Crimes – Casual: కులాంతర వివాహం చేసుకున్నందుకు నడిరోడ్డు పైన నరికిపారేసారో యువకుడిని.
మరో సంఘటనలో భార్య కళ్ళముందే కత్తులతో పొడిచి చంపారు.
ప్రేమించి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని బయటికి వచ్చి సహజీవనం చేస్తుంటే అనుమానంతో ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడో ప్రేమికుడు.
ప్రేమించిన అమ్మాయికోసం స్నేహితుడిని చంపి అతని గుండె, శరీర భాగాలు వేరుచేసి విసిరేశాడో ప్రబుద్ధుడు.
మరో అబ్బాయి వయసు పన్నెండేళ్ళు. ఇంకో పెద్దాయనతో పరిచయం. ఎక్కడా? కల్లు పాక దగ్గర. అక్కడ ఇద్దరూ కలసి మద్యం తాగారు. తర్వాత గొడవపడ్డారు. ఆ బాలుడు తనకంటే పెద్దవాడిని చంపేసి, అతని జేబులో డబ్బులు తీసుకుని కొత్త బట్టలు కొనుక్కుని దర్జాగా ఇంటికెళ్లిపోయాడు.
ఇదేదో క్రైమ్ న్యూస్ బులెటిన్ కాదు. ఇటీవల పత్రికల్లో వచ్చిన కొన్ని వార్తలు. మానవత్వానికి మాయని మచ్చలైన సంఘటనలు. నిందితులందరూ పట్టుబడ్డారు కానీ వారిలో ఏ కోశానా పశ్చాత్తాపం, దిగులు లేవు. కరడు కట్టిన తీవ్రవాదుల కన్నా ఘోరంగా నేరాలకు పాల్పడుతున్నారు.
వీటన్నిటికీ ఒకటే కారణం. ఇంటర్నెట్. అవును ఇంటర్నెట్ రాకతో ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. నిజానికి నేరాలు అప్పటినుంచే పెరిగాయి. ఒక నేరం ఎలా చెయ్యాలి అనే దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అనే వరకు వివరంగా చూపుతూ నేరాలకు ప్రేరణ ఇస్తోంది అంతర్జాలం. ఈ వినియోగానికి అడ్డుకట్ట లేకపోవడంతో చిన్న పిల్లలనుంచి పెద్దవాళ్లవరకు అన్నిటికీ నెట్ పైనే ఆధారపడుతున్నారు. అయితే నేరాలకే ఎక్కువగా ఉపయోగించడం ఆందోళనకరం.
ఇక నేరాలకు స్ఫూర్తి నిచ్చే సాధనాల్లో సినిమాల పాత్ర విడదీయలేనిది. ఈ మధ్య జరిగిన నేరాలన్నిట్లో నిందితులు సినిమాలు చూసి ప్లాన్ చేశామని చెపుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఓటీ టీ లలో వచ్చే అసభ్య, హింసాత్మక చిత్రాలకు యువత ఎక్కువగా ప్రభావితమవుతున్నారన్నది నిజం. ఒకప్పుడు సినిమాలు అంటే కుటుంబ సంబంధాలు, కలసి మెలసి ఉండటం చూపించేవారు. మెల్లగా నాయక, ప్రతినాయక ప్రాధాన్యంతో సినిమాలు రూటు మార్చుకున్నాయి. ఆ తర్వాత మారిన సినిమా వేషభాషల గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. తల్లి, తండ్రి, గురువు… వీళ్ళే ఇప్పటి తరానికి కామెడీ సరుకు. గర్ల్ ఫ్రెండ్ ఉండటం ఫ్యాషన్. సహజీవనం సహజం.
అసలు దేశంలో సెన్సార్ బోర్డు ఉందో లేదో తెలీదు. మరి ఇవన్నీ పిల్లల బుర్రలోకి దూరి సినిమా చూపిస్తుంటే ఎవరిని నిందించాలి? చూస్తుంటే మానవత్వం సంగతి పక్కనపెడితే, మనుషులుగా అన్నా మిగులుతామా? అన్నిటికీ ఓకే అనుకునే వీళ్ళే పరువు హత్యలకు సై అంటారంటే ఏ బుద్ధుడు దిగి రావాలి వీళ్ల మెదళ్ళు శుద్ధి చెయ్యడానికి? సర్వమానవ సమానత్వమే తమ మతమని చెప్పే ప్రభుత్వాలు ఇటువంటి పరువు హత్యలకు మొదట్లోనే కఠినంగా శిక్షిస్తే ఇన్ని జరిగేవి కావుగా! అవునూ, ఇంతకీ పోలీసులు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు?
-కె. శోభ
Also Read :