Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకందాశరథీ! కవితాపయోనిధీ!- 3

దాశరథీ! కవితాపయోనిధీ!- 3

అన్ని వాద్యాలకు రారాజు వీణ. తీగ వాద్యాలకు తల్లి వీణ. సరస్వతి చేతి అలంకారం వీణ- కచ్ఛపి. నారదుడి చేతిలో ఆగక మోగే వీణ- మహతి. బొబ్బిలి వీణ. నూజివీడు వీణ. తంజావూరు వీణ. మైసూరు వీణ. త్రివేండ్రం వీణ. సరస్వతి వీణ. రుద్ర వీణ. చిత్ర వీణ. విచిత్ర వీణ. ఇంకా లెక్కలేనన్ని వీణలు. వీణలో భాగాలకు మన శరీరంలో మూలాధారాది చక్రాలకు లోతయిన సంబంధముందని నాదోపాసకులు చెబుతారు. అనాహత నాదమే మన శరీరంలో ప్రాణానికి ఆధారమయిన ఊపిరి. గుండె లయ సంగీతం. “వడిబాయక తిరిగే ప్రాణబంధుడా!” అని ఊపిరిలో ఉన్న దైవాన్ని, లయలో ఉన్న ప్రాణాన్ని అన్నమయ్య కనుగొన్నాడు.

సంగీతానికి రాళ్లు కరుగుతాయి. ప్రకృతి పులకిస్తుంది. దీపాలు వెలుగుతాయి. మేఘాలు కురుస్తాయి. పోయే ప్రాణాలు నిలబడతాయి. ఆ సంగీతంలో ప్రాణముందని గ్రహించాలి. నాదమే ప్రాణమని, దైవమని త్యాగరాజాదులు ఎలా ఉపాసించారో తెలుసుకోవాలి. సాహిత్యం, స్వరాలు తెలియకపోయినా మనదయిన సంగీతం వినడాన్ని చెవులకు అలవాటు చేయాలి. మనసుకు నేర్పాలి. సంగీతాభిరుచి రుచిని రుచి చూడాలి.

ప్రఖ్యాత వీణా విద్వాంసుడు ధూళిపాళ శ్రీనివాస్ ఇచ్చిన సమాచారం మేరకు ఒక్కో ప్రాంతం వీణది ఒక్కో ప్రత్యేకత. మీటినప్పుడు వీణ తీగలో పుట్టే శబ్దం వాడే చెక్క, తీగల అమరికను బట్టి ఆధారపడి ఉంటుంది.

తెలుగువారికి బొబ్బిలి, నూజివీడు వీణలు అత్యంత ప్రీతిపాత్రమైనవి. అందులో బొబ్బిలి వీణ శబ్ద మాధుర్యం వినాల్సిందే కానీ…మాటలకు అందేది కాదు.

తమిళనాడులో 90 శాతం తంజావూరు వీణనే వాడతారు. శబ్దం వీనులవిందుగా ఉంటుంది. వాడడం, మోయడం కూడా సులభం.

అన్ని వీణలను పనస చెక్కతోనే తయారు చేస్తారు. తేలిగ్గా ఉంటుంది. ఏ రుతువులో, ఏ వాతావరణంలో అయినా ఒకేలా ఉంటుంది.

తెలుగు నేలమీద ఈమధ్య మామిడి చెక్కతో కూడా వీణలు తయారు చేస్తున్నారు కానీ…అవి చాలా బరువు. రుతువులు మారుతున్నప్పుడు చెక్క సంకోచ వ్యాకోచాలకు గురై శబ్దం మారిపోతూ ఉంటుంది.

కర్ణాటక మైసూరు ప్రాంతంలో నల్ల చెక్కతో వీణలు తయారు చేస్తారు. అందుకే మైసూరు వీణ నల్లగా ఉంటుంది. మైసూరు వీణతో ప్రపంచాన్ని సమ్మోహనంలో ముంచి తేల్చినవాడు మన చిట్టి బాబు.

ఈమని శివశంకర శాస్త్రి మొదలు ఇప్పటి ఫణి నారాయణ దాకా వీణా వాదనలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న తెలుగువారు ఎందరో ఉన్నారు.

సినిమాల్లో వీణ పాటలకు దాశరథి పెట్టింది పేరు. ఆయన హృదయమే కోటి రతనాల తెలంగాణ వీణ. ఆ హృదయ తంత్రులు మీటి మీటి, దాటి వచ్చిన భావాలు-

“మదిలో వీణలు మ్రోగే
ఆశలెన్నో చెలరేగే
కలనైన కనని ఆనందం
ఇలలోన విరిసే ఈనాడే”

అనగానే-

“సిగ్గు చాటున మన లేత వలపు
మొగ్గ తొడిగింది
పాల వెన్నెల స్నానాలు చేసి
పూలు పూసింది”

చివరికి-

“రాధలోని అనురాగమంతా
మాధవునిదేలే
వేణులోలుని రాగాల కోసం
వేచి ఉన్నదిలే”

“నేనె రాధనోయీ గోపాలా!
అందమైన ఈ బృందావనిలో నేనె రాధనోయీ..
విరిసిన పున్నమి వెన్నెలలో
చల్లని యమునా తీరములో
నీ పెదవులపై వేణుగానమై పొంగిపోదురా నేనే వేళా
ఆడే పొన్నల నీడలలో
నీ మృదుపదముల జాడలలో
నేనే నీవై… నీవే నేనై..
అనుసరింతురా నేనేవేళా”

“మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన
ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే!” 

దాశరథి వీణ కృష్ణగానమవుతుంది. విన్న హృదయం రాధగా మారుతుంది. మొగ్గ తొడిగిన మన లేత వలపులు బృందావనంలో యమునాతీరంలో పాల వెన్నెల స్నానాల్లో పునీతమై అద్వైత సిద్ధి, అమరత్వ లబ్ధి పొందుతాయి.

రేపు:-
“తెలుగు గజల్ సారథి- దాశరథి”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్