Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకందాశరథీ! కవితాపయోనిధీ!- 5

దాశరథీ! కవితాపయోనిధీ!- 5

గాలిబ్(1796- 1869)అసలు పేరు మిర్జా అసదుల్లాఖాన్. టర్కీ ఐబక్ వంశీయుడు. పుట్టింది ఆగ్రాలో. కన్నుమూసింది ఢిల్లీలో. ఉర్దూ, పారశీక భాషల్లో అనితరసాధ్యమైన కవితలల్లినవాడు. ఢిల్లీ సుల్తాన్ కు ఆస్థాన కవి. లేఖకుడు. ఉర్దూ గజల్ ను హిమాలయంపై నిలిపినవాడు.

అలాంటి గాలిబ్ ను తెలుగువారి హృదయాల్లో ప్రతిష్ఠించినవాడు దాశరథి. ఉర్దూ సాహిత్యంతో బాగా పరిచయం ఉండడం దాశరథికి కలిసివచ్చిన విషయం. గాలిబ్ గజళ్లను ఎందరో తెలుగులోకి అనువదించి ఉండవచ్చుకానీ…దాశరథి ముందు అవన్నీ సూర్యుడిముందు దివిటీల్లాంటివే.

గాలిబ్ ఉర్దూ హృదయాన్ని పట్టుకుని…అందులో కవిత్వ అంశ పొల్లుపోకుండా తెలుగువారికి ఆ రుచి చూపించినవాడు దాశరథి. మిగతా భాషల్లోకి గాలిబ్ ఎలా అనువాదమయ్యాడో కానీ…దాశరథి ప్రయత్నంతో తెలుగువారికి మాత్రం దగ్గరి సాహితీ బంధువయ్యాడు.

ప్రేయసి తిరస్కారంలో, ప్రేయసి కాఠిన్యంలో కూడా ఏదో మాధుర్యాన్ని, వేదాంతాన్ని వెతుక్కుంటాడు గాలిబ్. ప్రియుడి గుండెను ప్రేయసి ఎంతగా గుచ్చి గుచ్చి గాట్లు పెట్టినా…కారే ఆ గుండె రక్తధారల్లో కవితాధారలను పట్టుకుంటాడు గాలిబ్. జీవితకాలం ప్రేయసి కోసం నిరీక్షించిన ప్రియుడు చివరికి కన్నుమూశాడు. చివరికి అతడి చితిమంటల పొగలు కూడా ప్రేయసి ఇంటివైపే వెళుతున్నాయంటాడు. చచ్చినా చావని ప్రేమ అది. తీరని దాహమది. ఆమెకోసం క్షణమొక యుగంగా నిరీక్షించాడు. చివరికి ఆమె తలపులతోనే అనంతవాయువుల్లో కలిశాడు. అప్పుడు ఆమె కరుణించిందట- అరెరే! ఆమె త్వరగానే కరుణించింది- నేనే తొందరపడి ముందే మరణించాను- అని తనను తాను తిట్టుకుంటాడు.

దాశరథి గాలిబ్ గీతాలు చదివినవారు ప్రేమను; విఫల ప్రేమను రెండిటినీ ఆనందిస్తారు. గౌరవిస్తారు. రెండూ తపస్సే అనుకుంటారు. గుండె గాయమే గేయమై పదే పదే అదే పాడుకుంటారు.

ఇలాంటి కావ్యాల్లో కవితలకు ఎంతగా వ్యాఖ్యానం చెప్పినా…వాటి లోతు, వైశాల్యం, భావసాంద్రత, మధురిమ అర్థం కావు. అందుకే మచ్చుకు కొన్ని పంక్తులు యథాతథంగా:-

“ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము,
నరుడు నరుడౌట యెంతో దుష్కరమ్ము సుమ్ము”

“అన్ని రోగములకు నౌషధం బుండియు
ప్రణయరోగమునకు కనము మందు”

“సింధువునుజేరి బిందువు సింధువగును;
ధ్యేయమునుబట్టి ప్రతిపని దివ్యమగును”

“నిప్పు నీళ్లలో చల్లార చప్పుడగును,
ఎదియు గతియించునపుడు రోదించుగాదె!”

“ప్రేయసిగృహవీధి స్పృహతప్పి పడిపోయి
ముదితకాలిగురుతు ముద్దుగొంటి”

“బాధలో నాకు రుచి కనుపట్టగానె
చాన నన్ను బాధించుట మానుకొనెను”

“ఎంతకని వ్రాతు నా గుండెవంత? నింక
ఆమెకున్‌ జూపెదను రక్తిలాంగుళులను”

“వత్తునని రాక, నాయింటి వాకిలిని
నన్నె కావలిగా నిల్పినా వదేమె?”

“నాదు గుండెగాయము కుట్టు సూదికంట
అశ్రుజలధార దారమై అవతరించె”

“ఏల కాళ్లు నొచ్చె బాలామణికి? రాత్రి
ఎవని స్వప్నసీమ కేగివచ్చె?”

“ఆమె ముద్దిచ్చుటకు వెనుకాడదేమొ!
కాని ఇమ్మని అడుగగా లేను నేను”

కొస వెలుగు:-
1970లో అచ్చయిన ఈ అనువాద కావ్యాన్ని దాశరథి ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వర రావుకు అంకితమిచ్చారు. ఇందులో కవిత్వానికి పోటీ పడ్డాయి బాపూ గీచిన బొమ్మలు.

రేపు:-
“గర్జించే కవిత్వం .. గర్వించే పాటలు”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్