ఈమధ్య రాజస్థాన్ ఉదయ్ పూర్ కు విహారయాత్రగా వెళ్లొచ్చాము. ఎప్పుడో ముప్పయ్యేళ్ల కిందట ఏ పి పి ఎస్ సి గ్రూప్స్ పోటీ పరీక్షలకు చదువుకున్న అరకొర చరిత్రలో విన్నది, తరతరాలుగా కథలుకథలుగా చెప్పుకుంటున్న మహారణా ప్రతాప్ గుర్రం ‘చేతక్’ లాంటివేవో ఊహించుకుంటూ విమానమెక్కాము. పాతరాతియుగం నాటి ఎండు అటుకుల పోహా డబ్బాలో వేడి నీళ్లు పోసి…అయిదు నిముషాల తరువాత తినమని గగనసఖి నవ్వుతూ చెప్పి ఆకాశవీధిలో టిఫిన్ అమ్ముకుంటోంది. ఉదయ్ పూర్లో దిగేసరికి ఉదయం పది దాటుతుంది కాబట్టి పాతన్నమే కొత్త డబ్బాలో కొనుక్కుని వేడి నీటిని సంప్రోక్షించుకుని…గాల్లోనే టిఫిన్ తిన్నాము.
అధ్వ అంటే దారి; అన్నం అంటే ఆహారం కలిపి “అధ్వాన్నం” అన్న మాటకు భాషాశాస్త్ర పదవ్యుత్పత్తి అర్థం ఉంది కానీ…ఆకాశమార్గాన తినే “ఆకాశాధ్వాన్నం” అన్న మాట వాడుకలో లేకపోవడం మీద బాధపడేలోపు ఉదయ్ పూర్లో దిగుతున్నాం అని అంగ్రేజీ ఔర్ హిందీమే మైక్రోఫోన్ చిలకపలుకులు వినిపించాయి. అయిదు నక్షత్రాల హోటళ్లలో తింటే పగలే చుక్కలు కనిపిస్తాయి కాబట్టి…పెట్టెలు అక్కడ పడేసి రెండు గంటలు ఊళ్లో తిరిగి...ఏదైనా మంచి వెజ్ హోటల్ కు తీసుకెళ్లమని డ్రయివర్ కు చెప్పాము. పంచవటి ఏరియాలో ట్రెడిషనల్ ఖానాకు వెళదాం…రాజస్థానీ రుచులు బాగుంటాయని నోరూరించాడు డ్రయివర్. సరే అన్నాము.
రాజస్థానీ ముదురు రంగులతో ట్రెడిషనల్ ఖానా కళకళలాడుతోంది. అన్నం తినడానికి ముందు అక్రాస్ ది టేబుల్ కొంత చర్చించాల్సి వచ్చింది. మేము స్థానికులం కాదని గ్రహించిన సిబ్బందిలో బాధ్యతగల వ్యక్తి రాజస్థానీ వెజ్ మీల్స్ గురించి క్లుప్తంగానే క్లాసు తీసుకున్నాడు. సరే తెమ్మన్నాము. తీరా తెచ్చాక…దేన్ని దేంట్లో కలుపుకుని ఎలా తినాలో తెలియని మా అయోమయాన్ని గ్రహించినవాడైన సర్వర్ టేబుల్ పక్కనే నిల్చుని ఏ ఐటెం ఏమిటో, దేన్ని పిసికి తినాలో, దేన్ని కొరికి తినాలో, దేన్ని చప్పరించి మింగాలో ముందుగానే వివరించాడు.
దాల్ భాటి ఉండలు (గోధుమ పిండి, పెసలు, సెనగలు నానబెట్టి…రుబ్బి…ఉప్పు కారం ఇతర మసాలాలు కలిపి బోండాల్లా వేయించినవి. కొంచెం క్రిస్పీగా, కొంచెం మెత్తగా ఉంటాయి) పిసకమన్నాడు. దాని మీద మూడు స్పూన్ల నెయ్యి పోశాడు. దాని మీద పల్చటి పప్పు పోసి కలపమన్నాడు. కలిపాము. ఇప్పుడు తినండి అన్నాడు. తిన్నాము. అద్భుతః. ఆపై సంకటిలాంటిదేదో వేశాడు. దాంట్లోకి కడి(మజ్జిగపులుసు) పోసి తినమన్నాడు. తిన్నాము. అద్భుతః. పూరీలా ఉండే రాజస్థానీ రోటీ ప్రత్యేకం అంటూ వడ్డించాడు. దాంట్లోకి ఏ కూర అద్దుకోవాలో చెప్పాడు. తిన్నాము. అద్భుతః. ఆహారంమీద ఈ యుద్ధం ఎంతదాకా సాగుతుందో క్లారిటీ ఉంటే బెటరని...మొత్తం ఎన్ని ఐటమ్స్ తినాలి అని యుద్ధసీమ నడిమధ్య అస్త్రసన్యాసం చేసి అడిగిన సవ్యసాచి అర్జునుడిలా దీనంగా మొహంపెట్టి అడిగాము. ఎక్కీస్ అన్నాడు. ఎక్కిళ్లు వచ్చాయి. 21 లో అప్పటికి అయిదే అయ్యాయి.
అప్పటికే కడుపులో చోటు లేకపోవడంతో సర్వర్ తో ఒక ద్వైపాక్షిక ఒడంబడిక చేసుకున్నాము. మిగతావన్నీ ఒక్కో ముద్ద రుచి చూస్తాము. ఇలాగే ఏది ఎలా తినాలో దగ్గరుండి మార్గదర్శనం చేయమన్నాము. అలాగే కొసరి కొసరి అన్నీ తినిపించాడు. చివర రెండు స్వీట్లలోకి నెయ్యి ధారాళంగా కుమ్మరించాడు. రుచి చూడాల్సిందే అంటే కాదనలేకపోయాము. మట్టి గ్లాసులో గులాబీ తీపి వాటర్, మరో మట్టి గ్లాసులో మసాలా మజ్జిగ తాగకపోతే రాజస్థానీ భోజనం సంపూర్ణం కాదని మొహమాటపెట్టాడు. నిండా మునిగినవాడికి చలేముంది? అనుకుంటూ తాగేశాము.
ఏ మాటకామాట. ఉదయ్ పూర్ లో తొలి భోజనం మహారాజ వైభోగంగా కడుపులో పడింది. ప్లేటు 850 రూపాయలు అయితే అయ్యింది కానీ…సంప్రదాయ రాజస్థానీ రుచి తెలిసింది.
రేపు:-
“ఏనాటిది మేవాడ్ రాజ్యం?”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు