Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

సామాజిక వివక్షను అంతమొందటించే ఆయుధం ‘తెలంగాణ దళితబంధు’ అనీ, ఈ కార్యక్రమం దేశానికే దిశా నిర్దేశం చేస్తుందనడంలో సందేహం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ పాఠాన్ని ప్రసంగిస్తూ.. దేశం నేడు స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు జరుపుకుంటోందని, 75 ఏళ్ల స్వాతంత్ర్యం సాక్షిగా దళిత జాతి సాధికరత అనేది కలగా మిగిలిపోయిందని హరీశ్‌రావు అన్నారు. దేశాన్ని ఏలిన పాలకపక్షాలు కొన్ని పథకాలు చేపట్టినా అసంపూర్ణ ఫలితాలనే ఇచ్చాయని, రాజ్యాంగం అందించిన రిజర్వేషన్ల ఫలితంగా దళితులు విద్యను, ఉపాధిని పొందగలిగారన్నారు.
అయినా దళితవాడలు పేదరానికి ఆనవాళ్లుగా మిగిలిపోయాయని, మెజారిటీ దళిత జనం ఇంకా రెక్కల కష్టం మీదనే బతుకున్నారనేది అంగీకరించాల్సిన చేదు నిజం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టిందన్నారు. షెడ్యూల్‌ కులాల, తెగల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషను అనుసరించి, కొన్నిసార్లు దామాషాకు మించి ప్రత్యేక నిధులు కేటాయిస్తోందన్నారు.

అంబేద్కర్‌ ఆశయాల స్ఫూర్తితో..
భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాల స్ఫూర్తితో దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ‘దళితబంధు’ అనేక విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.. తరతరాలుగా అనుభవిస్తున్న పేదరికాన్ని, సామాజిక వివక్షను అంతమొందటించే ఆయుధం ‘తెలంగాణ దళితబంధు’.. ఈ కార్యక్రమం దేశానికే దిశా నిర్దేశం చేస్తుందనడంలో సందేహం లేదన్నారు. దళితబంధు దళితబంధు కేవలం ఒక పథకం మాత్రమే కాదని.. ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని, వికాసాన్ని చేకూర్చే ఒక దృక్పథం.. ఒక సమర్థవంతమైన విధానమన్నారు.

దళిత జాతి ఆర్థిక ప్రగతి సాధించిన నాడు సామాజిక అంతరాలు క్రమక్రమంగా అంతరిస్తాయని, మానవ సంబంధాలు సమానత్వంతో పరిమళిస్తాయన్నారు. రాష్ట్రంలోని ప్రగతి దళిత కుటుంబానికి ఉపాధి కోసం రూ.10లక్షల ఉచిత ఆర్థిక సాయం అందించడంలో దళితబంధు ఓ భాగమని, ఇంత పెద్ద నగదు మొత్తాన్ని ఇంత వరకు ఏ పథకం ద్వారా ఎన్నడూ ఇవ్వలేదని చెప్పారు. దళిత కుటుంబానికి ఇంతటి భారీ ఆర్థిక సహాయాన్ని నేరుగా అందిస్తున్న పథకం అతిపెద్ద నగదు బదిలీ పథకంగా చరిత్రకెక్కిందన్నారు.

లింకేజీ లేదు.. నచ్చిన పని చేసుకోవచ్చు..
గత ప్రభుత్వాలు దళితుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను బ్యాంకు లింకేజీలను, కొలాటరల్‌ సెక్యూరిటీలతో ముడి పెట్టడం వల్ల ఆశించిన ప్రయోజనం దక్కలేదని, దళిత బంధు పథకానికి బ్యాంకు లింకేజీ లేదని స్పష్టం చేశారు. దీంతో పాటు పథకం లబ్ధిదారులకు నచ్చిన పనిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉందని, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంట్‌ రూపంలో పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందివ్వడం తెలంగాణ దళిత బంధు పథకం గొప్పదనమని చెప్పారు.

అందు కోసం.. దళిత రక్షణ నిధి
దళిత బంధు ద్వారా లబ్ధిపొందిన కుటుంబం ఏదైనా ఆపదకు గురైన సమయంలో ఆ కుటుంబం పరిస్థితి దిగజారిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం దళిత రక్షణ నిధి ఏర్పాటు చేసిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆపద సమయంలో ఈ నిధి వారికి కవచంగా నిలుస్తుందన్నారు. దళితబంధు పథకంలో భాగంగా ప్రభుత్వ లైసెన్స్‌లు పొంది ఏర్పాటు చేసుకునే వైన్స్‌ షాపులు బార్‌ షాపులు, వివిధ రకాల కాంటాక్టులు తదితర వాటిలో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

మార్చి నాటికి 40వేల కుటుంబాలకు లబ్ధి
ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 2,616 వైన్స్‌ షాప్‌లో 261 మద్యం దుకాణాలు దళితులకు ప్రభుత్వం కేటాయించిందన్నారు. లైసెన్స్‌లు పొందిన కుటుంబాలు తాము కలలో కూడా ఊహించని అద్భుతమని సంబురపడ్డారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పథకం ద్వారా మార్చి నెలాఖరు నాటికి 4వేలకోట్లతో దాదాపు 40వేల కుటుంబాలకు లబ్ధి చేకూరబోతుందన్నారు. దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంతో పాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్‌, చారగొండ మండలాల్లో ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేస్తుందన్నారు.

దాంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి వంద మంది చొప్పున 118 నియోజకవర్గాల్లో 11,800 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. వచ్చే సంవత్సరం రెండులక్షల మందికి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దశల వారీగా రాష్ట్రంలోని కుటుంబాలకు దళితబంధు ప్రయోజనాలు అందివ్వడం ప్రభుత్వ లక్ష్యమని, 2022-23 వార్షిక బడ్జెట్‌లో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు ప్రతిపాదించినట్లు హరీశ్‌రావు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com