భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ శాఖ నూతన అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి నియమితులయ్యారు. బిజెపి కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 2004లో రాజకీయ రంగప్రవేశం చేసిన ఆమె మన్మోహన్ సింగ్ కేబినేట్ లో సహాయ మంత్రిగా, రెండవ పర్యాయం ఇండిపెండెంట్ హోదాలో సహాయ మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం బిజెపిలో చేరిన ఆమె జాతీయ కార్యవర్గంలో వివిధ హోదాల్లో పని చేస్తూ ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
కొద్ది సేపటి క్రితం వరకూ ఆమె పేరు అసలు వార్తల్లో కూడా లేదు. జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్, లేదా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ల పేర్లు కొద్ది నిమిషాల వరకూ వినిపించాయి. కానీ అనూహ్యంగా చివరి క్షణంలో పురంధేశ్వరి పేరును ఖరారు చేశారు.
కాగా, ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా తీసుకున్నారు.