నాలుగేళ్ళ క్రితం మార్కెట్ లో కొత్తగా వచ్చిన యురేకా ఫోర్బ్స్ వాక్యూమ్ క్లీనర్ కొన్నాను. అది వైర్ లెస్ కావడంతో చాలా హాయిగా ఉంది. అంతకు ముందు పదిహేనేళ్లుగా ఒక వాక్యూమ్ క్లీనర్ ఉండేది. పెద్దగా వాడలేదు. అది ఇచ్చేసి కొత్తగా కొన్నది రెండేళ్లు బాగా పనిచేసింది. తర్వాత రిపేర్ వచ్చింది. కంపెనీ వాడు నెలరోజులు పెట్టుకుని రిపేర్ చేశాడు. తర్వాత ఆరునెలలకే మళ్ళీ రిపేర్. ఈసారి స్పేర్ పార్టులు లేవని సర్వీసింగ్ సెంటర్ జవాబు. ఆ ప్రోడక్ట్ మార్కెట్ లోనే లేదట. ఆ మధ్యనే ఈ కంపెనీ విడుదల చేసిన ఎయిర్ ప్యూరిఫైయర్ ది కూడా అదే పరిస్థితి. మళ్ళీ వాటర్ ఫిల్టర్స్ రంగంలో యురేకా ఫోర్బ్స్ అంటే పెద్ద పేరు. సుమారు యాభై వేల పెట్టుబడి అలా మూలపడింది. కంపెనీ సీఈఓ కి రాసినా లాభం లేదు. ఏం చేయాలంటే కొత్తది కొనుక్కోమంటున్నారు. అంటే మళ్ళీ పెట్టుబడి.
ఎవరైనా వ్యాపారం లాభాల కోసమే చేస్తారు. కానీ కొన్ని దశాబ్దాల క్రితంతో పోలిస్తే వినియోగదారుడిని కీలుబొమ్మగా మార్చిన వికృత వ్యవస్థ మనకు కనిపిస్తుంది. టెక్నాలజీ పెరిగింది. ఉపాధి మెరుగయిందని ఆనందిస్తున్నాం గానీ అందుకోసం కోల్పోయిన మరెన్నో రకాల వృత్తులు మర్చిపోయాం. అవసరం లేకపోయినా కొంటూ ఉండాలి. అదే ప్రస్తుత మార్కెట్ మాయాజాలం. అందుకు అనుగుణంగా మన బుర్రల్ని ప్రోగ్రాం చేసేశారు. ఒకప్పుడు ఇంట్లో బల్బులు, లైట్లు ఏళ్ళ తరబడి ఉండేవి. ఇప్పుడు ఏడాదికే పాడయిపోతున్నా యాంత్రికంగా మార్చేస్తున్నాం. ఎప్పుడూ మార్కెట్ లో లేటెస్ట్ గా ఏమొచ్చాయా అని వెతుకుతూ ఉంటాం. లేకపోతే అవుట్ డేటెడ్ అంటారేమో అని బాధ. అంతెందుకు? ఇంట్లో ఫోన్ ఉంటే అపురూపంగా ఉండేది. ఇప్పుడు రోడ్ పై సెల్ ఫోన్ లేనివాళ్లే కనబడరు. అది కూడా ఒకటి రెండేళ్లకే మార్చేస్తున్నారు. ఏడాదికి రెండుమూడు జతల బట్టలు కొనేవారు. ఇప్పుడు ఏడాదంతా కొంటునే ఉంటారు. ఇదంతా వ్యవస్థగా మార్చింది ఫోబస్ కార్టెల్. అంతర్జాతీయంగా ఉన్న బల్బ్ తయారీ కంపెనీల వాళ్ళందరూ ఏకమై 1925 లో ఏర్పడ్డ సంస్థే ఫోబస్ కార్టెల్. వీరు బల్బ్ ల జీవిత కాలం తగ్గించి తమ కంపెనీల అమ్మకాలు పెంచుకునే ఆలోచనలు అమలు చేశారు. తద్వారా వినియోగదారులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు( ప్లాన్డ్ అబ్ సొలెన్స్). అప్పటినుంచి దాదాపు అన్ని కంపెనీలది అదే బాట. ఉత్పత్తుల సామర్థ్యం తగ్గించడం, వినియోగదారులను మోసం చేసి మళ్ళీ మళ్ళీ కొనిపించడం. ఇప్పుడిది వ్యవస్థీకృతమై పోయింది.
ముందు తమ వస్తువు గొప్పదని కొనిపిస్తారు. ఆపై కొంత కాలానికే మార్కెట్ నుంచి ఆ వస్తువు కనుమరుగవుతుంది. రిపేర్ వస్తే స్పేర్ పార్టులు దొరకవు. దాంతో మళ్ళీ కొత్తది సరికొత్త మోడల్ మరింత డబ్బు పోసి కొంటాం. బల్బ్ లతో ప్రారంభమైన ఈ దోపిడీ ఎక్కడా ఆగడం లేదు. ఇప్పటికే వినియోగదారులు ఈ మాయలో ఇరుక్కుపోయారు. దానికి తోడు ప్రకటనల్లో పాతవి వాడుతున్నవారివి పాత కాలపు రోత ఆలోచనలు అన్నట్టుగా ఉంటాయి. కొత్త కారు, వస్తువులు, ఇల్లు …. ఇలా అన్నీ మార్చేస్తేనే మంచి జీవితం అని ఎక్కిస్తున్నారు. దాంతో ఆలోచన మరచిపోయిన వినియోగదారులు ఆ మాయలో పడి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఈ మాయలో ఇరుక్కోని వారు చాలా తక్కువ. కానీ వారిని చూస్తే తెలుస్తుంది అసలైన అనందం ఏమిటో! వినియోగదారుడే రాజు అన్నారు గాంధీజీ. ఆమాట పట్టుకుని నెత్తిన టోపీ పెట్టి లాభాలు దండుకుంటున్నారు కంపెనీల వారు. ఈ చక్రంలో నలిగిపోతోంది మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలవారే. ఇప్పటికైనా ఈ దోపిడీ గురించి వినియోగదారులను చైతన్యపరిచే ప్రయత్నాలు జరగాలి. ప్రభుత్వాలు ఆ బాధ్యత తీసుకోవాలి. అంతకన్నా ముందుగా మనం మేల్కోవాలి. అవసరం లేకున్నా కొనడం మానెయ్యాలి. ఉన్నవే వాడుకోవడం నేర్చుకోవాలి. అది మన ఇంటి ఆర్థిక వ్యవస్థ కొత్త చిగుళ్లు తొడిగేలా చేస్తుంది. మరి మేలుకుందామా ఇప్పటికైనా!
(అంతర్జాలంలో తిరుగుతున్న పోస్టుకు స్వేచ్ఛానువాదం)
కె. శోభ