Friday, September 20, 2024
HomeTrending NewsBRS: రోటీ భేటీ బంధం - కెసిఆర్

BRS: రోటీ భేటీ బంధం – కెసిఆర్

మహారాష్ట్రతో తెలంగాణ ది ‘రోటీ బేటీ’ బంధమని, వెయ్యి కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్న రెండు రాష్ట్రాల ప్రజల నడుమ మొదటి నుంచీ సామాజిక బాంధవ్యం, సాంస్కృతిక సారూప్యత వున్నదని, ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అభివృద్ధికి తాము కట్టుబడి వున్నామని బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. అట్లాంటి అనుబంధమున్న మహారాష్ట్ర నుంచే బిఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తుండడం తనకెంతో ఆనందంగా వున్నదన్నారు.
శనివారం సోలాపూర్, నాగపూర్ తదితర ప్రాంతాలనుంచి పలువురు నేతలు ప్రముఖులు తెలంగాణ భవన్ లో అధినేత సిఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి అధినేత సిఎం కేసీఆర్ ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ…‘‘ భారత దేశంలో ప్రస్థుత రాజకీయాలు పదవుల వెంట పరుగులు తీస్తున్నాయి. తమ పార్టీలనే చీలికలు పేలికలు చేసుకుంటూ పదవుల కోసం ఈ పార్టీల నుంచి ఆ పార్టీలకు ఆ పార్టీలనుంచి ఈ పార్టీలకు జంపులు చేస్తున్నరు. మహారాష్ట్రలో ఈ దిశగా జరుగుతున్న సంఘటనలను దేశ ప్రజలు గమనిస్తున్నరు..’’ అని సిఎం అన్నారు.
ఈ దేశం యువతీయువకులదని,. ఎంతో భవిష్యత్తు వున్న యువత దేశంలో గుణాత్మక మార్పు దిశగా ఆలోచన చేయాల్సి వుంది. పరివర్తన చెందిన భారత దేశంతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపిన సిఎం కేసీఆర్, దేశ ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత యువత మీదనే ప్రధానంగా వున్నదని స్పష్టం చేశారు. నాటి భగత్ సింగ్ అల్లూరి వంటి వారిని ఆదర్శంగా తీసుకుంటూ ప్రజలను చైతన్యం చేసే దిశగా భాగస్వాములు కావాల్సి వుంది’ అని పిలుపునిచ్చారు.
ఇతర దేశాలు ఎట్లా అభివృద్ది చెందుతున్నాయి మనం ఎందుకు ఇంకా వెనకబడే వున్నమనే విషయాన్ని,. దేశ పరిస్థితి గురించి ఆలోచించాల్సిన అవసరం ప్రతి వొక్కరిమీదున్నదని సిఎం అన్నారు.
ఇటీవలే సోలాపూర్ పర్యటించిన తాను తిరిగి త్వరలో రానున్నట్టు అధినేత తెలిపారు. ‘‘ నీను మల్ల సోలాపూర్ వస్తా…వారం రోజుల ముందు మంత్రి హరీశ్ రావును అక్కడికి పంపుత. పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో ర్యాలీ తీద్దాం. కనీసం 50 ఎకరాల స్థలంలో భారీ బహిరంగం సభను నిర్వహించుకుందాం. తెలంగాణలో జరిగిన అన్ని తీర్ల అభివృద్ధిని సోలాపూర్ సహా మహారాష్ట్రలో చేసి చూయించే బాధ్యత నాది. ఇక్కడకు వచ్చిన మీరంతా నా బిడ్డల వంటి వారు. మీ భవిష్యత్తు కు భరోసా బిఆర్ఎస్ పార్టీది, నాది. మీరు బిఆర్ఎస్ ను గెలిపించుకోండి, మీ జీవితాలను తీర్చి దిద్దే బాధ్యత స్వయంగా నీను తీసుకుంట.’’ అని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్