తల్లిదండ్రులకు రెండు పూటలా పెట్టారు.

Covid-19 Crisis and Humanity :

కానీ ఇంకొద్దిరోజులకు ఆ పరిస్థితీ దిగజారింది. అందరూ ఒకే పూట తినాల్సిన దుస్థితి వచ్చింది. అలా మెల్లిమెల్లిగా పరిస్థితుల్లో మార్పులు.. చిన్నపిల్లల ఆకలికేకలు.. కళ్లముందు కదలాడుతున్న దుర్దినాలు… ఎవరిని పడితే వారిని దైన్యంగా అడుక్కోలేని ఆత్మాభిమానం… ఇలా అవన్నీ సదరు వ్యక్తిని ఏకంగా ఓ దొంగను చేశాయి.

హైదరాబాద్ శివారు కాలనీలో ఉండే తను ఓరోజు హెల్మెట్ పెట్టుకుని బయల్దేరాడు. పక్కకాలనీలో అలా వెళ్తూ వెళ్తూ ఓ మహిళ మెడలోంచి గొలుసు లాగేసుకుంటూ వెళ్లాడు. అలా చైన్ స్నాచింగ్ కేసు నమోదైందో, లేదో… ఇవాళ ఉన్న సీసీ కెమెరాల సాంకేతికత ఆధారంగా పోలీసులు కేవలం 24 గంటల్లోపే అతణ్ని పట్టుకున్నారు. ఎందుకంటే తను ప్రొఫెషనల్ దొంగ కాదుగా..? చైన్ స్నాచింగ్ కేసు నమోదైంది.

ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చిందన్న విచారణలో… సదరు వ్యక్తి దుర్భరమైన కుటుంబ బతుకుచిత్రం బట్టబయలైంది. అతణ్ని పట్టుకున్న పోలీస్ అధికారినే ఆ కథ కదిలించింది. కానీ అప్పటికే కేసు నమోదైంది. రిమాండ్ చేయాల్సిందే. సో తానేం చేయలేడు. కానీ తనకున్న హోదాతో సాయమందించాడు… తన పరపతితో బెయిల్ ఇప్పించాడు. ఇంకోసారి బతకడం కోసం ఇలాంటి నేరాలు చేయొద్దని ఓ పోలీసుగా కౌన్సిలింగ్ ఇచ్చాడు.

నాల్గు నెలలకు ఆ కుటుంబం మొత్తానికి సరిపడా రేషన్ ఇప్పించాడు… అంతేనా…? ఫార్మా రంగంలో మాత్రమే పనిచేయగల్గిన ఆ వ్యక్తికి.. త్వరలోనే ఎలాగోలా ఉద్యోగం ఇప్పించే బాధ్యతనూ తన భుజాన వేసుకుని ఆ కుటుంబానికి ఆ సదరు పోలీస్ అధికారి ఓ భరోసా అయ్యాడు.

ఇక్కడ కరోనా … ఓ ఉద్యోగిని నిరుద్యోగిని చేసి.. ఓ మధ్య తరగతి కుటుంబాన్ని ఎంత ఛిన్నాభిన్నం చేసి.. ఏకంగా దొంగావతారం వేయించి ఖైదీని చేసి ఎలా ఆడుకుందన్న హృదయవిదారక కథతో పాటే… సమాజంలో సాటి మనుషుల పట్ల ఎలా స్పందించాలన్నదానికి ఓ నిలువెత్తు ఉదాహరణను కూడా ఇదే కరోనా పట్టిచూపించింది. అయితే అన్నిసార్లు సదరు వ్యక్తికి ఇప్పుడందిన పోలీస్ అధికారి తరహా సాయమే అందకపోవచ్చుగాక! కానీ ఆపదలో ఉన్నవారి పట్ల నాకెందుకులే అని అనుకోకుండా.. ఆర్తిని ప్రదర్శించే తత్వానికి… ఆ ఖాకీ కథ ఓ స్ఫూర్తి.

-రమణ కొంటికర్ల

Also Read : ప్రపంచాన్ని మార్చేసిన కరోనా : మోడీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్