Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవికృతే ప్రకృతి!

వికృతే ప్రకృతి!

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సృష్టించిన యాంకరమ్మను ఏమనాలి?
కె. మేధ
గ్రాఫిక్ మేధ
యానిమేషన్ మేధ
యంత్ర మేధ
భ్రమ
డిజిటల్ బొమ్మ.. ఇలా ఎన్ని పేర్లయినా పెట్టుకోవచ్చు. మనకు ఓపిక లేకపోతే ఆ కృత్రిమ మేధనే అడిగితే లెక్కలేనన్ని కృత్రిమ నామాలను సృష్టించి ఇవ్వగలదు.

ఒరిస్సా భాషలో వార్తలు చదివే ఒక కృత్రిమ యాంకరమ్మ “లీసా”ను ఒరియాలో ఆవిష్కరించగానే… తెలుగులో బిగ్ టీ వీ వారు అలానే కృత్రిమ మేధతో వార్తలు తనంతట తానే చదివే యాంకరమ్మను ఆవిష్కరించారు. తనకు “మాయ” అని బిగ్ టీ వీ వారు నామకరణం చేసినట్లు చెప్పుకుంది. నెమ్మదిగా అన్ని భాషల్లో అందరూ కృత్రిమ మేధ యాంకర్లను పుట్టించారు.

చిన్నయసూరి తెలుగు వ్యాకరణం ప్రకారం-
“స్త్రీ తిర్యగ్జడ భిన్నంబులును వాని విశేషణంబులును మహత్తులనంబడు”.

ఆమె పాట పాడుతోంది.
ఆయన పాట పాడుతున్నాడు.
కోయిల(అది) పాట పాడుతోంది.
వారు పాట పాడుతున్నారు.

క్రియా పదంలో చివర డు, ది, రు ద్వారా లింగావచనాలు సులభంగా తెలిసిపోతాయి. ఎంత చదువు లేనివారయినా…

“ఆమె పాడుతున్నాడు.
ఆయన పాడుతోంది.
కోయిల(అది) పాడుతున్నాడు.
వారు పాడుతోంది…” అని పొరపాటున కూడా అనరు. మాతృభాష తెలుగయినవారికి ఈ లింగ వచన వ్యాకరణాలేవీ తెలియకపోయినా చక్కగా ఆ నియమాలకు లోబడే మాట్లాడుతూ ఉంటారు.

చిన్నయసూరి వ్యాకరణ సూత్రాలు రాసే నాటికి కృత్రిమ మేధ లేదు కాబట్టి పురుషుడయితే “డు”; స్త్రీ అయితే “ది”; జంతువులు, ప్రాణం లేనివయితే “ది”; బహువచనంలో అయితే రు, లు, ళ్లు…క్రియాపదంలో చివర వస్తాయని…మానవ మేధనంతా ఉపయోగించి చెప్పాడు.

ఇప్పుడు కృత్రిమ మేధ యాంకర్ ను ఏ లింగవచనంలోకి తీసుకురావాలో కూడా కృత్రిమ మేధనే అడగలేమో! “స్త్రీ తిర్యక్, జడ భిన్నంబులు…” అన్న ప్రామాణిక వ్యాకరణ సూత్రం ప్రకారం ప్రాణం లేనిది కాబట్టి “అది” అనాలా? “అది” అని నన్ను అగౌరవరంగా అనడానికి వీల్లేదు…ఆమె అనాల్సిందే అని లీసా- మాయమ్మలు ముక్తకంఠంతో మన కంఠాలు పట్టుకున్నా పట్టుకోవచ్చు!

Give respect and take respect అని మర్యాద ఇస్తేనే వస్తుంది కాబట్టి మాయా లీసాలను మనం గౌరవిస్తే…వారు/అవి మనల్ను గౌరవిస్తారు/యి.

కృత్రిమ యాంకర్ “మాయమ్మ” మాటలు మరబొమ్మ మాటల్లా ఉన్నాయన్న పెదవి విరుపులు కూడా చూడబోతే తర్కానికి నిలబడేలా లేవు. రక్తమాంసాలతో ప్రాణమున్న యాంకరయ్యలు, యాంకరమ్మలు-
“మేఘాల రుధిర ధారలు”
“పెల్లిల్లు”
“తాలి కట్టడాలు”
“షాషన సభ”
“సెనివారం”
“దస తిరిగింది”
“బారత ప్రదాని”
“ఉధ్యమించడం”
లాంటి తెలుగు ప్రకృతి ఆణి ముత్యాలను ప్రేక్షకులుగా మనం అంగీకరించి…మౌన ప్రేక్షకులుగా ఉన్నప్పుడు…
కృత్రిమ మేధ కడుపున పుట్టిన వికృతి మాయలు యాంత్రికంగా మాట్లాడుతున్నార(య)ని విమర్శించే హక్కు మనకు ఉండదు.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దూరదర్శన్ వ్యవసాయ టీ వీ లో కృత్రిమ మేధతో రెండు రోబో యాంకర్లను ప్రవేశపెట్టబోతున్నారు. ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ యాంకర్ల పేర్లు- ఏ ఐ క్రిష్ ; ఏ ఐ భూమి.

మనలో మన మాట.
ఇప్పుడు ఎవరు ఎవరికి పోటీ? వర్చువల్ స్టూడియోలతో బ్యాక్ డ్రాపులు, సెట్లు పోయినట్లు…కృత్రిమ మేధతో యాంకర్ల జాతి మనుగడే పెను ప్రమాదంలో పడిందా! ఏం పాడు?

అయినా మాతృ భాషలో సహజంగా ఉన్న అభివ్యక్తిని, పలికే అందాన్ని, మాండలికం సొగసును వదిలి పెట్టి కృతకంగా మాట్లాడే మనకంటే ఏ ఐ మాయమ్మలు, రోబో చిలక పలుకులు కోట్ల కోట్ల రెట్లు నయమే!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్