మహిళాలోకాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. మరికొద్ది నెలలో రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇళ్లలో వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించింది. ఉజ్వల పథకం కింద ఒక్కొక్క సిలిండర్ పై అదనంగా మరో రూ.200 సబ్సిడీ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.7,500 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్ 1100 రూపాయల పైనే ఉంది.
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై 200 రూపాయలు తగ్గించటంతో ఇప్పుడు 900లకే గ్యాస్ సిలిండర్ లభించనుంది. అదే ఉజ్వల వినియగదారులకు ఏకంగా 400 రూపాయల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ పొందే వారికి మరో 200 రూపాయలు తగ్గింపు ఇచ్చింది. అంటే ఇక నుంచి వీరికి కేవలం 700 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభించనుంది.