Saturday, April 20, 2024
Homeజాతీయంయూపీలో జోరుగా ఫిరాయింపులు

యూపీలో జోరుగా ఫిరాయింపులు

Defections between SP & BJP: దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో పార్టీ ఫిరాయింపుల పర్వం జోరుగా కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకూ వేచి చూసిన ఎమ్మెల్యేలు అలా షెడ్యూల్ విడుదలైందో లేదో ఇలా పార్టీలు మారే పనిలో బిజీగా ఉన్నారు.

యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ నుంచి ఇద్దరు మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారా సింగ్ చౌహాన్ తో సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు బిజెపికి రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇద్దరు కీలక ఓబీసీ నేతలు పార్టీని వీడడం కమలానికి పెద్ద షాక్ అని చెప్పవచ్చు, అయితే వీరి రాజీనామాతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకునేందుకు బిజెపి కూడా పావులు కదిపింది.

మరోవైపు, ఇద్దరు సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే తమ పదవులకు రాజీనామా చేసి ఢిల్లీ లోని బిజెపి కేంద్ర కార్యాలయంలో కమలం పార్టీలో చేరారు. ఫిరోజాబాద్ ప్రాంతంలోని సిర్సా గంజ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న హరి ఓం యాదవ్ సమాజ్ వాదీ పార్టీపై నిప్పులు చెరిగారు. “అది ములాయం పార్టీ కాదు, బూట్లు నాకే వాళ్ల పార్టీ” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది నేతలు అఖిలేష్ చుట్టూ చేరి చెప్పుడు మాటలతో ఆయన్ను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.

పార్టీలో తనను ఎదగనీయకుండా రాం గోపాల్ యాదవ్ అడ్డు పడుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో వారి రాజకీయ జీవితానికి తాను ముప్పు అవుతానని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే హరి ఓం యాదవ్ ను పార్టీ వ్యతిరేక కాల్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ గత ఫిబ్రవరిలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

గురువారం మరో ఎమ్మెల్యే ముఖేష్ వర్మ బిజెపికి రాజీనామా చేశారు. స్వామి మౌర్యకు మద్దతుగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్